హైడ్రా గురించి ఆందోళన చెందవద్దు:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బ్యాంకర్లు, బిల్డర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.హైడ్రా అనుమతులు ఇవ్వదని ఆయన పేర్కొన్నారు.
By : Shaik Saleem
Update: 2024-11-06 11:46 GMT
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. బుధవారం ప్రజాభవన్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని ఆయన వివరించారు.
ఆక్రమణలు కాకుండా హైడ్రా చూస్తుంది...
హైడ్రా సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కుల అక్రమణలు,సరస్సులు ఆక్రమించుకోకుండా చూస్తుందని భట్టివిక్రమార్క తెలిపారు.ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బ్యాంకింగ్ రంగం ద్వారా చేయూతను అందించాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశామన్నారు.ఈ సమావేశం ఏర్పాటుకు చొరవ చూపిన బ్యాంకర్లు, స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు లను డిప్యూటీ సీఎం అభినందించారు. తమది ప్రజా ప్రభుత్వం అని, ప్రజల పట్ల కమిట్మెంటుతో ఉన్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.
మహిళల ఆర్థికాభివృద్ధికే మహాలక్ష్మి పథకం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసేలామహాలక్ష్మి పథకం కేవలం మహిళలు ఊరికే తిరగడానికి అని కొంతమంది అనుకుంటారు.. అది వాస్తవం కాదని తెలిపారు. మహాలక్ష్మి పథకం మహిళలు గౌరవ మర్యాదలతో జీవించేందుకు దోహద పడుతుంది అన్నారు.‘‘మహిళలు బయటకు రావాలి ప్రపంచాన్ని చూడాలి, అవకాశాలు తెలుసుకోవాలి.. వ్యాపారాలు చేయాలి ఆర్థికంగా బలోపేతం కావాలి.. కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలనేదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశం’’అని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్ధికంగా బలోపేతం అవుతారు, తద్వారా కుటుంబం బలోపేతం అవుతుందని భట్టి వివరించారు.
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు
స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ నిర్ణయించిందని, వీలైతే అంతకుమించి వడ్డీ లేని రుణాలు ఇస్తామని భట్టి చెప్పారు.బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలని, రుణాలు ఇచ్చే ముందు ఉన్న నిబంధనలు సరళ తరం చేయాలని కోరారు.బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీ రేట్లు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలని అన్నారు.
పారిశ్రామిక పార్కులు
ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు భట్టి తెలిపారు.ఈ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నట్టు చెప్పారు. బ్యాంకర్లు విశాలా దృక్పథంతో సహకరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది అన్నారు.