ఫామ్ హౌస్ లో స్వయంగా ఓమ్ని కారు నడిపిన కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా కారు నడిపారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఓమ్ని కారు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.

By :  Vanaja
Update: 2024-06-27 13:24 GMT

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా కారు నడిపారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఓమ్ని కారు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాలుకి ఆపరేషన్ తర్వాత ఆయన కారు నడుపుతున్న వీడియోలు బయటకి రావడంతో అంతా షాకవుతున్నారు. అయితే ఆయన సరదా కోసమో, కాలక్షేపం కోసమో కారు నడపలేదు. డాక్టర్ల సూచన మేరకు కారు నడిపే ప్రయత్నం చేశారు.

డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ ప్రతిరోజు కారును డ్రైవ్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓల్డ్ మోడల్ మారుతి ఓమ్ని వెహికల్‎ ని తెప్పించారు. కొన్ని అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ లో కాలు జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముకకు ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి మెల్లమెల్లగా నడక ప్రారంభించాలని డాక్టర్లు సూచించారు. తర్వాత రెండవ దశలో తుంటి గట్టి పడాలంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న కారు డ్రైవ్ చేయమని సలహా ఇచ్చారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న ఓమ్ని కారుని ప్రతిరోజూ నడుపుతున్నారు. దీనివల్ల క్లచ్, గేర్, యాక్సిలరేటర్ పదేపదే నొక్కడంతో కాళ్లు తుంటి వెముకలు గట్టిపడతాయని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రోజూ వారి వ్యాయామంలో భాగంగా ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఆయన కారులోనే ఫామ్ హౌస్ మొత్తం చుట్టేస్తున్నారు.

ర్యాలీలో భాగంగా స్వయంగా కారు నడిపిన కేసీఆర్...

నిజానికి కేసీఆర్ కి కారు నడపడమంటే చాలా ఇస్తామని సన్నిహితులు చెబుతుంటారు. గతంలో తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు కార్ ర్యాలీలో భాగంగా ఆయనే స్వయంగా కారు నడిపారు. ఆ తర్వాత ఎంజి కంపెనీకి సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ కారు కూడా కొనుగోలు చేసి ఆయన ఫార్మ్ హౌస్‎లో ఉపయోగించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోవడంతో కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. అక్కడే వ్యవసాయం పనులు చూసుకుంటున్నారు. కాలికి గాయమై యశోదాలో ఆపరేషన్ జరిగి డిశ్చార్జ్ అయ్యాక కొద్దిరోజులు నంది నగర్ లో నివాసమున్నారు. అనంతరం ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు.

పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు ఉంటే తన ఫామ్ హౌస్ కే నాయకులను పిలిపించుకుని భేటీ అవుతున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి ఫామ్ హౌస్ లోనే సమావేశాలు నిర్వహించారు. వరుసగా రెండు రోజులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీలతో భేటీ అయ్యారు. ప్రలోభాలకు లొంగొద్దని, పార్టీ మారొద్దని, భవిష్యత్తు మనదే అని భరోసా కల్పించారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తరచూ కలుస్తాను అని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News