Kadiyam Srihari | ‘కేసీఆర్ కుటుంబమంతా జైలుకెళ్లడం ఖాయం’
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. పలు అంశాల్లో రెండు పార్టీల నేతల మధ్య వాడివేడిగా మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి.;
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. పలు అంశాల్లో ఈ రెండు పార్టీల నేతల మధ్య వాడివేడిగా మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ నేతలంటే.. తెలంగాణను బద్నాం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ నేతుల మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే భారీగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంటే.. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్‌దేనంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.
బయటకు వస్తే ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అన్న భయంతోనే కేసీఆర్.. ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని కూడా పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ కుటుంబం, కేటీఆర్, బీఆర్‌ఎస్‌లను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అంతా ఇంతా కాదంటూ తీవ్రంగా స్పందించారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని కూడా జోస్యం చెప్పారు.
‘‘కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్. కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరులను కొల్లగొట్టి కొత్తరకమైన అవినీతికి పాల్పడింది. ఇప్పుడు తాము నీతివంతులం, నిజాయితీపరులమని మాట్లాడుతున్నారు. ఆ కుటుంబం నుండి లిక్కర్ కేసులో ఇరుక్కొని కవిత జైలుకు వెళ్ళారు. ఈ ఫార్ములా కేసులో రేపో మాపో కెటిఆర్ కూడా జైలుకు వెళ్లబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్, హరీష్ రావు అనేక విధాలుగా సాంకేతిక తప్పులు చేశారు. ఈ కల్వకుంట్ల కుటుంబం అంతా రేపో మాపో జైలులో ఊచలు లెక్కపెట్టబోతున్నారు. మీరు నిజాయితీపరులు అయితే మీపై ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి. ఇన్ని సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎలా లభ్యం అవుతున్నాయి. 2014 లో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని..? ఇప్పుడు ఎన్ని..? 10 కోట్లకు మించని మీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి.? వందలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయి..?’’ అని ఆయన ప్రశ్నించారు.