హైదరాబాద్ అగ్నిప్రమాదానికి అసలు కారణంపై దర్యాప్తు

హైదరాబాద్ గుల్జార్ హౌస్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద కారణాలపై ప్రభుత్వ శాఖల అధికారులు తలో కారణం చెబుతున్నారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా అసలు కారణం తేలలేదు.;

Update: 2025-05-19 13:23 GMT

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని చార్మినార్ చెంత ఉన్న గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరిగి 24 గంటలు దాటినా ఈ ప్రమాదానికి అసలు కారణమనేది ఇంకా తేలలేదు. ఈ ఘోర అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మరణించిన ఘటన సంచలనం రేపింది.


చార్మినార్ పోలీసుల ఎఫ్ఐఆర్
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై చార్మినార్ పోలీసులు 83 /2025 నంబరుతో కేసు నమోదు చేశారు. మోదీ పెరల్స్ షాపు మొదటి అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదంపై చార్మినార్ పోలీసులు సోమవారం దర్యాప్తు ప్రారంభించారు.

ఏసీ కంప్రెషర్లు పేలాయా?
అగ్నిప్రమాదం జరిగినపుడు ఏసీ కంప్రెషర్లు పేలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏసీ కంప్రెషర్లు పేలడం వల్లనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని, సకాలంలో సహాయ చర్యలు చేపట్టి ఉంటే కొందరైనా బతికే వారని స్థానికులు చెబుతున్నారు.

కరెంట్ మీటరు కాలిందా?
పగలు అధికారిక విద్యుత్ కనెక్షన్ నుంచి విద్యుత్ ను వాడి రాత్రి కాగానే, భవనం సమీపంలోని హైటెన్షన్ వైరు నుంచి విద్యుత్ ను అక్రమంగా వాడినందువల్ల కరెంటు మీటరుపై భారం పడి అది కాలిపోయి అగ్నిప్రమాదం జరిగిందని మరికొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు అగ్నిప్రమాద కారణంపై ఎవరి వాదన ఎలా ఉన్నా తుది దర్యాప్తులో ఈ ప్రమాదానికి అసలు కారణం వెలుగుచూడాల్సి ఉంది. మరో వైపు అగ్నిప్రమాదం జరిగినపుడు భవనంలో నిద్రిస్తున్న వారు పైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు వీల్లేకుండా టెర్రస్ పైకి వెళ్లకుండా గేటుకు తాళం వేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్ కారణమా?
ఈ అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ, పోలీసులు ముక్తకంఠంతో చెబుతున్నారు.షార్ట్ సర్క్యూటే ఈ అగ్నిప్రమాదానికి కారణమని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పారు. కాగా ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదని, ఇలా జరిగితే భవనంలో ఉన్న ఎంసీబీలు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని చార్మినార్ ప్రాంత ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. ఇలా అగ్నిమాపక శాఖ, పోలీసు, విద్యుత్ ప్రభుత్వ శాఖల మధ్యే అగ్నిప్రమాద కారణాలపై ఏకాభిప్రాయానికి రాలేక పోయారు.

మృతుల బంధువు ఉత్కర్ష్ మోదీ ఏం చెప్పారంటే...
తమ బంధువుల ఇంట్లో అగ్నిప్రమాదం 5.15 గంటలకు జరగ్గా దీనిపై తాము అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేసినా, వారు గంట తర్వాత సంఘటన స్థలానికి వచ్చారని ఉత్కర్ష్ మోదీ ఆరోపించారు. అగ్నిప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుల బంధువు ఉత్కర్ష్ మోదీ ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడారు.అగ్నిమాపక శాఖ అధికారుల వద్ద ఆక్సిజన్ సిలిండర్లు లేవని, మంటలు ఆర్పేందుకు నీళ్లు కూడా తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. అంబులెన్సులు కూడా సకాలంలో సంఘటన స్థలానికి రాలేదని ఆయన తెలిపారు.పొగ పీల్చిన తమ బంధువులను బయటకు తీసుకువచ్చి, సకాలంలో ఆక్సిజన్ అందించడంలో విఫలమయ్యారని, అందువల్లే 17 మంది మరణించారని ఆయన ఆరోపించారు.


Tags:    

Similar News