అక్రమాలు..అత్యాచారాలు.. ఇవీ తెలంగాణ పోలీస్ మార్క్ నేరాలు
అక్రమాలు..అత్యాచారాలు, ఇలా తెలంగాణ పోలీస్ మార్క్ నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పలు కేసుల్లో పోలీసులే నిందితులుగా ఉన్నారు. దీంతో వారు సస్పెండ్ అయ్యారు.
By : Shaik Saleem
Update: 2024-06-26 00:39 GMT
తెలంగాణ పోలీసులు వరుస కేసుల్లో సస్పెన్లకు గురవుతున్నారు. ఓ పోలీసు అధికారి మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో పోలీసు అధికారి అక్రమాస్తులు కూడగట్టి సస్పెండ్ అయ్యారు. ఓ పోలీసు ఇన్ స్పెక్టరు గెస్ట్ హౌస్ లో ఓ మహిళతో రాసక్రీడలు జరిపారు. ఓ పోలీసు లంచం తీసుకుంటూ దొరికారు.ఇలా పలు వరుస కేసులు జరుగుతున్నాయి.చట్టాన్ని కాపాడాల్సిన వారే దాన్ని ఉల్లంఘిస్తున్నారు. తెలంగాణ పోలీసుల నిర్వాకాలపై హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిందితులైన పోలీసులపై సస్పెన్షన్ల పర్వం సాగుతుంది.
ఇవీ పోలీసు మార్కు నేరాలు
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ భవానీసేన్ తుపాకీ చూపించి బెదిరించి సాక్షాత్తూ మహిళా హెడ్ కానిస్టేబుల్ పైనే అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.20 రోజుల క్రితం మరో కానిస్టేబుల్ ను తన గదికి పిలిపించి అత్యాచార యత్నం చేశాడు. ఈ ఎస్ఐ గతంలో 2022లో అసిఫాబాద్ లో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను లైంగికంగా వేధించి సస్పెండ్ అయ్యారు. ఇలాంటి రాస క్రీడలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలతో కీచక ఎస్ఐను పోలీసు సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించడంతో పాటు అతన్ని అరెస్ట్ చేసి, కరీంనగర్ జైలుకు పంపించారు.
- వరంగల్ జిల్లా గీసుకొండ ఇన్ స్పెక్టరు, దామెర సబ్ ఇన్ స్పెక్టర్ హరిప్రియలు హద్దుమీరి ప్రవర్తిస్తూ ప్రేమాయణం సాగిస్తుండటంతో వారిపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
- వరంగల్ సీబీసీఐడీ ఇన్ స్పెక్టర్ రవి తన తోటి మహిళా ఇన్ స్పెక్టరుతో ఆమె ఇంట్లోనే రాసక్రీడలు సాగిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారిని సస్పెండ్ చేశారు.
- మహిళపై అత్యాచారం చేసిన మారేడుపల్లి ఇన్ స్పెక్టర్ నర్సింగ్ రావుపై సస్పెన్షన్ వేటు వేశారు.
- తెలంగాణలో ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, జడ్డీల ఫోన్లను ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్ అరెస్ట్ చేశారు. విశ్రాంత ఐజీ ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారని, ఆయన అమెరికాలో పాగా వేశారని తేలింది. ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున డబ్బు తరలింపునకు పోలీసులే ఎస్కార్ట్ ఏర్పాటు చేశారనే విషయం వెలుగుచూసింది.
- హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషనులో పనిచేసిన ఏసీపీ ఉమామహేశ్వరరావు రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేశారని తేలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీని అరెస్ట్ చేయడంతోపాటు సస్పెండ్ చేశారు.
- సీసీఎస్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ ఓ కేసులో రూ. 3లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి అరెస్టయ్యాడు.
- సాక్షాత్తూ విశ్రాంత ఐఎఎస్ అధికారి భన్వర్ లాల్ ఇంటి కబ్జా కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ పై పోలీసులు కేసు పెట్టారు.
- నారాయణ పేట జిల్లా ఉట్కూరు పోలీసుస్టేషన్ పరిధిలో తనను కొట్టి చంపుతున్నారని ఓ బాధితుడు 100 కు డయల్ చేసినా ఎస్ బిజ్జ శ్రీనివాసులు స్పందించలేదు. దీంతో బాధితుడు హత్యకు గురయ్యాడు.
- ఓ ఐఆర్ఎస్ అధికారికి చెందిన స్థలాన్ని కబ్జా చేసిన కేసులో ఎస్ఐ కృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన ఎస్ఐకు ఎమ్మెల్యే మద్ధతు ఇచ్చారు.
- హైదరాబాద్ నగరంలో ఓ పోలీసు ఉన్నతాధికారి స్థిరాస్తి వ్యాపారుల నుంచి మామూళ్లు దండుకున్నారని పోలీసుల దర్యాప్తులోనే తేలింది.
- హైదరాబాద్ నగరంలో కిరాయిదారు అద్దె ఇవ్వడం లేదని యజమాని ఫిర్యాదు చేస్తే అతన్ని ఖాళీ చేయించిన ఇన్ స్పెక్టరు ఆ ఇంట్లో అతనే యజమానిని బెదిరించి తక్కువ అద్దెకు ఉంటున్నారు.
- బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ చేసిన రోడ్డు ప్రమాదం కేసులో అతన్ని తప్పించారని ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు ఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. పంజాగుట్ట ఇన్ స్పెక్టరు దుర్గారావును ఉద్యోగం నుంచి తొలగించారు.
- నిజామాబద్ జిల్లా సీసీఎస్ ఇన్ స్పెక్టర్ ఎం రమేశ్ పీకల దాకా మద్యం తాగి పోలీసుస్టేషనుకు వచ్చి హంగామా చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు.
- జగిత్యాల జిల్లా సారంగాపూర గంజాయి కేసులో మిలాఖత్ అయిన ఎస్ఐలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ నరేందర్ లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
- సెటిల్ మెంట్లు, భూ దందాల కేసుల్లో 30 మందికి పైగా సీఐలు, ఎస్ఐలు సస్పెండయ్యారు.
- దళిత యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్ స్పెక్టరు పరశురాంపై బదిలీ వేటు వేశారు. ఈ కేసులో నాగోల్ ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యలను సస్పెండ్ చేశారు.
- ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన నిందితులపై కేసులు పెట్టకుండా వదిలివేసిన కేసులో డీసీపీ ఎం వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, ఇన్ స్పెక్టరు జహంగీర్ యాదవ్ ను సస్పెండ్ చేశారు.
పోలీసు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు
పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలు, అత్యాచారాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే నేరాలకు పాల్పడటంపై ఆయన సీరియస్ అయ్యారు. అక్రమార్కులు, అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ ప్రక్షాళనకు సీఎం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నేరాలు, డ్రగ్స్ కు అడ్డుకట్ట వేసి శాంతి భద్రతలను పరిరక్షించాలని సీఎం కోరారు.హైదరాబాద్ నగరంలో రాత్రి పదిన్నర గంటలకు దుకాణాలు బంద్ చేయించాలని నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పోలీసు అధికారుల ప్రక్షాళనకు బదిలీలు కూడా చేపట్టారు.