GULF NRI Grievance | నా కుమారుడిని గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించండి
మొబైల్ బిల్లు బకాయి ఉందని షార్జా విమానాశ్రయంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమారుడు శ్రీధర్ ను విడుదల చేయించాలని తల్లి ప్రమీల కోరారు.
By : Shaik Saleem
Update: 2024-11-29 10:06 GMT
షార్జాలో సిమ్ కార్డు కేసులో తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుడు ఇరుక్కున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్ ఈనెల 17వతేదీన హైదరాబాద్ కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ పోలీసులు అరెస్టు చేశారు.
- శ్రీధర్ పేరుపై ఉన్న పాత మొబైల్ ఫోన్ సిమ్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి 12,850 దిర్హంలు (రూ.3 లక్షలు) బిల్లు చేయడం వల్ల ఇబ్బంది తలెత్తిందని అతని తల్లి ప్రమీల వాపోయారు. అమాయకుడైన తన కుమారుడిని షార్జా జైలు నుంచి విడిపించి ఇండియాకు తీసుకురావాలని ప్రమీల సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తన కుమారుడిని జైలు నుంచి విడిపించేందుకు ఉచిత న్యాయ సహాయం కోసం అడ్వొకేట్ ను నియమించాలని ప్రమీల కోరారు.
ప్రభుత్వం ద్వారా అడ్వొకేట్ ను నియమించి శ్రీధర్ కు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) కల్పించాలని అతని తల్లి ప్రమీల సీఎం ఏ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం హైదరాబాద్ బేగంపేట మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో దరఖాస్తు చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు ఉన్నారు.