తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగీ జ్వరాలు

తెలంగాణలో డెంగీ జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.ఈ ఏడాది జనవరి నుంచి జులై నెల వరకు 1800 డెంగీ కేసులు నమోదయ్యాయి.డెంగీ జ్వరాల వల్ల పలువురు మరణించారు.

Update: 2024-07-31 01:00 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలతో దోమలు వ్యాప్తిచెందడంతో హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి.హైదరాబాద్ నగరంలోనే 60 శాతం డెంగీ కేసులు నమోదయ్యాయి.

- రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 40 శాతం డెంగీ జ్వరాల కేసులు వెలుగుచూశాయి. ఒక్క జులై నెలలోనే 1345 డెంగీ కేసులు నమోదైనాయని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ చెప్పారు.
- గత ఏడాది జులై నెలలో 728 డెంగీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది వీటి సంఖ్య రెట్టింపు అయింది. ఇందులో 372 డెంగీ పాజిటివ్ కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే బయటపడ్డాయని వైద్యఆరోగ్యశాఖ సీనియర్ అధికారి తెలిపారు.
- మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ జ్వరాల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో జనవరి నుంచి జూన్ నెల వరకు 1074 డెంగీ జ్వరాలు వెలుగుచూశాయి.

ప్లేట్ లెట్ల కోసం పెరిగిన డిమాండ్
ప్రైవేటు ఆసుపత్రులకు డెంగీ జ్వరాలతో రోజుకు ఇద్దరు, ముగ్గురు రోగులు వస్తున్నారు. డెంగీ జ్వరాల జోరుతో ప్లేట్ లెట్ల కోసం డిమాండ్ పెరిగింది. డెంగీ జ్వరాలతో ప్లేట్ లెట్ల శాతం పడిపోతుండటంతో వైట్ సెల్స్ కోసం రోగులు బ్లడ్ బ్యాంకులకు అభ్యర్థనలు చేశారు. ప్లేట్ లెట్ల కోసం రోగులు బ్లడ్ బ్యాంకుల్లో క్యూ కడుతున్నారు.

తెలంగాణలో ఇంటింటి జ్వర సర్వే
తెలంగాణలో డెంగీతోపాటు వివిధ రకాల జ్వరాల జోరు పెరగడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి జ్వర సర్వేను ప్రారంభించింది. వైరల్ జ్వరాలతోపాటు డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది.తెలంగాణలో డెంగీ జ్వరాల శాతం పెరిగిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ వెక్టర్‌ బోర్న్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ తెలిపింది.ప్రతి రోజూ ఇంటింటికీ సర్వే నిర్వహించి డెంగీ, సంబంధిత జ్వరాల కేసులను నమోదు చేయాలని ప్రభుత్వ వైద్యాధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

డెంగీతో విద్యార్థి మృతి
మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మం డల సూరారంలో సోమవారం డెంగీతో ఇంటర్‌ విద్యార్థి కుమ్మరి నిఖిల్‌ (17) మృతి చెందాడు.చేగుంటలోని ఓ ప్రైవేటు దవాఖానాలో నిఖిల్ కు రక్త పరీక్షలు చే యించగా డెంగీగా తేలింది. తెల్ల రక్తకణాలు పూర్తి గా పడిపోవడంతో ఆయన మరణించారు.

డెంగీ జ్వరాల జోరు
గతంలో కంటే ఈ ఏడాది డెంగీ జ్వరాల కేసులు తగ్గుముఖం పట్టినా, ఈ ఏడాది మృతుల సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.2019వ సంవత్సరంలో 13,331 డెంగీ కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించారు. 2020లో 2,173 కేసులు, 2021లో 7,135 కేసులు, 2022లో 8,972 కేసులు నమోదయ్యాయి. 2023వ సంవత్సరంలో 8,016 డెంగీ కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు.

వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక
తెలంగాణలో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ప్రకటించడంతో డెంగీ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. తలుపులు, కిటికీలను దోమతెరలతో మూసివేయాలని, ఉదయం,సాయంత్రం దోమలు ఎక్కువగా సంచరించే సమయాల్లో అవి రాకుండా కిటికీలను మూసి ఉంచాలని వైద్యులు సూచించారు. సెప్టిక్ ట్యాంకులను మెష్‌తో కప్పి ఉంచాలని సిఫార్సు చేశారు. ఇళ్ల చుట్టూ నిలిచిపోయిన నీటిని తొలగించడానికి వారానికోసారి ఫ్రైడే డ్రై డే పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ కోరింది.

నోరోవైరస్ కేసులు నమోదు కాలేదు : డీపీహెచ్
ఓల్డ్ సిటీలో నోరోవైరస్ కేసులు ఏవీ నిర్ధారించలేదని పబ్లిక్ హెల్త్ తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ చెప్పారు.ఆజంపురా, ఈడీ బజార్, పురానీ హవేలీ, యాకుత్‌పురా, ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాల్లో నోరోవైరస్ కేసులను వైద్యులు గుర్తించినట్లు కొందరు చేస్తున్న ప్రచారం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నోరో వైరస్ గురించి భయాందోళన చెందవద్దని ఆయన సూచించారు.ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుమానిత నోరోవైరస్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ నాయక్ తెలిపారు. అయితే ఈ కేసులను ధృవీకరించలేదన్నారు. గత వారం రోజులుగా పాతబస్తీ అంతటా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని డాక్టర్ నాయక్ వివరించారు.


Tags:    

Similar News