గాంధీ విగ్రహం వద్దు..విద్య, వైద్యం ముద్దు, తుషార్ గాంధీ సూచన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ విగ్రహం ఏర్పాటుకు డబ్బు ఖర్చు చేయకుండా విద్యకు వెచ్చించాలని మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సూచించారు.
By : Shaik Saleem
Update: 2024-11-04 12:06 GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ సంచలన సలహా ఇచ్చారు. మూసీ తీరంలోని బాపూఘాట్ వద్ద అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో తుషార్ గాంధీ స్పందించారు. ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని తుషార్ గాంధీ సూచించారు. విగ్రహాలకు నిధులు వెచ్చించకుండా, ఆ డబ్బును విద్య, వైద్యరంగం అభివృద్ధికి కేటాయించాలని ఆయన కోరారు.తుషార్ గాంధీ తెలంగాణ సర్కారుకు ఇచ్చిన సలహా వైరల్ గా మారింది.
బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్
హైదరాబాద్ నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుంచి వచ్చే మూసా, ఈసా నదుల సంగమం వద్ద బాపూఘాట్ ఉంది. మూసీ నదీ తీరంలోని బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ పేరిట ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మూసీ నదీ పునరుజ్జీవంలో భాగంగా బాపూఘాట్ ను ఆధ్యాత్మికంగా, విద్యాబోధన కేంద్రంగా రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్ ను తీర్చిదిద్ది,మహాత్ముడి అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
తుషార్ గాంధీ సూచనకు నెటిజన్ల మద్ధతు
బాపు ఎత్తైన విగ్రహాల పోటీకి తాను వ్యతిరేకమని, విగ్రహాలకు కాకుండా విద్యాభివృద్ధి కోసం నిధులు వెచ్చించాలని తుషార్ గాంధీ కోరారు. తుషార్ గాంధీ సూచనను పలువురు నెటిజన్లు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.కానీ మరికొందరు గాంధీ పెద్ద విగ్రహాన్ని బాపూఘాట్ లో ఏర్పాటు చేయాలని, అదే గాంధీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అంటూ పోస్టులు పెట్టారు.
గాంధీ విగ్రహాలపై అధికారుల ఆరా
అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని బాపూఘాట్ లో మూసీ తీరాన ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలతో తెలంగాణ అధికారులు గాంధీ విగ్రహాల ఎత్తుపై ఆరా తీస్తున్నారు. బీహార్ లోని పాట్నాలోని గాంధీ మైదాన్ లో అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో 22 అడుగుల ఎత్తు ఉన్న గాంధీ విగ్రహం ఏర్పాటైంది.అంత కంటే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.తుషార్ గాంధీ సూచనను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.