ఆ టపాసులు కొన్నొద్దు.. కాల్చొద్దు.. ప్రజలకు రాజా సింగ్ విజ్ఞప్తి

దీపావళి పండగ వేళ కాల్చే టపాసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టపాసుల పేరిట భారీ కుట్ర జరుగుతోందన్నారు. అదేంటంటే..

Update: 2024-10-31 11:36 GMT

దీపావళి పండగ వేళ కాల్చే టపాసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టపాసుల పేరిట భారీ కుట్ర జరుగుతోందని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. కొన్ని టపాసులను కొనద్దొని, కాల్చొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే దీపావళి పండగ అంటే వెలుగుల పండగ. దీపావళి పండగ వస్తుందంటే అందరికీ టపాసులే గుర్తొస్తాయి. పిల్లలైతే నెల రోజుల ముందునుంచే ఏమేం టపాసులు కొనాలా అని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటుంటారు.

కాగా కొంత కాలంగా వాయు కాలుష్యం, గాలి కాలుష్యం కారణంగా దీపావళికి టపాసులు పేల్చడంపై అనేక ఆంక్షలు అమలవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పూర్తిగా బాణాసంచా తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం కూడా విధించడం జరిగింది. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో టపాసులపై ఆంక్షలు విధించాలంటూ గతంలో తీర్పునిచ్చింది. ఈరోజు దీపావళి పండగ కావడంతో ఎక్కడ చూసినా టపాసుల మోత మోగిపోతోంది. తెలంగాణలో అటువంటి ఆంక్షలేమీ లేకపోవడంతో పెద్దలు పిల్లలు అన్న తేడా లేకుండా టపాసుల పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చాలా మంది ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు కూడా. ‘టపాసుల పేరిట మన దేవుళ్లను అప్రతిష్టపాలు చేస్తున్నారు’ అని రాజా సింగ్ అన్నారు.

మన చేతే అంతా చేయిస్తున్నారు..

‘‘మన దేవుళ్ల పేర్లతో రకరకాల టపాసులు తయారు చేస్తున్నారు. వాటిని మనకే అమ్మి.. మన చేతే కాల్చేలా చేస్తున్నారు. హిందువులంతా కూడా ఈ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలి. అదే విధంగా టపాసులు కాల్చే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. చిన్నారులు తప్పకుండా పెద్దల సమక్షంలోనే టపాసులు కాల్చారు. కాగా దేవుడి బొమ్మలతో ఉన్న టపాసులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు. కాల్చొద్దు. అటువంటి టపాసుల తయారీ వెనక పెద్ద కుట్రే ఉంది. ప్రధానంగా లక్ష్మీబాంబులు అంటూ లక్ష్మీ దేవి బొమ్మ వేసి టపాసులు విరివిరిగా విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేయొద్దు, కాల్చొద్దు. దేవుడి బొమ్మ ఉన్న ఏ టపాసులను కొనకుండా హిందువులు జాగ్రత్త పడాలి’’ అని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.

వాటిని కాల్చడం ఏంటి..?

‘‘నిత్యం లక్ష్మీ దేవి పూజ చేయడం హిందువులకు ఆనవాయితీ. అటువంటి మనమే దీపావళి పండగ రోజున వెనకా ముందు ఆలోచించకుండా అలా అమ్మవారి బొమ్మలతో తయారు చేసిన టపాసులు కొనడం, వాటిని కాల్చడం ఏంటి. వాటినే తొక్కుకుంటూ తిరగడం ఏంటి. ఒక్కసారి ఆలోచించుకోండి. మన దేవుళ్లను మనమే అవమానించేలా, అగౌరపరిచేలా కొందరు పక్కా ప్లాన్ ప్రకారం టపాసుల కుట్రకు పాల్పడుతున్నారు’’ అని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే ఈ విషయంలో చాలా మంది రాజా సింగ్ మాటలతో ఏకీభవిస్తున్నారు. రాజా సింగ్‌కు మద్దతుగా ఆయన వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికీ చేరాలని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరికొందరైతే దేవుళ్ల బొమ్మలతో టపాసులను తయారు చేయడంపై ముందుగా బ్యాన్ విధించాలని, ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా డిమాండ్లు చేస్తున్నారు.

Tags:    

Similar News