హైదరాబాదీ వైద్యుడు రిసిన్ విషం తయారీ బాగోతం ఏటీఎస్ గుట్టురట్టు

దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు హైదరాబాద్ డాక్టర్ పథకం పన్నాడని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తులో వెలుగుచూసింది.

Update: 2025-11-13 04:02 GMT
హైదరాబాద్ డాక్టర్ మొహియుద్దీన్ ఉగ్ర లింకుల గుట్టు రట్టు

హైదరాబాద్‌ నగరానికి చెందిన ఒక వైద్యుడు(Hyderabad doctor) అత్యంత విషపూరితమైన ఉగ్ర కుట్ర పన్నాడని తాజాగా వెలుగు చూసింది. పాక్ హ్యాండ్లర్ టెలిగ్రామ్ ద్వారా అందించిన సమాచారంతో రిసిన్ తయారీకి (ricin plan)డాక్టర్ ప్రయత్నించినట్టు ఏటీఎస్ దర్యాప్తులో తేలింది.ఈ డాక్టర్ బాగోతం వెలుగులోకి రావడంతో హైదరాబాద్ నుంచి ఉగ్ర భావజాలం కార్యక్రమాలకు కేంద్రంగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒక వైపు వైద్యం చేస్తూ… మ‌రో వైపు రేసిన్ రహస్య ప్రయోగాలు...ఇదీ ఉగ్ర డాక్టర్ బాగోతం.


దేశంలో ఏ ప్రాంతంలో ఉగ్రదాడులు, పేలుళ్లు జరిగినా వీటి మూలాలు హైదరాబాద్ నగరంలో వెలుగు చూస్తున్నాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS alert) ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా వారిలో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నిందితుడిగా ఉండటం కలకలం రేపింది.ఉగ్రవాద కేసులో నిందితులైన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ తోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బనాస్కాంత జిల్లాకు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, ముహమ్మద్ సుహైల్ ముహమ్మద్ సలీంలను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు(Hyderabad doctor caught) చేసింది.



 ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వలస

ఉగ్రవాద కేసులో అరెస్టు అయిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ స్వస్థలం ఖమ్మం జిల్లా అని, ఈ కుటుంబం 20 ఏళ్ల క్రితం మెహిదీపట్నం, టోలిచౌకి, రాజేంద్రనగర్ ప్రాంతానికి వలస వచ్చి ఉప్పరపల్లిలోని ఫోర్ట్ వ్యూ కాలనీలో నివాసముంటున్నారని వెల్లడైంది. ఇతని తండ్రి డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ గిలానీ అని, తండ్రి మరణించడంతో హైదరాబాద్ లోని నివాసముంటున్నామని నిందితుడి సోదరుడు ఫరూఖీ చెప్పారు. నిందితుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ 2007 నుంచి 2023 వరకు చైనాలో వైద్య విద్య అభ్యసించి వచ్చి డాక్టరుగా పనిచేశారని సమాచారం. మొహియుద్దీన్ కు 2021 లో వివాహం చేసుకున్నా తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడని వెల్లడైంది.

రిసిన్ పాయిజన్ తయారీ
గుజరాత్ ఏటీఎస్ కేసులో నిందితుడైన డాక్టర్ మొహియుద్దీన్ టెలిగ్రామ్ ఛాటింగ్ ద్వారా రిసిన్ పాయిజన్ తయారు చేశారని గుజరాత్ ఏటీఎస్ దర్యాప్తులో తేలింది. ఆముదపు గింజలతో అత్యంత విషపూరితమైన రిసిన్ విషాన్ని నిందితుడు తయారు చేశాడని వెల్లడైంది. పాకిస్థాన్ దేశానికి చెందిన హ్యాండ్లర్ అయిన అబు ఖదీజా టెలీగ్రాం యాప్ ద్వారా ఎన్ క్రిప్టెడ్ సందేశాలను మొహియుద్దీన్ కు పంపించారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీ పేలుడు ఘటన నిందితులతో హైదరాబాద్ డాక్టరుకు సంబంధాలు ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.

బిజినెస్ మీటింగుకని వెళ్లి అరెస్టయ్యాడు...
తన సోదరుడు డాక్టర్ మొహియుద్దీన్ బిజినెస్ మీటింగుకని నవంబరు 5వతేదీన ఇంటి నుంచి వెళ్లాడని, ఆ తర్వాత నవంబరు 9వతేదీన గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తనకు ఫోన్ చేసి ఉగ్రవాద లింకుల కేసులో తన సోదరుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారని అతని సోదరుడైన ఫరూఖీ చెప్పారు. మొహియుద్దీన్ గదిలో నుంచి ఎలాంటి వస్తువులను తొలగించవద్దని ఏటీఎస్ తమను కోరిందని, ఆయన గదిలోని వస్తువులను స్వాధీనం చేసుకుంటామని ఏటీఎస్ అధికారులు చెప్పినట్లు అతని సోదరుడు తెలిపారు. ఉగ్రవాద కేసులో నిందితుడైన డాక్టర్ మొహియుద్దీన్ అరెస్ట్ అనంతరం ఫోర్ట్ వ్యూ కాలనీతోపాటు అసద్ మంజిల్ నివాసులు షాక్ కు గురయ్యారు. డాక్టర్ అరెస్టు పై ప్రశ్నిస్తే వారెవరూ పెదవి విప్పడం లేదు.

ఇంట్లోనే లాబోరేటరీ
డాక్టర్ మొహియుద్దీన్ తన ఇంట్లోనే అత్యంత విషపూరితమైన రిసిన్ ను తయారు చేసేందుకు లాబోరేటరీని ఏర్పాటు చేసుకున్నాడని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుర్తించింది. హైదరాబాద్ నగరంలో ఉగ్రవాద కేసులో నిందితుడైన డాక్టర్ మొహియుద్దీన్ మూవ్ మెంటును గుర్తించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మొహియుద్దీన్ గూగుల్ లొకేషన్ సర్వీసును ఆప్ చేసి కేవలం టెలీగ్రామ్ యాప్ ద్వారానే స్నేహితులతో మాట్లాడే వారని పోలీసుల దర్యాప్తులో తేలింది.


హైదరాబాద్ లో హై అలెర్ట్
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.ఢిల్లీలో పేలుళ్లు జరిగిన వెంటనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు.హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని జన సమ్మర్థ ప్రాంతాల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు. నగరంలోని రద్దీప్రాంతాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాచకొండలో ప్రధాన రోడ్లపై వాహనాల తనిఖీలు చేస్తున్నామని రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు చెప్పారు.

దాడులు ఎక్కడ జరిగినా ఉగ్ర మూలాలు హైదరాబాద్‌లోనే...
దేశ, విదేశాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల మూలాలు హైదరాబాద్ నగరంలో తేలుతున్నాయని, ఉగ్ర దాడుల కుట్రలు, ప్రణాళికలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో తలదాచుకున్న అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపించాలని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు హైదరాబాద్ సేఫ్ జోన్ గా భావించి స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఆయన ఆరోపించారు. మయన్మార్ నుంచి రోహింగ్యాలు అక్రమంగా వచ్చి హైదరాబాద్ లో మకాం వేశారని కేంద్రమంత్రి చెప్పారు. హైదరాబాద్ లో అక్రమంగా చొరబడి వచ్చిన రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.



 విమాన ప్రయాణికులకు ముఖ్యమైన సలహా

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ పహరాను పెంచారు. విమాన ప్రయాణికులను సాయుధ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ చెకింగుల నేపథ్యంలో విమాన ప్రయాణికులు విమానాశ్రయానికి ముందుగా రావాలని శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సూచించారు.

అంతర్జాతీయ విమానాల్లో భద్రతా చర్యలు
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో విమానాశ్రయాలతోపాటు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల్లో కేంద్ర పౌర విమాన యాన భద్రతా విభాగం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది.విమానాల్లో హానికరమైన రసాయన పదార్థాలు, విషపూరితమైన వస్తువులు, ఐఈడీ పేలుడు పదార్థాలను తరలించే అవకాశమున్నందున ప్రతీ కార్గో కన్ సైన్ మెంటును సెన్సర్లతో పరీక్షించాలని నిర్ణయించారు. ప్రవేశ ద్వారాల వద్ద తనిఖీలు చేశాకే పంపించాలని, హ్యాండ్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా సెన్సర్లు, డిటెక్టర్లతో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్నైఫర్ డాగ్స్ , బాంబు నిర్వీర్య దళాలతో తనిఖీలను ముమ్మరం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఉగ్రవాదులు చొరబడితే ఎలా వ్యవహరించాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కారు బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే హైదరాబాద్ నగరంలోని కాలాపత్తర్ పొలిసు పరిధిలోని టాడ్ బాన్ ఎక్స్ రోడ్డు వద్ద కాలాపత్తర్ పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు.



 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నెన్నో ఉగ్ర మూలాలు

దేశంలోని ఏ రాష్ట్రంలో ఉగ్ర కుట్రలు భగ్నమైనా వాటి మూలాలు హైదరాబాద్ నగరంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం కలకలం రేపుతోంది. విజయనగరంలో బాంబు పేలుళ్ల రిహార్సల్స్ కు సిద్ధమైన ఇద్దరు నిందితులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్ బస్తీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ఉగ్రవాది రిజ్వాన్ అలీ గతంలో హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు తేలింది. అతన్ని ఫరీదాబాద్ లో అరెస్ట్ చేశారు.

- బీహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌ జరిగిన పేలుడు మూలాలు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైలులోంచి ఓ వస్త్రాల పార్శిల్‌ను దింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవ్వకున్నా, ఆస్తి, ప్రాణనష్టం లేకున్నా ఉగ్రవాద కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. ఆ పార్శిల్‌ దర్భంగకు చెందిన మహమ్మద్‌ సూఫియాన్‌ అనే వ్యక్తికి చేరాల్సి ఉన్నట్లు గుర్తించింది.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి
ఇస్లాం మారణకాండను బోధించదని, శాంతి మార్గాన్ని చూపిస్తుందని పాతబస్తీకి చెందిన ఇస్లామిక్ రచయిత ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఒక వ్యక్తిని హతమార్చినా ప్రపంచమానవాళిని హతమార్చినట్లేనని ఇస్లాం చెబుతుందన్నారు. ఉగ్రవాదాన్ని ఇస్లాం బోధించదని, కొందరు ముస్లింలు ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని ముజాహిద్ కోరారు. హైదరాబాద్ నగరంలో మతాలు ఎన్ని ఉన్నా అందరూ అన్నదమ్ముల్లా శాంతియుతంగా జీవనం సాగించాలని నగర శాంతికమిటీ సభ్యుడు ఎ బలరామ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు కోరారు. ఉగ్రమూలాలను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని ఆయన సూచించారు.

కోయంబత్తూరు కారు బాంబు కేసు
కోయంబత్తూరు కారు బాంబు కేసులో ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌ పాతనగరం, సైదాబాద్‌, టోలిచౌకి ప్రాంతాల్లో దాడులు చేశారు. సైదాబాద్‌లోని అమీన్‌కాలనీలో దాడులు జరిపిన అధికారులకు విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి.కోయంబత్తూరు కారు బాంబు కేసు దర్యాప్తు లో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌సహా తమిళనాడులోని 31ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ పాతనగరం, సైదాబాద్‌, టోలిచౌకిలోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ప్ర త్యేక బృందాలు దాడులు జరిపాయి. సైదాబాద్‌లోని అమీన్‌కాలనీలో దాడులు జరిపిన అధికారులకు విస్మయకర వాస్తవాలు తెలిసాయని ప్రచారం జరుగుతుంది.

హైదరాబాద్ లో ఎన్నెన్నో ఉగ్రదాడులు...
- మధ్యప్రదేశ్ యాంటీ టెర్రిరస్ట్ స్క్వాడ్ పోలీసులు రెండేళ్ల క్రితం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
- 1993వ సంవత్సరంలో అదనపు ఎస్పీ కృష్ణ ప్రసాద్ పై ముజీబ్ అనే నిందితుడు కాల్పులు జరిపాడని వెల్లడైంది.
- హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ సాయిబాబా గుడి , లుంబినీ పార్కు, మక్కామసీదు, గోకుల్ ఛాట్ పేలుళ్ల ఘటనలు సంచలనం రేపాయి.
2002 నవంబరు : దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా గుడి వద్ద జరిగిన పేలుళ్లలో ఇద్దరు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు.
2025 అక్టోబరు : బేగంపేటలోని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై హర్కతుల్ జిహాది ఇస్లామి సభ్యుడు అత్మాహుతి దాడి చేయగా హోంగార్డు మరణించారు.
2006 మే : ఓడియన్ థియేటరులో లష్కరే తోయిబా సభ్యులు గ్రనేడ్ తో దాడి చేశారు.
2007 మే : పాత నగరంలోని మక్కా మసీదులో బాంబు పేలుళ్లకు పాల్పడగా 16 మంది మరణించారు.
2007 ఆగస్టు : లుంబినీ పార్కు, కోఠిలోని గోకుల్ ఛాట్ లో భారీ పేలుళ్లకు పాల్పడగా 42 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారు.
2013 ఫిబ్రవరి : దిల్ సుఖ్ నగర్ బస్టాండు వద్ద రెండు భారీ పేలుళ్లు జరగ్గా 17 మంది మరణించగా, మరో 123 మంది గాయపడ్డారు.

గాంధీనగర్ లో హైదరాబాద్ డాక్టర్ అరెస్ట్
గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు నవంబర్ 7వతేదీన తెలంగాణలోని హైదరాబాద్ నివాసి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను గాంధీనగర్‌లోని అదాలజ్ సమీపంలో రెండు గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, నాలుగు లీటర్ల కాస్టర్ ఆయిల్‌తో అరెస్టు చేసినట్లు ఏటీఎస్ అధికారి జోషి విలేకరులకు తెలిపారు.సయ్యద్ ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నుతున్నాడని, గాంధీనగర్ జిల్లాలోని కలోల్‌లోని ఒక ప్రదేశం నుండి ఆయుధాలను సేకరించాడని తేలింది.



 సికింద్రాబాద్ హోటళ్లలో భద్రతా చర్యలు

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సూచనల మేరకు నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నార్త్ జోన్ పరిధిలోని లాడ్జ్‌లు, హోటళ్ల యజమానులు, నిర్వాహకులతో ఒక పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వందమందికి పైగా హోటల్, లాడ్జ్ యజమానులు,మేనేజర్లు,P గోపాలపురం ఏసీపీ, నార్త్ జోన్, హైదరాబాద్ నగర పోలీసులు పాల్గొన్నారు. సరైన ఎంట్రీలతో సందర్శకుల రిజిస్టర్ నిర్వహించాలని,చెక్-ఇన్ సమయంలో అన్ని అతిథుల చెల్లుబాటు అయ్యే ఐడీ రుజువులను తీసుకోవాలని పోలీసులు కోరారు.ప్రజా భద్రతా చట్టం ప్రకారం తప్పనిసరి కనీస బ్యాకప్‌తో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ రష్మి పెరుమాళ్ ఆదేశించారు.

ఈ డాక్టర్ కేసు హైదరాబాదీలను అలర్ట్‌ చేసింది. విష పదార్థాల తయారీ ద్వారా ఉగ్ర వ్యూహాలు వెలుగు చూశాయి. భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇది ముగింపు కాదు...ఉగ్రమూలాలను పెకిలించి వేసేందుకు మనందరి అప్రమత్తత,పోలీసుల సమగ్ర చర్యల అవసరం ఉంది.


Tags:    

Similar News