గచ్చిబౌలిలో గన్ షాట్స్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు చేసిన ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.;

Update: 2025-02-01 20:05 GMT

గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు చేసిన ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు నిందితుడు గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌కు వెళ్లాడని పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రభాకర్‌ను అరెస్ట్ చేయడం కోసం మాదాపుర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి పబ్‌లోకి వెళ్లారు. ఆయనను చూసిన వెంటనే ప్రభాకర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పబ్‌లో ఉన్న ఒక బౌన్సర్‌కు గాయాలయ్యాయి. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

80కి పైగా కేసులు

బత్తుల ప్రభాకర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. ‘‘గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌కు ప్రభాకర్ వచ్చాడని పక్కాగా సమాచారం అందింది. దాంతో పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్లారు. పోలీసులను చూసిన వెంటనే ప్రభాకర్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గాయాలయ్యాయి. అయితే ప్రభాకర్.. విశాఖ జైలునుంచి తప్పించుకుని వచ్చాడని తెలియడంతో గాలింపు ప్రారంభించం. 2023 నుంచి ప్రభాకర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. పబ్ ఘటనలో అతడిని అదుపులోకి తీసుకున్నాం. అతడి దగ్గర నుంచి రెండు గన్నులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాం. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని వినీత్ చెప్పారు.

Tags:    

Similar News