తెలంగాణలోనూ నియోజకవర్గాల పునర్ విభజన అంశంపై తెలంగాణ రాజకీయ నేతల్లో కదలిక వచ్చింది. విభజన పేరిట జరగబోయే ప్రమాదం గురించి చర్చిద్దాం రండి అంటూ రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బుధవారం రాత్రి బహిరంగ లేఖ రాశారు.తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉంది. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
చర్చనీయాంశంగా మారిన పునర్ విభజన
దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్ విభజన 2026వ సంవత్సరంలో జరగనున్న నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల్లో తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉంటాయా? లేవా ? అనే విషయంలో ఉత్కంఠ ఏర్పడింది. కొత్త నియోజకవర్గాలు ఎక్కడ ఏర్పడతాయా అనేది రాజకీయ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాల పునర్ విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని, దక్షిణాది రాస్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య 54 కు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.
డీఎంకే ఆందోళన
పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య 543 నుంచి 848కి పెరుగుతాయని, ఇందులో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరుగుతాయని దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ పెరుగుతాయని చెబుతున్నారు.పునర్ విభజనలో నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే తమిళనాడు నేతలు ఆందోళన చేపట్టారు.యూపీ, బీహార్ రాష్ట్రాల్లో కొత్త నియోజకవర్గాలు అధికంగా ఏర్పడతాయని అంచనాలు పెరిగాయి. నియోజకవర్గాల పునర్ విభజన, హిందీ భాష వివాదంపై డీఎంకే సర్కారు పోరాట బాట పట్టింది. నియోజకవర్గాల పునర్ విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. డీలిమిటేషన్ విషయంలో తాను స్టాలిన్ కు మద్ధతు ఇస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లు పెరగాలి : మాజీ ఎంపీ వినోద్ కుమార్
జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లను పెంచితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే అవకాశముందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 153 సీట్లకు ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు పెంచాల్సి ఉందని ఆయన చెప్పారు.
పునర్విభజనపై చర్చించేందుకు సమావేశం
నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్ధేశించిన సమావేశానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున తమిళనాడు మంత్రి టి.కె.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం కలిసి సమావేశానికి రమ్మని ఆహ్వానించింది.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో ఈ నెల 22వతేదీన సమావేశం ఏర్పాటు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు.మార్చి 22న ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులతో స్టాలిన్ సమావేశం నిర్వహించనున్నారు. డీఎంకే ప్రిన్సిపల్ సెక్రటరీ, తమిళనాడు మంత్రి కె.ఎన్. నెహ్రూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం న్యూఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసింది.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొడతాం : సీఎం రేవంత్ రెడ్డి
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టే కార్యాచరణ చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అది నియోజకవర్గాల పునర్విభజన కాదని దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను కుదించే ప్రయత్నమని సీఎం పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు చెన్నైలో ఈ నెల 22న జరిగే సమావేశానికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు తమిళనాడు సీఎం రాసిన లేఖను ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.ఎన్.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం ఢిల్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం అందజేసింది. 2026 తర్వాత చేపట్టే జన గణన వరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదని నిబంధనలున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అంతకుముందు గానే ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చిందని తమిళనాడు సీఎం స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
భవిష్యత్ కార్యాచరణకు జేఏసీ
నియోజకవర్గాల పునర్విభజనపై తమ రాష్ట్రంలో ఇప్పటికే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని లేఖలో వెల్లడించారు. ఈ విషయంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలతో కూడిన ఐక్య కార్యాచరణ కమిటీలో (జేఏపీ) చేరేందుకు అంగీకారం తెలపాలని స్టాలిన్ లేఖలో కోరారు. భవిష్యత్ కార్యాచరణ చేపట్టేందుకు జేఏసీలోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రతినిధిని నియమించాలని లేఖలో సూచించారు.
బీజేపీ కుట్ర
దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీకి పెద్దగా ప్రాతినిధ్యం లేదని,దక్షిణాది రాష్ట్రాల్లో ఓటమితో ఈ రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా ఇప్పటికే నిర్ణయించిందని సీఎం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకొని తాను చెన్నై సమావేశానికి హాజరవుతానని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలోనూ అఖిలపక్ష సమావేశం
నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ రాష్ట్రంలోనూ చర్చలు జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అన్ని పార్టీల నేతలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానా రెడ్డిలకు సూచించినట్లు సీఎం తెలిపారు. తాము నిర్వహించే సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని... ఆయన సమావేశంలో పాల్గొని అక్కడ వెల్లడైన అభిప్రాయాలను కేంద్ర కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం కోరారు. తమ హక్కుల రక్షణకు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పాటుపడాల్సి ఉన్నందున ఆయనను పిలుస్తామన్నారు.
దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
రాజకీయ పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు అంతా పాటుపడాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 22న చెన్నైలో నిర్వహించే సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజనతో కలిగే నష్టాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణను రూపొందిస్తామని సీఎం స్పష్టం చేశారు.