హైదరాబాద్‌లో హై అలర్ట్,వైద్య సిబ్బంది సెలవులపై నిషేధాస్త్రం
భారత్ -పాక్ యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్ లో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్ ప్రాంతాలకు సికింద్రాబాద్ నుంచి మిలటరీ బలగాలను తరలిస్తున్నారు.;
By : Shaik Saleem
Update: 2025-05-09 01:42 GMT
ఆపరేషన్ సింధూర్, భారత్ -పాక్ యుద్ధం నేపథ్యంలో తెలంగాణలోనే దేశ రక్షణ పరంగా కీలకమైన హైదరాబాద్ లో హైఅలర్ట్ ప్రకటించారు. గురువారం రాత్రి భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం ఆరంభమైన నేపథ్యంలో భారత సైనిక బలగాలకు కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతం నుంచి సైనిక బలగాలను జమ్మూకశ్మీరుకు తరలిస్తున్నారు. కొన్ని కీలక విభాగాల సైనికులు కశ్మీరుకు మిలటరీ వాహనాల్లో పయనమయ్యారు. మరో వైపు భారత సైన్యానికి మద్ధతుగా హైదరాబాదీలు త్రివర్ణ పతకాలను చేతబట్టుకొని సంఘీభావం ప్రకటించారు. పాక్ యుద్ధం నేపథ్యంలో హైదరాబాదీల్లో అందరూ సంఘటితం అయ్యారు. నగరంలో సంఘీభావ ర్యాలీలతో దేశ భక్తి పొంగిపొర్లింది.
పోలీసుల ఫుట్ పెట్రోలింగ్
భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ పోలీసులు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే వివిధ ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ చేశారు. హైదరాబాద్ పోలీసులు మీర్ చౌక్‌లో కవాతు నిర్వహించారు. ఏప్రిల్ 22వతేదీన 26 మంది పర్యాటకులను పాక్ ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్న తర్వాత భారత్ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. హైదరాబాద్ నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు గస్తీని ముమ్మరం చేశామని ,పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
చార్మినార్ వద్ద భారత జెండా రెపరెపలు
ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో చార్మినార్ వద్ద భారత జెండాను ఎగురవేశారు. నగరంలోని విదేశీ రాయబార కార్యాలయాలు , కాన్సులేట్‌లు, ఇతర రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు భద్రతను పెంచారు. నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారుర. ఏదైనా సంఘటన జరిగితే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తామని సీపీ ఆనంద్ తెలిపారు.
స్లీపర్ సెల్ సభ్యులు దాడులకు పాల్పడొచ్చు ...జాగ్రత్త
పొరుగు దేశాల్లో ఉన్న వివిధ ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉన్న స్లీపర్ సెల్ సభ్యులు ఉగ్రవాద దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.సున్నితమైన ప్రాంతాలలో ఏవైనా మతపరమైన అల్లర్లు, ఇతర రకాల ఘర్షణలను నివారించడానికి పోలీసులు నిఘా పెట్టారు.
తెలంగాణలో వైద్య సిబ్బంది సెలవులపై నిషేధం
భారత్- పాక్ యుద్ధం నేపథ్యంలో తెలంగాణ వైద్య విద్య శాఖ డైరెక్టర్ వైద్య సిబ్బందికి సెలవులపై నిషేధం విధించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎటువంటి సెలవులను మంజూరు చేయరాదని డీఎంఈ ఆదేశించారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ తన అధికార పరిధిలోని సంస్థల్లో పనిచేసే వైద్య సిబ్బందికి అన్ని రకాల సెలవులను నిషేధిస్తూ ఆదేశం జారీ చేశారు. గురువారం జారీ చేసిన సర్క్యులర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్‌లు,ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లను ఉద్దేశించి జారీ చేశారు.