దానం దెబ్బకు మొత్తుకుంటున్న బీఆర్ఎస్ ఎంఎల్ఏలు

కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్ పెట్టిన చిచ్చు మామూలుగా లేదు.

Update: 2024-06-23 08:00 GMT

కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్ పెట్టిన చిచ్చు మామూలుగా లేదు. తొందరలోనే 20 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు పెద్ద బాంబు పేల్చారు. 25 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలారోజులుగా చెబుతున్నారు. కాని దానం మాత్రం కొందరి పేర్లు చెప్పటంతో బీఆర్ఎస్ లో చిచ్చు మొదలైంది.

బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏ దానం చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గాంధీభవన్లో దానం మీడియాతో మాట్లాడుతు తొందరలోనే 20 మంది కారుపార్టీ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు చెప్పారు. ఈ 20 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ తో సంప్రదింపులు కూడా పూర్తి చేసుకున్నారని కండువా కప్పుకోవటమే మిగిలిందన్నారు. ఇంతటితో ఊరుకోకుండా పార్టీలోకి రాబోయే ఎంఎల్ఏల్లో కొందరిపేర్లను కూడా చెప్పారు. చామకూర మల్లారెడ్డి, ముఠాగోపాల్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కొత్తా ప్రభాకరరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, ఆరెకపూడి గాంధీ తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు.

ఎప్పుడైతే దానం పై ఎంఎల్ఏల పేర్లు చెప్పారో వెంటనే కారుపార్టీలో గోల మొదలైపోయింది. అసలే కాంగ్రెస్ లోకి ఫిరాయించబోయే ఎంఎల్ఏలు ఎవరాని కేసీయార్ ఎప్పటికప్పుడు ఆరాలు తీస్తున్నారు. అనుమానం వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. పార్టీని విడిచిపెట్టేస్తారనే సమాచారం ఉన్నవాళ్ళని పిలిపించుకుని మాట్లాడుకుంటున్నారు. అనుమానం ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు, అవసరమైన హామీలను కూడా ఇస్తున్నారు. అయినా గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. అలాగే మరికొందరు ఎంఎల్ఏలు కూడా పార్టీ మారటం ఖాయమని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే దానం కొందరి పేర్లు ప్రకటించటం సంచలనంగా మారింది.

దానం ప్రకటించిన ఎంఎల్ఏలు నిజంగా కాంగ్రెస్ లోకి వస్తున్నారో లేదో తెలీదు కాని ఇప్పటికైతే వాళ్ళంతా లబోదిబోమంటున్నారు. తమకు పార్టీ మారే ఆలోచనే లేదంటు వాళ్ళలో కొందర మొత్తుకుంటున్నారు. అబర్ పేట ఎంఎల్ఏ కాలేరు యాదయ్య మాట్లాడుతు ‘ఒక ఎంఎల్ఏ పార్టీ మారబోతున్నట్లు మరో ఎంఎల్ఏ ఎలా చెబుతాడ’ని మండిపోతున్నారు. ‘పార్టీ మారబోతున్న ఎంఎల్ఏలు వీళ్ళే అని కొందరి పేర్లు చెప్పటానికి దానం ఎవరం’టు రెచ్చిపోయారు. ‘తాను పార్టీ మారబోతున్నట్లు దానం చెప్పటం బాధగా ఉం’దని ఎల్బీ నగర్ ఎంఎల్ఏ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ‘తాను పార్టీ మారిన తర్వాత మరికొందరి పేర్లు ప్రకటించటం మంచి పద్దతికాద’న్నారు. పార్టీమారబోతున్నారని చెప్పిన పేర్లలో దానం తనపేరు ఎందుకు ప్రస్తావించారో తనకు తెలీదని వాపోయారు. దానం మాటలను తన విచక్షణకే వదిలేస్తున్నట్లు దేవిరెడ్డి చెప్పారు.

శేరిలింగంపల్లి ఎంఎల్ఏ ఆరెకపూడి గాంధి మాట్లాడుతు ‘పార్టీ మార్పుగురించి తాను దానంతో ఎప్పుడూ చర్చించనేలేద’న్నారు. ‘పార్టీ మారేవాళ్ళలో దానం తన పేరు ఎందుకు చెప్పారో తనకే తెలీటంలేద’ని వాపోయారు. ‘తనపై నమ్మకంతోనే మూడుసార్లు గెలిపించిన ప్రజలకు సేవచేయటమే తనకు ముఖ్యంకాని పార్టీ మారటం కాద’న్నారు. కాంగ్రెస్ లో చేరే ఉద్దేశ్యం, ఆలోచన కూడా తనకు లేదని గాంధీ స్పష్టంచేశారు. చివరగా ముషీరాబాద్ ఎంఎల్ఏ ముఠాగోపాల్ మద్దతుదారులు మాట్లాడుతు పార్టీ మారే ఆలోచన తమ ఎంఎల్ఏకి లేదన్నారు. పార్టీ మారుతారని తమ ఎంఎల్ఏపై వస్తున్న వార్తలు, ప్రచారమంతా కల్పితమే అని మద్దతుదారులు చెప్పారు. మొత్తానికి ఎంతమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరుతారో తెలీదుకాని ఇప్పటికైతే దానం కారణంగా చాలామంది ఎంఎల్ఏలు లబోదిబోమంటుని మొత్తుకుంటున్నారు.

Tags:    

Similar News