కేసీఆర్ కి గజ్వేల్ కాంగ్రెస్ నేతల వినతి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

By :  Vanaja
Update: 2024-10-07 13:34 GMT

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అధినేత ఫోటోకి వినతిపత్రం అందించి వినూత్న నిరసన చేపట్టారు. సోమవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. గత పది నెలలుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది, అలాగే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి తమ ఎమ్మెల్యే అందుబాటులో లేరని ఆందోళన చేపట్టారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలని, నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని కేసీఆర్ ఫోటో వద్ద అతికించారు.

అందుబాటులో లేని కేసీఆర్...

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో బస్సు యాత్ర పేరిట బయటకి వచ్చి పార్టీ తరపున ప్రచారం చేశారు. ప్రచారం ముగిసిన తర్వాత మళ్ళీ ఆయన ఎర్రవెల్లిలోనే ఫార్మ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆమధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వరుసపెట్టి ఫిరాయిస్తున్న సమయంలో ఫార్మ్ హౌస్ లో వరుస భేటీలు నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా నాయకులను, కార్యకర్తలను, ప్రజలను తనవద్దకే పిలిపించుకుని సమావేశాలు జరిపారు. కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి.

కేసీఆర్ ఎక్కడ?

ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలై తండ్రి కేసీఆర్ ని కలవడానికి ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కి వెళ్లారు. ఆ సందర్భంగా కేసీఆర్, కవిత భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసింది. తర్వాత ఆయనకి సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు, వార్తలు బయటకి రాలేదు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తి ప్రజలు అవస్థలు పడుతున్నప్పుడు కూడా ఆయన బయటకి వచ్చింది లేదు. దీంతో కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. ప్రధాన ప్రతిపక్ష నేత ఫార్మ్ హౌస్ ని వీడి ఎందుకు బయటకి రావడం లేదు? రాష్ట్రంలో ప్రజలు ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా వారిని పరామర్శించరా అంటూ కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. ఇటీవల కొండా సురేఖ సంచలన ఆరోపణలు కూడా చేశారు. కేసీఆర్ బయటకి రాకపోవడంపై కేటీఆర్ ఆయన్ని ఏమైనా చేశారేమో అనే అనుమానాలు రేకెత్తిస్తోంది అంటూ వివాదానికి తెరలేపారు.

ఆమె చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో గజ్వేల్ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ రాకకై ఆందోళన చేయడం ఆసక్తికరంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆందోళనలు నిర్వహించడం సర్వసాధారణం. మా ఎమ్మెల్యే ఆచూకీ లభించడం లేదు అని పోస్టర్లు అంటించడం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వడం, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదనో, ఎమ్మెల్యేల తీరు బాగోలేదనో, వివిధ పరిస్థితుల్లో గాంధీ విగ్రహాలకు, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వడం కామన్. అయితే సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీల అధినేతలకు సంబంధించి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. తాజాగా గజ్వేల్ లో కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ ఫోటోకి వినతి పత్రం ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.

వినతి పత్రంలో ఏముందంటే...

"గజ్వేల్ నియోజకవర్గ పేద ప్రజలకు అందాల్సిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు మీరు సమయం కేటాయించని కారణంగా పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. పేద ప్రజలు దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు సైతం మీ అనుమతి లేనిదే పంపిణీ కార్యక్రమం కుదరదని పేర్కొంటున్నారు. స్థానిక ప్రజలు మీపై నమ్మకం మిమ్మల్ని గజ్వేల్ శాసనసభ్యులు గెలిపించారు. గజ్వేల్ ప్రజలు తమ సమస్యలు, కష్టాలను పరిష్కరిస్తారనే భావంతో ఉండగా, మీరు గెలిచినప్పటి నుండి అందుబాటులో లేకపోవడం బాధాకరం. అలాగే మీ క్యాంపు ఆఫీసు కూడా మీకోసం ఎదురు చూస్తోంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు అసంపూర్తి దశలో ఉన్న బస్టాండ్ నిర్మాణం, రింగ్ రోడ్డు తదితర పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని కోరుతున్నాము. అలాగే పేద ప్రజలకు లక్కీ డ్రా ద్వారా డబల్ బెడ్ రూమ్ లబ్దిదారులను గుర్తించిన ఇప్పటి వరకు వారికి అందించలేదు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ తో పాటు పెండింగ్ పనులు పూర్తి చేయించాలని మనవి చేస్తున్నాము" అంటూ గజ్వేల్ కాంగ్రెస్ కమిటీ వినతి పత్రంలో పేర్కొంది. 

Tags:    

Similar News