కొండా సురేఖకు కేఏపాల్ వార్నింగ్.. ఐఏఎస్ హితవు..

మంత్రి కొండ సురేఖకు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆమెపై కేసు వేస్తానంటూ హెచ్చరించడమే కాకుండా 72 గంటల డెడ్‌లైన్ కూడా పెట్టారు కేఏపాల్.

Update: 2024-10-03 10:08 GMT

సమంతపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండ సురేఖకు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆమెపై కేసు వేస్తానంటూ హెచ్చరించడమే కాకుండా 72 గంటల డెడ్‌లైన్ కూడా పెట్టారు కేఏపాల్. తన రాజకీయాల కోసం ఒక ఆడ మనిషి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుకీడ్చడం ఏమాత్రం సమంజసం కాదని, కొండా సురేఖ మతిభ్రమించే ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. సమంత, నాగార్జున ఇళ్లకు వెళ్లి మరీ ఆమె క్షమాపణలు చెప్పాలని కేఏపాల్ హెచ్చరించారు. ఇప్పటికే ఈ అంశంపై సినీ పరిశ్రమ సహా రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక కొండా సురేఖ ఆలోచన ఏంటని, ఎవరినో అవమానించడానికో, విమర్శించడం కోసమే అసలు సంబంధం లేని మరెవరినో అత్యంత దారుణంగా అవమానించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. సినీ పరిశ్రమలో కీలకంగా నిలిచే అక్కినేని కుటుంబాన్ని ఇంతటి జుగుప్సాకరంగా అవమానించాల్సిన అవసరం కొండా సురేఖకు ఏమొచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు విని చాలా బాధపడినట్లు చెప్పారు. మరోవైపు వివాదాలకు కేరాఫ్‌గా పేరు పొందిన ఆర్‌జీవీ కూడా ఈ అంశంపై సంచలనంగా స్పందించారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలతో అవమానించింది సమంతను కాదని, అక్కినేని కుటుంబాన్నంటూ ఆయన కూడా కొండాసురేఖపై నిప్పులు చెరిగారు.

కుక్క కరిస్తే వచ్చే మాటలివి: కేఏపాల్

కొండా సురేఖ మాటలు చట్ట విరుద్ధమని కేఏపాల్ గుర్తు చేశారు. ఇదే ఘటన అమెరికాలో జరిగి ఉంటే మిలియన్ డాలర్ల పరువునష్టం దావా వేస్తారని వివరించారు. ‘‘ఒక వ్యాఖ్య చేసినందుకు రాహుల్ గాంధీకి తన పార్లమెంటు సభ్యత్వమే పోగొట్టుకోవాల్సిన దుస్థితి పట్టింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అలనాడు రాహుల్ చేసిన వాటికన్నా 100 రెట్లు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇంతలా హద్దుమీరి మాట్లాడినా ఇప్పటి వరకు ఆమెకు నోటీసులు జారీ చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదో డీజీపీ చెప్పాలి. ఇప్పుడు కొండా సురేఖ సారీ చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. హత్య చేసేసి సారీ అంటే చనిపోయిన వారు బతికి వస్తారా? ఇది కూడా అంతే ఉంది. కొండా సురేఖ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ఆమెపై నేను కేసు దాఖలు చేస్తాను. ఆమె తన పదవికి రాజీనామా చేసినా.. ఆమెను తొలగించినా ఆమెపెట్టే కేసులో ఒక సెక్షన్ తగ్గుతుంది అంతకు మించి ఎటువంటి మార్పు ఉండదు’’ అని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా హైడ్రా కారణంగా పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డే పక్కా ప్లాన్‌తో కొండా సురేఖ చేత ఈ వ్యాఖ్యలు చేయించారా అన్న అనుమానాన్ని కూడా కేఏపాల్ వ్యక్తం చేశారు.

స్త్రీలంటే థంబ్‌నెయిల్స్ కాదు: స్మితా సబర్వాల్

కొండా సురేఖ వివాదంపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాలు ఘాటుగా స్పందించారు. ప్రస్తుత సమాజంలో స్త్రీలంటే క్లిక్ బైట్స్, సంచలన థంబ్‌నెయిల్స్‌గా మారిపోయారని ఆమె వ్యాఖ్యానించారు. అది సరైన పద్దతి కాదని, దీనిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ‘‘ఆఖరికి అధికారులను కూడా వదలడం లేదు. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా.. కష్టపడి జీవితంలో ఎదగడం తప్పు కాదు కదా.. మహిళలు, కుటుంబాలు, సామాజిక నిబంధనలను గౌరవిద్దాం. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విని షాక్ అయ్యా. అన్ని విషయాలను రాజకీయాల కోసం వాడుకోవద్దు. హుందాగా వ్యవహరించాలి’’ అని హితవు పలికారు. ఈ సందర్భంగా అసలు ఇప్పుడు సమయంలో రాజీకాయాల్లోకి సమంత ఎందుకు వచ్చారో కూడా తనకు అర్థం కావట్లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ అవమానం సమంతకు కాదు: ఆర్‌జీవీ

ఈ నేపథ్యంలోనే అసలు కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల డ్యామేజీ జరిగింది సమంతకు కాదని, అక్కినేని కుటుంబానికని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని నాగార్జున, అక్కినేని నాగచైతన్య చాలా సీరియస్‌గా తీసుకుని, సరైన గుణపాఠం నేర్పాలని కూడా ఆర్‌జీవీ కోరారు. ‘‘తానక్కడే ఉండి చూసి, విన్నట్లు బల్లగుద్ది మరీ మీడియాతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. ఒక మంత్రి హోదాలో ఉండి అక్కినేని కుటుంబంపై, ఇండస్ట్రీ గర్వించదగ్గ నటి సమంతను ఉద్దేశించి అంత నీఛంగా చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాలి. ఈ విషయంలో సీఎం రేవంత్ వెంటనే జోక్యం చేసుకోవాలని సినీ పరిశ్రమ నుంచి కోరుతున్నాం. కేటీఆర్‌ని దూషించడం కోసం అక్కినేని కుటుంబాన్ని అవమానించడం సమంజసం కాదు. తనను ఎవరో అవమానించారనీ.. అసలు ఆ సమస్యతో ఎటువంటి సంబంధం లేని నాగార్జున, చైతన్యలను అంతకన్నా దారుణంగా అవమానించడం ఏంటి? ఒక మామయ్య, భర్త తమ ఆస్తి కాపాడుకోవడం కోసం ఒక కోడలిని, ఒక భార్యను.. వేరే ఎవరో పక్కలోకి పంపించడానికి ప్రయత్నిస్తే.. తను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన అవమానం ఏమైనా ఉంటుందా.. నేను నా జీవితంలో అయితే ఇంతకన్నా దారుణమైనా అవమానాన్ని వినలేదు’’ అని ఆర్‌జీవీ పేర్కొన్నారు.

Tags:    

Similar News