బీఆర్ఎస్ లో ఉంటూ మరో పార్టీకి సేవ.. ఎక్కడ?

మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాలోత్ కవిత నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు, కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగారు.

By :  Vanaja
Update: 2024-04-23 16:59 GMT

మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు, కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్సెస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రవీందర్ రావుపై శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఎంపీ కవిత మైక్ తీసుకుని పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు.

అయితే అంతకంటే ముందు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. "ఒక పార్టీలో ఉండి.. మరో పార్టీకి సేవ చేస్తున్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నేతలు ఇప్పటికైనా జాగ్రత్త పడండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయొద్దు, నష్టం చేయొద్దు" అంటుండగానే కవిత ఆయన దగ్గర నుండి మైక్ టీఎసుకున్నారు. ఇక శంకర్ నాయక్ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన రవీందర్ ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడుతున్నావ్? ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని సీరియస్ అయ్యారు. దీంతో 'నేను దేనికైనా సిద్ధమే, కొట్టుకోడానికైనా సిద్ధమే, చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తున్నాను' అంటూ శంకర్ నాయక్ స్పందించారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అంతలో కవిత మైక్ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పార్టీ ఇప్పటికే నష్టపోయి ఉంది. మనమంతా కలిసి పని చేసి పార్టీని గెలిపించాలి అంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వాగ్వాదం సర్దుమణిగింది.

Tags:    

Similar News