నాగార్జునపై కేసు కాంగ్రెస్ ప్లానేనా..

మంత్రి కొండా సురేఖపై న్యాయపోరాటానికి సిద్ధమైన హీరో నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. హైడ్రా కూల్చివేతల్లో నేలమట్టమైన ఎన్‌కన్వెన్షన్ ఇప్పుడు నాగార్జున మెడకు ఉచ్చులా మారిన పరిణామాలు కనిపిస్తున్నాయి.

Update: 2024-10-05 07:54 GMT

మంత్రి కొండా సురేఖపై న్యాయపోరాటానికి సిద్ధమైన హీరో నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. హైడ్రా కూల్చివేతల్లో నేలమట్టమైన ఎన్‌కన్వెన్షన్ ఇప్పుడు నాగార్జున మెడకు ఉచ్చులా మారిన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ కన్వెన్షన్ నిర్మాణానికి సంబంధించి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో హీరో నాగార్జునపై కేసు నమోదైంది. జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసును నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమ్మిడికుంట చెరువును కబ్జా చేసిన ఎన్ కన్వెన్షన్ కట్టి నాగార్జున రూ.వేల కోట్లు అర్జించారని, తమ్మిడిగుంటను నాశనం చేశారని, అటువంటి నాగార్జునపై క్రమినల్ చర్యలు తీసుకోవాలంటూ కసిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ కేసు నమోదు కావడంపై ప్రస్తుతం అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొండా సురేఖపై న్యాయపోరాటినికి దిగిన నాగార్జునపై కక్ష సాధింపుగానే ఈ కేసు నమోదైందా అన్న చర్చ మొదలైంది.

మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సమంతకు క్షమాపణ చెప్పారు. దీంతో సదరు మంత్రి తన వ్యాఖ్యలతో తన కుటుంబం పరువును దెబ్బతీశారంటూ నాగార్జున.. నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ, నేతలు కానీ బహిరంగంగా ఖండించిన దాఖలాలు లేవు, పైగా ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దామంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. కొండా సురేఖను వెనకేసుకొచ్చారు. ఆమె రాజీనామా చేయాలన్న అంశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతుందన్న వార్తలు ప్రస్తుతానికి ప్రచారాలుగానే ఉన్నాయి తప్ప.. అధికారికం కానందున.. ఇప్పుడు నాగార్జునపై నమోదైన కేసు కాంగ్రెస్ ప్రతీకార చర్య అన్న వాదనకు బలం చేకూరుస్తోంది.

ఇంతకాలం ఏమైందీ జనం కోసం..

నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా ఆగస్టు 24న కూల్చివేసింది. అంటే మధ్యలో సెప్టెంబర్ నెలమొత్తం గడిచింది. ఇన్నాళ్లూ ఎక్కడా తారసపడని ‘జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ.. కొండా సురేఖపై నాగార్జు కేసు నమోదు చేసిన రెండు రోజులకే బయటకు వచ్చి.. ఆయనపై మరో కేసు నమోదు చేయడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఎన్‌కన్వెన్షన్ కట్టి సంవత్సరాలు గడిచాయి. దానిని హైడ్రా కూల్చి నెల రోజులు గడిచినా.. ఇన్నాళ్లూ ‘జనం కోసం’ సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ వాయిదా పడిన గంటల వ్యవధిలోనే తిరుమంత్రం తరహాలో నాగార్జునపై కేసును ఎందుకు నమోదు చేశారు? కసిరెడ్డి ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ చేయించిన పనేనా? కాంగ్రెస్ ఆదేశాల మేరకే ఇన్నాళ్లూ బయటకు రాని ‘జనం కోసం’ సంస్థ అధ్యక్షుడు.. ఒక్కసారిగా తమ్మిడిగుంటపై వల్లమాలిన ప్రేమ చూపుతూ నాగార్జునపై కేసు పెట్టారా? కొండా సురేఖను కాపాడుకోవడానికే కాంగ్రెస్ ఈ గేమ్ ప్లే చేస్తోందా? ఇలా మరెన్నో ప్రశ్నలు ప్రజల్లో చర్చగా నిలుస్తున్నాయి. మరి వీటిపై ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News