రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొట్టిన ఈటల రాజేందర్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెచ్చిపోయారు. పేదల భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారు.;
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెచ్చిపోయారు. పేదల భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారు. పేదల భూములను కబ్జా చేశారని తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఈటల.. సదరు వ్యాపారి చెంప చెల్లుమనిపించారు. వెంటనే పక్కనే ఉన్న అనుచరులు ఆ వ్యాపారిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే తమ భూములను అన్యాక్రాంతం చేస్తున్నరంటూ బాధితులు ఈటలను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిపించాలని వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఈటల రాజేందర్.. మంగళవారం మేడ్చల్ జిల్లలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భూములను ఆక్రమించారంటూ ఆరోపణలు ఎదర్కొంటున్న రియల్ వ్యాపారులపై ఈటల ఫైరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొట్టారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. కబ్జాలను అడ్డుకోవాలని అన్నారు.
‘‘కొందరు తెలియక కబ్జా స్థలాలను కొంటున్నారు. పేదల భూములను కబ్జా చేయడం నేరం. పేదల భూముల జోలికి వస్తే కఠిన చర్యలు ఉంటాయి. పేదల భూములను కబ్జా చేసి వ్యాపారం చేసుకుంటున్న బ్రోకర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలోని పేదలను బీజేపీ అండగా ఉంటుంది. బ్రోకర్లకు కొమ్ముకాస్తున్న అధికారులను వదిలిపెట్టం’’ అని ఈటల హెచ్చరించారు.
తప్పు అధికారులది..
‘‘1985లో నార్పల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. వారి భూములను కబ్జాలు చేసి కొందరు బ్రోకర్లు అమ్ముకుంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా లేఖ రాస్తున్నా. అందులో అన్ని వివరాలు పొందుపరుస్తా. ఈ కబ్జా భూములు కొనుకున్న వారిది తప్పు కాదు. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులు, కబ్జాలు చేసిన బ్రోకర్లది తప్పు. ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్. చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే పాలన సులభతరం అవుతుంది. కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం. కానీ కలెక్టర్లు కంటి చూపుకు కూడా చిక్కడం లేదు. పోలీసు కమిషనర్‌కి మనల్ని కలవడానికి సమయం ఉండదు. కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం కావాల్సినంత సమయం ఉంటుంది’’ అంటూ ఈటల విమర్శలు గుప్పించారు.