‘ఉప ఎన్నికకు సై’.. కేటీఆర్‌కు కడియం కౌంటర్

స్టేషన్ ఘన్‌పూర్‌లో అతి త్వరలో ఉపఎన్నిక రానుందన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా బదులిచ్చారు.

Update: 2024-09-26 12:31 GMT

స్టేషన్ ఘన్‌పూర్‌లో అతి త్వరలో ఉపఎన్నిక రానుందన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా బదులిచ్చారు. తన నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైతే.. దానిని ఢీకొట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. మరోసారి చిత్తు కావాలని బీఆర్ఎస్‌కు ఉన్న ఆశని తీర్చడానికి కాంగ్రెస్ రెడీగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత కీలకంగా ఉన్న స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో అతి త్వరలో ఉప ఎన్నిక రానుందని, అందులో బీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య ఘన విజయం సాధిస్తారంటూ బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ చేసే తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని, నిజంగా కేటీఆర్ చెప్తున్నట్లు ఉపఎన్నిక జరిగితే.. ఇక్కడ బీఆర్ఎస్‌కు డిపాజిట్స్ కూడా దక్కవని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, బీఆర్ఎస్‌ను మళ్ళీ ప్రజలు నమ్ముతారని అనుకోవడం కేటీఆర్ అజ్ఞానమే అవుతుందంటూ ఎద్దేవా చేశారు.

‘‘నా మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎందరో నా ముందు ఎగిరారు. వాళ్లంతా కూడా రెక్కలు విరిగి కిందపడటం కాదు.. కనుమరుగైపోయారు. రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ల కాలం ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్.. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 38 మందిని కండువా కప్పి మరీ బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించింది. వాళ్లు ఇప్పుడు వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా నైతిక విలువలు అంటూ మాట్లాడాటం వింతగా ఉంది’’ అని చురకలంటించారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై కోర్టు ఏ తీర్పు ఇచ్చినా తాను స్వీకరిస్తానని, నిజంగా ఉపఎన్నికే వచ్చినా దానిని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు.

కడియం వివాదమేంటంటే..

గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి.. బీఆర్ఎస్ తరపున స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల ముందు ఆయన పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన కూతురు కడియం కావ్యకు టికెట్ ఖరారు చేసుకుని ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు షురూ అయ్యాయి. వాటిలో భాగంగానే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో తమ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి.. ఇప్పుడు పార్టీ ఎలా మారుతారని కడియం శ్రీహరి సహా పది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఈ పార్టీ ఫిరాయింపు నేతలందరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ.. హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు తప్పవా అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది.

Tags:    

Similar News