సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు

దీపావళి పండగ వస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి కార్మికుడికి దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Update: 2024-10-24 12:51 GMT

దీపావళి పండగ వస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి కార్మికుడికి దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం భారీ నిధులు కూడా కేటాయించినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వడం కోసం సింగరేణి సంస్థ రూ.358 కోట్లు విడుదల చేయాలని సంస్థ సీఎండీ ఎన్ బలరామ్‌ను ఆదేశించారు భట్టి. సచివాలయంలో గురువారం సింగరేణిపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగానే భట్టి విక్రమార్క ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన దీపావళి బోనస్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దీపావళి బోనస్ రూ.50కోట్లు అధికంగా ఉండటం ప్రస్తుతం విశేషంగా మారింది. ఈ బోనస్ నగదు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం మధ్యాహ్నానికి పడిపోవాలని కూడా భట్టి పేర్కొన్నారు. దీపావళి బోనస్ కింద సింగరేణి కార్మికుడు ఒక్కొక్కరు రూ.93,750 అందుకోనున్నారు. సింగరేణి సంస్థలో దాదాపు 40వేల మంది పనిచేస్తుండగా ప్రతి ఒక్కరికీ ఈ బోనస్ అందాలని ప్రభుత్వం ఆదేశించింది.

బొగ్గు పరిశ్రమ కోసం జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ బోనస్‌ చెల్లించే పద్ధతిని తీసుకొచ్చారు. గత కొన్నేళ్లుగా ఈ పద్దతి అమల్లో ఉంది. ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే బోనస్ చెల్లింపులు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇటీవలే సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ.796 కోట్లను కంపెనీ పంపిణీ చేసిందని సింగరేణి సీఎండీ తెలిపారు.

Tags:    

Similar News