గజ్వేల్ లోని తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదలశాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ భూక్యా హరి రామ్ పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి సంపాదనకు మించిన ఆస్తులున్నాయని కేసు నమోదు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజినీర్ భూక్యా హరి రూ,200 కోట్లరూపాయల ఆస్తులకు అధిపతి అని తేలింది. కాళేశ్వరం కుంభకోణంలో ఇంకెంత మంది అక్రమాలకు పాల్పడ్డారనేది తేలాల్సి ఉంది.ఎన్డీఎస్ఏ రిపోర్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారని పేర్కొన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు మరింత మంది అక్రమార్కులపై దృష్టి సారించారు.
మంత్రి ప్రకటన నేపథ్యంలో ఏసీబీ కేసు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేశారని, నాసిరకం పనుల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టులో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం నాసిరకంగా జరిగిందని పేర్కొందని మంత్రి ప్రకటించిన రెండు రోజుల్లోనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అప్పటి కాళేశ్వరం ఇంజనీర్-ఇన్-చీఫ్ అయిన భూక్యా హరి రామ్ పై దాడులు చేశారు.
వందల కోట్ల రూపాయల ఆస్తులు
ఏసీబీ అధికారులు భూక్యా హరి రామ్ నివాసంతో పాటు ఆయన బంధువులకు సంబంధించిన 13 స్థలాల్లో సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయల విలువైన స్థిర,చరాస్తులను గుర్తించి షాక్ అయ్యారు.శ్రీనగర్, మాదాపూర్, నార్సింగి ప్రాంతాల్లో మూడు ఫ్లాట్లు, షేక్ పేట్, కొండాపూర్ ప్రాంతాల్లో రెండు విల్లాలు,రెండు ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. హరిరామ్ ఆస్తుల చిట్టా ఇంకా పెరిగే అవకాశముందని ఏసీబీ అధికారులు చెప్పారు. ఏసీబీ దాడుల భయంతో హరిరామ్ చాలా ఆస్తులను బినామీల పేర్లపై బదలాయించారని వెల్లడైంది.
అమరావతిలోనూ ఆస్తులు
భూక్యా హరి రామ్ కు అమరావతిలో వాణిజ్య స్థలం ఉందని తేలింది. కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న మర్కూక్ మండలంలోనే కాళేశ్వరం ఈఎన్ సీగా పనిచేసిన హరిరామ్ 28 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం విశేషం. పటాన్ చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ గృహాలు, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల్లో మామిడి గార్డెన్ ఫాంహౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో రెండు ప్లాట్లు, బీఎండబ్ల్యూతోపాటు రెండు కార్లు, బ్యాంకుల్లో నగదు నిల్వలతో పాటు బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
కాళేశ్వరంలో అవినీతి తిమింగలం
కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్ సీగా భూక్యా హరిరామ్ డిజైన్ల ను మార్పు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. డిజైన్లు మార్చిన విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ సంస్థ (ఎన్డీఎస్ఏ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.ఇంజనీర్-ఇన్-చీఫ్ భూక్యా హరి రామ్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు రిమాండుకు తరలిస్తూ జడ్జి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.