సాహస క్రీడల్లో మెరిసిన బాలికలు,సంగారెడ్డిలో కొత్త ఈవెంట్ సూపర్ హిట్
మంజీరా నదీ సాక్షిగా… అడవిలో అడ్వెంచర్‌లో అడుగుపెట్టిన బాలికలు
By : Shaik Saleem
Update: 2025-11-14 02:13 GMT
సంగారెడ్డి ప్రాంత మంజీరా శివారులోని సైలెంట్ అటవీ ప్రాంతం అకస్మాత్తుగా కేకలు, నవ్వుల శబ్దాలతో మారు మోగింది. తాళ్ల సాయంతో చెట్లు ఎక్కుతూ, కొండలు అధిరోహిస్తున్న బాలికల నడుమ కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది. సాహస క్రీడల శిక్షణలో సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల బాలికలు పాల్గొని సందడి చేశారు.అడవుల్లో అడ్వెంచర్‌కు రంగం సిద్ధమైంది. సంగారెడ్డి కస్తూర్బా పాఠశాల బాలికలు ఇప్పుడు చెట్లు,కొండల్ని జయిస్తూ ధైర్యాన్ని తమ కొత్త ఆయుధంగా మలుచుకుంటున్నారు.భయాన్ని జయిస్తేనే సాహసం మొదలవుతుందని బాలికలు నిరూపించారు.
సాహస క్రీడల సందడి
ఎత్తైన చెట్లపై తాళ్ల సాయంతో పైకి ఎగబాకుతూ...కొండలు, గుట్టలపై తాళ్ల సాయంతో ఎక్కుతూ...ట్రెక్కింగ్...సాహస క్రీడల్లో పాలుపంచుకుంటున్న బాలికలతో సంగారెడ్డి జిల్లా జిల్లా కేంద్రానికి సమీపంలోని కల్పగూర్ శివారు మంజీరా బ్యారేజీ సమీప అటవీ ప్రాంతం సందడిగా మారింది. సంగారెడ్డి జిల్లా కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోని బాలికలకు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సాహస క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. జిల్లాలోని చౌటకూరు, పుల్కల్, ఆందోలు మండలాల్లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలోని 8,9 తరగతులు చదువుతున్న 80 మంది విద్యార్థినులను ఎంపిక చేసి వారికి సాహస క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించి బాలికలతో మాట్లాడారు.
బాలికలకు అడ్వెంచర్ పాఠాలు
మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ శిక్షకులు పి అన్విత, ఎస్ ఆనంద్ కుమార్ ల ఆధ్వర్యంలో మొదటి విడత 40 మంది బాలికలకు చెట్లు ఎక్కడం, కొండలపైకి ఎగబాకటం, ట్రెక్కింగ్ లాంటి సాహస క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటు వారిని సాహస పోటీలకు సమాయత్తం చేసేందుకు వీలుగా ఈ శిక్షణ ఇస్తున్నామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య చెప్పారు. దశలవారీగా సంగారెడ్డి జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ విద్యాలయాల బాలికలకు ఈ సాహస క్రీడల శిక్షణ ఇప్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
అవలీలగా చెట్లు ఎక్కాం...
సాహస క్రీడలంటే మొదట్లో భయం వేసినా సాధన చేసి అవలీలగా చెట్లు, గుట్టలు ఎక్కగలిగామని కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థిని మీనాక్షి చెప్పారు. ఈ సాహస క్రీడల ద్వారా తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. బాలికలు చాలా ఉత్సాహంగా ఈ సాహస క్రీడల్లో పాల్గొంటున్నారని పర్వతారోహణ శిక్షకురాలు పి అన్విత చెప్పారు. పుల్కల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు సంగారెడ్డి పట్టణంలోని మంజీరా పర్యాటక కేంద్రంలో బాలికల ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించదానికి నిర్వహించిన ఒక రోజు అడ్వెంచర్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు.
బాలికల జీవితాల్లో కొత్త ఆశలు
సంగారెడ్డి కస్తూర్బా విద్యాలయాల ఈ చిన్నారులు అడ్వెంచర్ శిక్షణలో చూపుతున్న ధైర్యం, నిబద్ధత చూస్తే వాళ్ల భవిష్యత్తు ఎంత ప్రకాశవంతంగా ఉండబోతోందో అర్థమవుతుంది. అడవిని ఆలింగనం చేస్తూ, గుట్టలను అధిరోహిస్తూ పెరుగుతున్న ఈ ఆత్మవిశ్వాసం రేపు పెద్ద విజయాలకీ పునాది కానుంది.ఈ రోజు చెట్టెక్కడం ఒక చిన్న అడ్వెంచర్ అనిపించవచ్చు. కానీ ఆ మొదటి అడుగు రేపటి పెద్ద ప్రపంచాన్ని జయించేందుకు ధైర్యాన్ని ఇస్తుంది. మంజీరా అడవుల్లో మొదలైన ఈ ప్రయాణం, సంగారెడ్డి బాలికల జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త శక్తులు నింపుతోంది.