తెలంగాణలో రహస్య పాలన, వెలుగుచూడని ప్రభుత్వ జీఓలు

తెలంగాణలో ప్రజాపాలనను తీసుకువచ్చామని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ జీఓలను రహస్యంగా ఉంచుతోంది.పాలనలో పారదర్శకత లోపించింది. సర్కారు జీఓలను బహిర్గతం చేయడం లేదు.;

Update: 2025-04-26 10:13 GMT
తెలంగాణ సచివాలయం

ప్ర‌భుత్వ‌ప‌నిలో పార‌ద‌ర్శ‌క‌త, జ‌వాబుదారీత‌నం పెంచ‌తామని రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రకటించింది. గత సీఎం నివాసమున్న ప్రగతి భవన్ కు నిర్మించిన బారికేడ్లను తొలగించి ప్రజావాణికి శ్రీకారం చుట్టి ప్రజా పాలన అందిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ సర్కారు ఇంకా జీఓలను మాత్రం రహస్యంగానే ఉంచుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేస్తున్న జి.ఓ.లు అంద‌రికీ తెలియ‌జేయ‌డానికి వీలుగా గతంలో అన్ని ప్ర‌భుత్వ జి.ఓ.ల‌ను ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌లో ఉంచేవారు.దీంతో గతంలో ప్ర‌భుత్వ పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త పెరిగింది.


2016 నుంచి రహస్యంగా జీఓలు
2016వ సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వ‌ం ఇచ్చే జి.ఓ.ల‌లో కొన్ని చ‌ట్టానికి విరుద్ధంగా ఉండ‌డంతో వాటిని కోర్టుల్లో ప్రజాసంఘాలు చాలెంజ్ చేయ‌డం జ‌రిగింది. ఈ చ‌ర్య‌లు ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మార‌డంతో అప్ప‌టి రాష్ట్రప్రభుత్వ ముఖ్య‌కార్య‌ద‌ర్శి 2016వ సంవత్సరం ఫిబ్రవరి 2వతేదీనఅంద‌రూ కార్య‌ద‌ర్శుల‌తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక‌నుంచి ముఖ్య‌మైన జి.ఓ.లు ఏవీ కూడా వెబ్‌సైట్‌లో ఉంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.దీనికి ప్ర‌భుత్వం ఇచ్చిన సంజాయిషీ మ‌రీ విడ్డూరంగా ఉంది.కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌భుత్వ జి.ఓ.లు వెబ్‌సైట్‌లో నుంచి తీసుకొని కోర్టును ఆశ్ర‌యిస్తూ రాష్ట్రప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌జాహిత కార్య‌క్ర‌మాల‌కు అడ్డుప‌డుతున్నారని అప్పటి ప్రభుత్వం చెప్పింది.

జీఓలు బహిర్గతం చేయాలని హైకోర్టులో పిల్
తెలంగాణలో ప్ర‌స్థుతం ఎవ‌రైనా జి.ఓ. కాపీ కావాలంటే స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేయాలి. ఈ ద‌ర‌ఖాస్తుల‌కు స్పంద‌న అంతంత మాత్ర‌మే.జి.ఓ. ల‌న్నీ ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాల‌ని కోరుతూ ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ 2016వ సంవత్సరంలోనే హైకోర్టును (పిల్ నం. 14896/2016) ఆశ్ర‌యించింది.ఈ పిటిషనుపై ప్రభుత్వం ఇంత‌వ‌ర‌కు కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌క‌పోవడంతో గత 9 సంవ‌త్స‌రాలుగా కేసు హైకోర్టులో పెండింగులో ఉంది.

జీఓలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టండి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ప్ర‌స్థుతం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ వెబ్‌సైట్ ‘నామ్ కే వాస్తే’ అన్న ప‌ద్ధ‌తిలో ఉంది.ఇందులో ఉద్యోగ‌స్థుల సెల‌వులు,చిన్న చిన్న బిల్లుల మంజూరు వంటివి, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఉప‌యోగం లేని విష‌యాలు అప్‌లోడ్ చేస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నారు.రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎ శాంతికుమారి ఏప్రిల్ నెల చివ‌ర‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న సంద‌ర్భంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, స్వ‌చ్చంద సేవా సంస్థ‌ల‌కు,మీడియాకు ఒక బ‌హుమ‌తిగా అన్ని జి.ఓ.ల‌ను తిరిగి ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌లో పెట్టాల‌ని ఆర్డ‌ర్ వేయాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ కోరింది. ఈ మేరకు తాము తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారికి శనివారం లేఖ రాసినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News