‘ఢిల్లీకి ఎన్నిసార్లయినా పోతా.. మీకేంది’
ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కావాల్సిన ఇతర అంశాలను తెచ్చుకుంటున్నానని తెలిపారు.;
తెలంగాణ సీఎం.. ఢిల్లీ పర్యటన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సీఎం.. తెలంగాణకు పైసా నిధులైనా తెచ్చారా అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తున్న క్రమంలో ఈ విమర్శలు మరోసారి గుప్పుమన్నాయి. ఈ విమర్శలపై సీఎం రేవంత్ తాజాగా ఘాటుగా స్పందించారు. తాను ఢిల్లీకి వెళ్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పిగా ఉందో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఇసుమంత కూడా సహకరించని వారు తన ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం శ్రమిస్తుంటే అందుకు తెలంగాన బీజేపీ నేతల నుంచి కనీస సహకారం లేదని, ఒక బీఆర్ఎస్ అయితే అసలు అభివృద్ధి అంటేనే ఆమడ దూరం పరిగెడుతుందని చురకలంటించారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్ట్‌పై చర్చించడం కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే దానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డుమ్మా కొట్టారని విమర్శలు గుప్పించారు.
సికింద్రాబాద్‌లో ఉండి కూడా అన్ని పార్టీల ఎంపీలతో నిర్వహించిన సమావేశానికి కిషన్ రెడ్డి రాలేదని తెలిపారు. కావాలనే ఆయన సమావేశానికి డుమ్మా కొట్టారని విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్ట్‌లు ముందుకు సాగకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బీజేపీ నేతలేనని మండిపడ్డారు రేవంత్. మూసీ ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తే కిషన్‌కు సన్మానం చేస్తానన్నారు. యమునా, గంగా, సబర్మతి నదుల ప్రక్షాళనకు నిధులు ఇచ్చిన కేంద్రం.. మూసీ అంటే మాత్రం మూతిముడుచుకుంటుందని విసుర్లు విసిరారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కావాల్సిన ఇతర అంశాలను తెచ్చుకుంటున్నానని తెలిపారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సమయంలో కూడా తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై స్పష్టత తెచ్చుకున్నట్లు చెప్పారాయన.
పనిదొంగ కేసీఆర్..
జీతభత్యాలు తీసుకుని పనిచేయకుండా తప్పించుకుంటున్న వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘రాష్ట్ర అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపెట్టారు. కేసీఆర్ చేసిన అప్పులు, తప్పుడు కాగ్ రిపోర్ట్‌లను అసెంబ్లీలో బయట పెడతాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దుర్మార్గులు. తెలంగాణలో శవాలు లేస్తున్నాయని తెలియగానే తీన్మార్ డ్యాన్సులు చేస్తున్నారు. పంటలు ఎండితే ప్రతిపక్షాలు సంతోషపడుతున్నాయి. కేసీఆర్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తే ఈ తలనొప్పులు ఉండేవి కావు’’ అని అన్నారు రేవంత్.