జడ్జీలు, రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయి

అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుమానం ఉన్న వందలాదిమంది ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు అఫిడవిట్లో బయటపడింది.

Update: 2024-07-04 04:40 GMT

టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు ట్యాపింగ్ దర్యాప్తులో బాధితులుగా కొందరి పేర్లు అనధికారికంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ పేర్లను అధికారికంగా ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంగా ప్రకటించింది. అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుమానం ఉన్న వందలాదిమంది ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు అఫిడవిట్లో బయటపడింది. దీని ప్రకారం అప్పటి పెద్దతలకాయలు గట్టిగా తగులుకునేట్లున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరి మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆ కేసులో కొందరు జడ్జీలు కూడా బాధితులుగా ఉన్నారన్న విషయం వెలుగుచూడగానే సూమోటోగా హైకోర్టు విచారణకు తీసుకుంది. విచారణలో భాగంగా అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ ప్రకారం బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ప్రభాకరరావే కీలక పాత్రధారి. ఆయన ఆదేశాల ప్రకారమే ఉన్నతాధికారులుగా పనిచేసిన భుజంగరావు, ప్రవీణ్ రావు, తిరుపతిరావుతో పాటు మరికొందరు ఒక బృందంగా ఏర్పడి అనధికారికంగా ఫోన్లు ట్యాపింగ్ చేశారు.

ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలనే విషయాన్ని ప్రభాకరరావే తమకు చెప్పేవారని భుజంగరావు పోలీసుల దర్యాప్తులో చెప్పారు. ప్రభుత్వం తాజాగా దాఖలుచేసిన అఫిడవిట్లో భుజంగరావు చెప్పిన వివరాలనే పూసగుచ్చినట్లు చెప్పింది. దాని ప్రకారం జస్టిస్ కాజా శరత్ తో పాటు ఆయన భార్య మాధవితో పాటు మరికొందరు జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగింది. అలాగే అప్పటి మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, మెదక్ ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్, ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న, అప్పటి టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఐఏఎస్ అధికారి దివ్యతో పాటు వివిధ రంగాల్లోని వందలమంది ప్రముఖుల ఫోన్లను ట్యాంపరింగ్ చేసినట్లు నాయిని భుజంగరావు దర్యాప్తులో చెప్పారు.

ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలో ప్రభాకరరావు నుండి తమకు ఆదేశాలు వచ్చేదని భుజంగరావు దర్యాప్తులో చెప్పినట్లు ప్రభుత్వం అఫిడవిట్లో చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకరరావుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరనే విషయం తెలియాల్సుంది. కేసు విచారణ మొదలవ్వగానే ప్రభాకరరావు అమెరికాకు పారిపోయినట్లు అఫిడవిట్లో ప్రభుత్వం కోర్టుకు చెప్పింది.ఆయన్ను రప్పించేందుకు ఇంటర్ పోల్ సాయం తీసుకుంటున్నట్లు చెప్పింది. అది సక్సెస్ అయితే వీలైనంత తొందరలోనే ప్రభాకరరావును పోలీసులు హైదరాబాద్ కు తీసుకొస్తారు. అప్పుడు ట్యాపింగ్ సూత్రదారులు ఎవరనే విషయం బయటపడుతుంది. భుజంగరావు చెప్పిన వివరాల ప్రకారం ప్రభుత్వ పెద్దలు అనుమానించిన వారిని, తమకు సమస్యలు వస్తాయని అనుమానించిన వాళ్ళ ఫోన్లన్నింటినీ ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్ధులు, నేతలను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పోలీసులు చాలా ఇబ్బందులు పెట్టారు.

ఎన్నికల్లో గెలుపుకు ప్రత్యర్ధుల వ్యూహాలన్నింటినీ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకుని ప్రభుత్వ పెద్దలు అందుకు ప్రతివ్యూహాలను పన్నినట్లుగా భుజంగరావు వాగ్మూలంలో బయటపడింది. పైగా బీఆర్ఎస్ అభ్యర్ధులకు ఎన్నికల్లో డబ్బులను పోలీసులు వాహనాల్లోనే తరలించినట్లు కూడా చెప్పారు. భుజంగరావు చెప్పిన ప్రకారం బీఆర్ఎస్ పెద్దలు అన్నీరకాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు బయటపడింది. అయితే పోలీసుల ఫోన్ ట్యాపింగుకు తమకు ఏమీ సంబంధంలేదని ఎదురు దాడిచేస్తుండటమే విచిత్రంగా ఉంది.

ప్రభుత్వానికి సంబంధంలేదు

 



ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కేసీయార్ ఇదే విషయమై మాట్లాడుతు పోలీసుల ఫోన్ ట్యాపింగుకు ప్రభుత్వానికి ఏమి సంబంధమని ఎదురు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి చెప్పి పోలీసులు ఫోన్లు ట్యాప్ చేస్తారా అని ఎదురుదాడి చేశారు. అప్పటికి ప్రభుత్వానికి, పోలీసులకు ఏమీ సంబంధంలేదన్నట్లు. పోలీసు శాఖతో స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తుందని, ఆ శాఖ వ్యవహారాలతో ప్రభుత్వానికి సంబంధంలేదన్నట్లుగా కేసీయార్ మాట్లాడారు. డీజీపీతో సహా ఉన్నతాధికారులందరినీ నియమించేది, బదిలీలు చేసేది ముఖ్యమంత్రే అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ముఖ్యమంత్రి ఆదేశాలకు లోబడే పోలీసులు పనిచేస్తారని అందరికీ తెలుసు. అలాంటిది పోలీసుల ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని చెప్పటమే విచిత్రం.

కేసీయార్ను అరెస్టు చేయాల్సిందే




 


 

ఇదే విషయమై కొందరు మంత్రులు, బీజేపీ నేతలు మాట్లాడుతు కేసీయార్ పై కేసు నమోదుచేసి వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్యాపింగ్ సూత్రధారి కేసీయారే అంటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. వెంటనే కేసీయార్ పై చర్యలు తీసుకోవాలని చాలాసార్లు డిమాండ్లు చేశారు. కేసీయార్ ఎదురుదాడి, మంత్రుల డిమాండ్ల నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం కోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్లో కీలకమైన విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకరరావు హైదరాబాద్ కు వస్తేకాని కేసు ఒక కొలిక్కిరాదన్న విషయం అందరికీ తెలుసు. అప్పుడు ట్యాపింగ్ లో అసలు సూత్రదారి ఎవరనే విషయం బయటపడుతుంది.

Tags:    

Similar News