వైభవోపేతంగా కార్తీకమాస దీపోత్సవ వేడుకలు

తెలంగాణలో కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ శనివారం నుంచి సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది.

Update: 2024-11-02 14:17 GMT

కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ శనివారం నుంచి సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ ప్రకటించారు.డిసెంబర్ 1వతేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

- కార్తీకమాస దీపోత్సవ వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో కార్తీకమాస దీపోత్సవ వేడుకలను కన్నులపండువగా నిర్వహించేలా కార్యనిర్వహణాధికారులు, అసిస్టెంట్ కమిషనర్లకు మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు.
- ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని దేవాలయాల్లో కార్తీక దీపోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు రెండు మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

మహిళా భక్తులకు ఉచితంగా పసుపు కుంకుమ
కార్తీక మాస దీపోత్సవ వేడుకలకు హాజరయ్యే మహిళా భక్తులకు ఉచితంగా పసుపు కుంకుమ అందిస్తామని దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు. ప్రధాన దేవాలయాల్లో మహిళా భక్తులకు బ్లౌజ్ పీస్ లను అందించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం సామూహిక దీపోత్సవ సమయంలో ప్రత్యేక ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. సంబంధిత దేవాలయానికి చెందిన నిధులు, దాతల సహకారం ద్వారా ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.

దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
కార్తీక మాసం సందర్భంగా దేవాలయాల్లో ప్రతిరోజు సాయంత్రం స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజులను పురస్కరించుకుని మొత్తంగా కార్తీక మాసంలో ఐదు రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్థానిక కళాకారులతో పాటు, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రముఖ కళాకారులతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రవచనాలు, భజనలు, కీర్తనలు, భక్తి పాటలు, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలు, బుర్రకథ, హరికథ తదితర కార్యక్రమాలను దేవాదాయ శాఖ చేపట్టనుంది.

కార్తీకదీపాలను వదిలేందుకు నీటి కొలనులు
కార్తీకదీపాలను వదిలేందుకు నీటి కొలనుల ఏర్పాటు చేయనున్నారు. భక్తి ఛానల్, ఎఫ్ఎం రేడియో తదితర సమాచార సాధనాల ద్వారా కార్తీక మాస దీపోత్సవ వేడుకల ప్రచారం చేయాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అవకాశమున్నచోట ప్రత్యేక 'నది హారతి' కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్తీక మాస దీపోత్సవ వేడుకల నిర్వహణ సందర్భంగా అభిషేకాలు, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ప్రముఖ ఆలయాల్లో మంత్రి పూజలు
కార్తీక మాస దీపోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్తీక సోమవారాల్లో ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్తీక మాసం మొదటి సోమవారమైన నవంబరు 4 న కీసర లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం నిర్వహించే కార్తీక మాస దీపోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు చెప్పారు.


Tags:    

Similar News