తల్లితో కలిసి తండ్రి ఊపిరి తీసిన కుమార్తె!
హత్య అనంతరం ముగ్గురూ సెకండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని చెరువులో పారేసి వెళ్లిపోయారు... ఈ కథేమిటంటే..;
By : The Federal
Update: 2025-07-10 05:03 GMT
ఒక తండ్రి – తన కూతురి జీవితంపై పెదవి విరిచాడు. ప్రేమ పేరుతో భ్రష్టుపట్టిన బంధాన్ని అడ్డుకుంటున్నాడన్న కోపంతో… కన్నతండ్రినే కడతేర్చిందో కుమార్తె. ఇంతటి దారుణానికి తన ప్రియుడు, కన్నతల్లి కూడా సహకారించడం గమనార్హం.
ఆ తండ్రి చేసిన తప్పేమిటంటే…
‘నీవు తీసుకున్న మార్గం సరికాదు’ అనడమే. అదే అతని చివరి శ్వాస అయింది. ఈ విషాదాంతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో వెలుగుచూసింది. ఓ కుమార్తె ప్రేమ కుటుంబ అనుబంధాలన్నింటినీ ఛిన్నాభిన్నం చేశాయి. మనీషా అనే యువతికి తన భర్త స్నేహితుడితో ఏర్పడ్డ ప్రేమ… తండ్రిని చంపేసేలా చేసింది. దారుణ హత్యకు దారితీసింది.
కల్లు, నిద్రమాత్రలు, ప్రణాళిక…
లింగం ఓ అపార్టుమెంట్‌లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుంటాడు. భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్. పెద్ద కుమార్తె మనీషాకి ఇప్పటికే పెళ్లయి, విడాకులు తీసుకొని ప్రియుడితో కలిసి జీవిస్తోంది. తండ్రి లింగం దీనిని సహించలేక, ఆమెను మందలించేవాడు. తల్లి శారద మాత్రం కుమార్తెకు మద్దతు ఇచ్చింది. తన భర్త తీరును ఎప్పుడూ తప్పుబట్టే శారద ‘లింగం ఒట్టి అనుమానపు పక్షి’ అని కూతురితో తరచూ చెప్పేది.
ఈ నేపధ్యంలో, జూలై నెల 5వ తేదీ రాత్రి.. లింగం హత్యకు ప్రణాళిక రూపొందించింది. మనీషా నిద్రమాత్రలు తెచ్చి తల్లికి ఇచ్చింది. తల్లి వాటిని కల్లులో కలిపి భర్తకు ఇచ్చింది. గాఢనిద్రలోకి వెళ్లిన లింగాన్ని.. మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారద కలిసి ముఖంపై దిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా చేశారు. కన్నతండ్రి చివరి శ్వాసను తన చేతులతోనే ఆపింది మనీషా.
హత్య తరువాత సినిమాకు…
హత్య అనంతరం ముగ్గురూ సెకండ్ షో సినిమాకు వెళ్లారు. తర్వాత తిరిగి వచ్చి ఓ క్యాబ్ బుక్ చేసి మృతదేహాన్ని కారులో ఎక్కించారు. క్యాబ్ డ్రైవర్ అనుమానం వ్యక్తం చేయగా, "కల్లు తాగి మత్తులో ఉన్నాడు" అన్నారు. ఎదులాబాద్ వద్ద దిగి, శవాన్ని చెరువులో పడేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టే వెళ్లిపోయారు.
జూలై 7న స్థానికులు చెరువులో ఓ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాన్ని వెలికి తీయగా.. గాయాలతో మృతుడు ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు… మృతుడు- లింగంగా గుర్తించారు. దర్యాప్తులో చెరువు ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. హత్య వెనక ఉన్న దారుణ నిజాలు బయటపడ్డాయి.
బంధాల పతనం – ప్రేమ పేరుతో…
ఈ ఘటన మనలోని మానవత్వాన్ని, బంధాల విలువను ప్రశ్నిస్తుంది. ఒక తండ్రి – విలువలతో కూడిన కూతురి భవిష్యత్తు కోసం ఆరాటతుంటే… అదే కూతురు, తన ఇష్టం నెరిగిన ప్రేమ కోసం, కుటుంబాన్ని అంతం చేస్తుందా? ఒక తల్లి… భర్త హత్యలో సహకరించగలదా? ఇది వాస్తవం. ఓ కుటుంబం – ప్రేమ అనే పేరుతో నాశనం అయిపోయింది.
మొత్తానికి ఈ ఘటన మనుషులు, మమతలు, ఆప్యాయతలను ప్రశ్నిస్తోంది. గుండెలవిసేలా చేస్తోంది.