గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించడం దారుణం: కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను మోసం చేసింది. రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్కమాట గవర్నర్ నోటి నుంచి రాలేదు అని కేటీఆర్ అన్నారు.;

Update: 2025-03-12 06:41 GMT

తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన ప్రసంగంపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీలో ఈరోజు ఇచ్చింది గవర్నర్ ప్రసంగంలా లేదని.. కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. ఈ ప్రసంగం ద్వారా గవర్నర్ స్థాయిని దిగజార్చారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు, మహిళలు, గురుకుల విద్యార్థులు అంతా నానా కష్టాలు పడుతున్నారని, వారి కష్టాల గురించి కనీసం మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతారేమో అని తాను ఆశించానని, కానీ వాటి ఊసే లేకపోవడం దారుణమని అన్నారు. రైతులకు భరోసా ఇచ్చేలా ఒక్క మాట కూడా లేదని పేర్కొన్నారు.

రైతులకు రుణమాఫీ చేశామని చెప్పించుకుంటున్న ప్రభుత్వం.. ఎక్కడ చేసిందో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో 30శాతం మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. కానీ పూర్తి రుణమాఫీ జరిగిందని గవర్నర్ చేత చెప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డను ఎండగట్టారని, మేడిగడ్డను రిపేర్ చేస్తాం, పంటలను కాపాడతాం అని ఒక్క మాట కూడా అనలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలకు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి 25శాతం కమిషన్ తీసుకోవడం తప్ప విజన్ ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తే.. మంత్రి వెనకదారి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారంటూ చురకలంటించారు.

‘‘గవర్నర్ ప్రసంగం పెళ్లిలో చావు డప్పు కొట్టినట్లు ఉంది. ఇది గవర్నర్ ప్రసంగం కాదు గాంధీ భవన్ ప్రసంగం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ను మోసం చేసింది. బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో పెట్టారు, కాంగ్రెస్ తండ్రిని సచివాలయం బయట పెట్టారు. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని, తండ్రిని భద్రంగా గాంధీ భవన్ కు పంపిస్తాం. ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకొండి. రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్కమాట గవర్నర్ నోటి నుంచి రాలేదు. రాష్ట్రంలో 35 శాతం కూడ రైతు రుణమాఫీ జరగలేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు’’ అని తెలిపారు.

‘‘రైతు రుణమాఫీ 100 శాతం పూర్తి అయిందని రైతులు సంతోషంగా ఉన్నారని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. సాగు , తాగు నీటి సంక్షోభం రోజురోజుకు ఎక్కువ అయిపోతుంది. రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. సచివాలయంలో 20 శాతం కమిషన్ ల కోసం ధర్నాలు చేశారు. నో విజన్, ఓన్లి కమిషన్. కమిషన్ నుంచి వచ్చిన డబ్బులను ఢిల్లికీ మూటలు పంపుతున్నారు. ఒక లక్ష 62 వేళ కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మా హయంలో నాలుగు గున్నర లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి ఖర్చు చేశాం. వరి ధాన్యం పెరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఊర్లోలల్లో కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమి కొడుతున్నారు. 30 శాతం కమిషన్ ఇస్తేనే మంత్రులు పనిచేస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఒక్క గ్యారెంటీ , 420 హామీల్లో ఒక్క హామీ ఇవ్వకుండా లక్ష 60 వేళ కోట్ల రూపాయిలు అప్పులు చేశారు’’ అని విమర్శించారు.

Tags:    

Similar News