హైదరాబాద్ @ 195 జాతుల 67వేల పక్షులకు నిలయం, తాజా సర్వే వెల్లడి
హైదరాబాద్ నగరం వివిధ రంగులు,వివిధ జాతులకు చెందిన 195 రకాల 67 వేల పక్షులకు నిలయమని తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైంది.;
By : Shaik Saleem
Update: 2025-02-24 03:46 GMT
హైదరాబాద్(Hyderabad)నగరంతోపాటు నగర శివార్లలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట, హుసేన్ సాగర్, మంజీరా జలాశయం, వివిధ చెరువులు, పార్కులు, అడవులు, బొటానికల్ గార్డెన్ ఇలా ఒకటేమిటి పలు ప్రాంతాల్లో వివిధ జాతులు, రంగురంగుల పక్షులు, విదేశీ పక్షులు, వాటి కిలకిల రావాలతో మార్మోగుతున్నాయి. పక్షిప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్న పక్షుల సర్వేలో పలు విషయాలు వెలుగుచూశాయి.వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)(World Wide Fund for Nature),హైదరాబాద్ బర్డింగ్ పాల్స్(Hyderabad Birding Pals), దక్కన్ బర్డర్స్(Daccan Birders) జరిపిన సర్వేలో పక్షుల సంఖ్యను లెక్కించారు.
రంగురంగుల పక్షులకు నిలయం
హైదరాబాద్ నగరం వివిధ రంగులు,వివిధ జాతులకు చెందిన 195 రకాల పక్షులకు (195 species) నిలయమని తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైంది.(latest survey reveals) వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ బర్డింగ్ పాల్స్, దక్కన్ బర్డర్స్ తో కలిసి వివిధ సీజన్లలో జరిపిన సర్వేలో 195 జాతులకు చెందిన 67వేల పక్షులు (67,000 birds) హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని తేలింది. నగరంలోని భూ విస్తీర్ణంలోని 11 శాతం ఉన్న సరస్సులు, పార్కులు, జలాశయాలు, అడవుల్లో 7,634 పావురాలు, 3,576 తెల్లకొంగలు, 2,984 రెడ్ వెంటెడ్ బుల్ బుల్స్ పక్షులు, పర్పుల్ సన్ బర్డ్స్ ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్ నగర శివార్లలోని 22 లొకేషన్లలో బుల్ బుల్ పిట్టలు కనిపించాయని పక్షి ప్రేమికుడు శ్రీరాం రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పక్షుల మనుగడ ప్రశ్నార్థకం
హైదరాబాద్ నగర శివార్లలో వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గడం వల్ల పక్షులు తినేందుకు కావాల్సిన క్రిమికీటకాలు సరిగా లభించడం లేదని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఫరీదా టంపాల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పంటల్లో క్రిమికీటకాల నివారణకు రైతులు పురుగు మందులను చల్లుతుండటంతో పక్షుల ఆహారమైన క్రిమికీటకాల సంఖ్య తగ్గిపోతుందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శివార్లలో నగరీకరణ, వాతావరణ కాలుష్యం, పక్షుల నివాసాలను ధ్వంసం చేస్తుండటం వల్ల పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
బర్డ్ వాక్ లో కనువిందు చేసిన పక్షులు
శామీర్ పేట చెరువు వద్ద నిర్వహించిన బర్డ్ వాక్ లో పలు రకాల పక్షులు ఆకాశంలో ఎగురుతూ పక్షిప్రేమికులకు కనువిందు చేశాయి.మంజీరా జలాశయం, వైల్డ్ లైఫ్ అభయారణ్యంలో ఇటీవల నిర్వహించిన బర్డ్ వాక్ లో వివిధ రకాల విదేశీ వలస పక్షులు దర్శనమిచ్చాయి.శంకరపల్లి మండలం జన్వాడ సరస్సు వద్ద హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ వాలంటీర్లు ఫిబ్రవరి 23వతేదీన నిర్వహించిన బర్డ్ వాక్ లో రంగురంగుల వివిధ పక్షిజాతులు కనువిందు చేశాయి.
విదేశీ పక్షుల సందడి
హైదరాబాద్ నగరంలో తెలంగాణ స్థానిక పక్షులే కాకుండా పలు విదేశాల నుంచి వచ్చిన వలస పక్షులు హైదరాబాద్ సరస్సుల్లో సందడి చేశాయి. కండ్లకోయ ఆక్సిజన్ పార్కు, మోమిన్ పేట ఎంకతల భూముల్లో, సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద పలు రకాల నీటి పక్షులు దర్శనమిచ్చాయి.కొడకంచి సరస్సు, సంగారెడ్డి వద్ద ఉన్న మంజీరా డ్యామ్ , ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల వద్ద వివిధ రకాల పక్షులు రివ్వున ఎగురుతూ పక్షిప్రేమికులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. అన్నాసాగర్ సరస్సు, కిష్టారెడ్డి పేట సరస్సు, సుల్తాన్ పూర్ ప్రాంతాల్లో విదేశీ వలస పక్షులు ఎగురుతూ కనిపించాయి. నెహ్రూ జూపార్కులో నిర్వహించిన బర్డ్ వాక్ లో పలు రకాల పక్షులు కనిపించాయి.