విజిలెన్స్ విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు, ఫిలింనగర్ ప్లాట్ల బాగోతం

ఫిలింనగర్ భూములను అనర్హులు, బోగస్ సభ్యులు విలువైన భూములను కారుచౌకగా దక్కించుకున్నారని తెలంగాణ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ జరిపిన విచారణలో వెల్లడైంది.;

Update: 2025-04-14 06:16 GMT
ఫిలింనగర్ క్లబ్

ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ భూముల కొనుగోల్ మాల్ పై తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ రాష్ట్ర సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, మున్సిపల్ శాఖ కార్యదర్శికి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి విజిలెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ రహస్య నివేదికను పంపించారు. 2012 నుంచి ఫిలింనగర్ సొసైటీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ డీజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.భూముల కేటాయింపు, బదలాయింపులో సినీ పరిశ్రమావృద్ధికి ఆటంకం కలిగేలా సొసైటీ బైలాస్ కు విరుద్ధంగా నిర్ణయాలు చేశారని విజిలెన్స్ తన నివేదికలో తేల్చి చెప్పింది.


సహకారశాఖ నిబంధనలు, సొసైటీ బైలాస్ ఉల్లంఘన
కోఆపరేటివ్ యాక్ట్ సెక్షన్ 21 ఎ అండర్ 18 నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ కార్పొరేటరుగా ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శిగా కాజా సూర్యనారాయణ జోడు పదవులు నిర్వర్తించడాన్ని విజిలెన్స్ తప్పు పట్టింది. కోఆపరేటివ్ యాక్ట్ సెక్షన్లకు విరుద్ధంగా బైలాస్ ను గాలికొదిలిన సొసైటీ మేనేజ్ మెంట్ కమిటీపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ప్లాట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై దర్యాప్తులు జరిగినా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.నివాస గృహాలకు బదులు కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విజిలెన్స్ విభాగం ఎత్తి చూపించింది. ఈ సొసైటీలో అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు సొసైటీకి జిల్లా సహకార శాఖాధికారిని స్పెషల్ ఆఫీసరుగా నియమించాలని విజిలెన్స్ సిఫార్సు చేసినా సర్కారు పట్టించుకోలేదు.

భార్యాభర్తలకు సొసైటీలో సభ్యత్వం, జంట ప్లాట్ల కేటాయింపు
హౌసింగ్ సొసైటీ నిబంధనల ప్రకారం భార్యాభర్తల్లో ఒక్కరికి ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం కల్పించి, ప్లాటు కేటాయించాలి. కానీ 9 మంది సభ్యులు వారితోపాటు వారి భార్యల పేరిట రెండేసి ప్లాట్లను అక్రమంగా పొందారని విజిలెన్స్ తన నివేదికలో వెల్లడించింది. వందేమాతరం శ్రీనివాస్, అతని భార్య కె మంజులకు సైట్ నంబరు 1లో సీ62, సీ63 ప్లాట్లను కేటాయించారు. మరో సభ్యుడు కేఎస్ గౌతం, అతని భార్య కె సజానీకి ఎ 55, సి-3 ప్లాట్లను ఇచ్చారు. కె రఘురామకృష్ణంరాజుకు ఏ-31, అతని భార్య కె రమాదేవికి ఏ-30 ప్లాట్లు అప్పగించారు. పి నరోత్తంరావు, పి లక్ష్మీ దంపతులకు, కోడి రామకృష్ణ, కోడి పద్మలకు, టి చిన్నపరెడ్డి, టీ కల్పనారెడ్డిలకు, మాగంటి మురళీ మోహన్ కుమారుడు మాగంటి రామ్మోహన్, అతని కోడలు రూపాలకు రెండేసి ప్లాట్లను కేటాయించారు. సొసైటీ సెక్రటరీగా పనిచేసిన కాజా సూర్యనారాయణ, అతని భార్య కేఎస్ కుమారి, ఎన్ భాస్కర్, ఎన్ సుమతి దంపతులకు ప్లాట్లు కేటాయించారు.

సొసైటీలో బోగస్ సభ్యులు
ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీలో 42 మంది బోగస్ సభ్యులున్నారని సహకార శాఖ జరిపిన పలు విచారణల్లో తేలింది. బోగస్ సభ్యుల నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేశారు. సినీపరిశ్రమలోని వారికి చెందాల్సిన ప్లాట్లను ఇతరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బదిలీ చేశారు. రాక్ కటింగ్ చార్జీల పేరిట సొసైటీలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ తేల్చిచెప్పింది. సొసైటీ సెక్రటరీగా పనిచేసిన కాజా సూర్యనారాయణ 8 ఎ, 6 బి, 4 ఎ ప్లాట్లలో భవనాల నిర్మాణానికి దరఖాస్తు చేశారు.సొసైటీలో జరిగిన అక్రమాలపై హైదరాబాద్ జిల్లా సహకార శాఖ అధికారిణి డాక్టర్ ఎన్ కిరణ్మయీ, జాయింట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ వి భాస్కరాచారి లు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి అక్రమాలపై నివేదికలు సమర్పించినా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది.

బోగస్ షభ్యుల ప్లాట్లను రద్దు చేయాలి
సినిమా పరిశ్రమకు సంబంధం లేని వారు, ఇతరులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజిలెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సహకార చట్టం యాక్ట్ 1964 సెక్షన్ 21(1) (జి) ప్రకారం అయిదుగురు బోగస్ సభ్యుల సభ్వత్వాన్ని రద్దు చేయాలని విజిలెన్స్ కోరింది.

మద్రాస్ నుంచి సినీ పరిశ్రమల తరలింపు పేరిట...
మద్రాస్ నుంచి తెలుగు సినీపరిశ్రమను హైదరాబాద్ నగరానికి తరలింపులో భాగంగా 1980వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ జిల్లా గోల్కొండ తాలూకా షేక్ పేట బంజారాహిల్స్ ప్రాంతం మైక్రోవేవ్ టవర్ వద్ద 45 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం ఎకరం 8,500రూపాయలకు ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించింది.

పప్పుబెల్లాల్లా ప్లాట్ల పంపిణీ
సినీపరిశ్రమ అభివృద్ధి కోసం ఆ రంగంలో పనిచేస్తున్న వారికి, స్టూడియోలు,డబ్బింగ్ థియేటర్లు, ల్యాబరేటరీలు, సినిమా అనుబంధ సంస్థలకు స్థలాలు కేటాయించాల్సి ఉండగా, అత్యంత విలువైన ఈ స్థలాలను పప్పుబెల్లాల్లా సినీ పరిశ్రమతో సంబంధం లేని బడా వ్యక్తులు దక్కించుకున్నారు. ఈ భూముల కేటాయింపు, బదలాయింపుల్లో నిబంధనలకు నీళ్లు వదిలారు. ప్రస్థుతం ఫిలింనగర్ లో ఎకరం మార్కెట్ ధర వంద కోట్ల రూపాయలకు పైగా ఉండగా, సినిమా పరిశ్రమ అభివృద్ధి పేరిట సినిమా రంగానితో సంబంధం లేని బడా వ్యక్తులు చేజిక్కించుకున్నారని పలు దర్యాప్తుల్లో తేలింది. ఫిలింనగర్ లో ప్రభుత్వ భూమిని కారు చౌకగా హౌసింగ్ సొసైటీకి అప్పగించగా, ఆ సొసైటీలో అడుగడుగునా అక్రమాలు జరిగాయి.

బోగస్ సభ్యులకు ఇళ్ల ప్లాట్లు
ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీలో సినీ పరిశ్రమతో సంబంధం లేని వారి సభ్యత్వాలను, ప్లాట్ల కేటాయింపును రద్దు చేయాలని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.సహకార శాఖ నిబంధనలు, హౌసింగ్ సొసైటీ బైలాస్ ప్రకారం ఒక కుటుంబానికి ఒక్కటే ప్లాటు కేటాయించాల్సి ఉండగా, భార్య, భర్తల పేరు మీద రెండు ప్లాట్లను కేటాయించినందున వాటిని రద్దు చేయాలని విజిలెన్స్ నివేదిక కోరింది.

ఇళ్ల కేటాయింపులను రద్దు చేయండి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ఫిలింనగర్ లో 450 ఇళ్లను సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తులకు అప్పగించారని సహకార శాఖ అధికారిణి డాక్టర్ ఎన్ కిరణ్మయీ దర్యాప్తులో తేలింది. దీంతో పాటు 42 మంది బోగస్ సభ్యులకు ప్లాట్లు కేటాయించారని తేలినందున వాటిని రద్దు చేసి, వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. సొసైటీ సెక్రటరీగా అక్రమాలకు పాల్పడిన కాజ సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదికలో సర్కారుకు సూచించారు. సొసైటీ అకౌంటెంట్ దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాలని సూచించారు.


Tags:    

Similar News