కంటైనర్ ఆసుపత్రి సక్సెస్, ములుగు మన్యంలో మరో 3 ఆసుపత్రులు
గిరిజనులకు ప్రభుత్వ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కంటైనర్ ఆసుపత్రి ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో మన్యంలో మరో మూడు ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నారు.
By : Shaik Saleem
Update: 2024-07-19 07:48 GMT
గిరిజనులకు సత్వరం సర్కారు వైద్యం అందించాలనే లక్ష్యంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామ పంచాయతీ పరిధిలోని పోచాపూర్ గ్రామంలో ప్రయోగాత్మకంగా ఈ నెల 14వతేదీన కంటైనర్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారు.
- పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పోచాపూర్ అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఐదురోజుల్లోనే పలువురు గిరిజన రోగులకు ఏఎన్ఎం, ఆశావర్కర్లు చికిత్స అందించారు.
- పోచాపూర్ గ్రామానికి చుట్టపక్కల ఉన్న నర్సాపూర్, అల్లిగూడెం, బొల్లెప్లి, బంధాల గ్రామాల గిరిజన రోగులకు పోచాపూర్ కంటైనర్ ఆసుపత్రిలో గత ఐదు రోజులుగా మందులు అందించారు. జ్వరాలు, జలుబు,డయేరియా, దగ్గు,ఒళ్లు నొప్పుల సమస్యతో పోచాపూర్ కంటైనర్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు అక్కడ పారామెడికల్ ఉద్యోగులు టాబ్లెట్లను అందించారు.
మారుమూల గిరిజన గ్రామాల్లో అందుబాటులోకి వచ్చిన ప్రాథమిక వైద్యం
జాతీయ రహదారికి 40 కిలోమీటర్ల దూరంలోని మారుమూల పోచాపూర్, నర్సాపూర్, అల్లిగూడెం, బొల్లెప్లి, బంధాల గ్రామాల గిరిజనులకు గతంలో సర్కారు వైద్యం అందేది కాదు. వర్షాకాలంలో ఈ ఐదు గిరిజన గ్రామాల చుట్టూ వర్షకాలంలో వాగులు పొంగి ప్రవహిస్తుండేవి. దీంతో ఐదు గ్రామాల గిరిపుత్రులకు ఏదైనా రోగాలు వస్తే పసర్ల వైద్యమే శరణ్యంగా మారేది. వైద్యం కోసం డోలీల్లో రోగులను దూరంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాల్సి వచ్చేది. పోచాపూర్ కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటుతో గిరిజనులకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి వచ్చింది.
కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటుకు డాక్టర్ అప్పయ్య ప్రతిపాదనలు
ములుగు మండలం అంకన్నగూడెం గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన అల్లెపు అప్పయ్య పట్టుదలతో కష్టపడి ఎంబీబీఎస్ చదివి వైద్యఆరోగ్యశాఖలో వైద్యుడి చేరారు. ప్రభుత్వ వైద్యుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన డాక్టర్ అప్పయ్య ఏకంగా ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయ్యారు. మన్యంలో పుట్టి పెరిగి వైద్యుడైన అప్పయ్యకు గిరిజన గ్రామాల సమస్యలు తెలుసు. దీంతో వినూత్నంగా ఆలోచించి మారుమూల గిరిజన గ్రామాలకు సర్కారు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ములుగు కలెక్టరు దినకరకు ప్రతిపాదించారు.జిల్లా కలెక్టర్ దినకర, రాష్ట్ర మంత్రి సీతక్క చొరవ తీసుకొని దేశంలోనే ప్రప్రథమంగా పోచాపూర్ లో కంటైనర్ ఆపసుపత్రి ఏర్పాటు చేయించారు.కంటైనర్ ఆసుపత్రి ప్రయోగం విజయవంతం అయిందని, గిరిజనులకు సర్కారు వైద్యం అందుతుందని మంత్రి సీతక్క చెప్పారు.
మరో మూడు కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు
పైలెట్ ప్రాజెక్టుగా పోచాపూర్ కంటైనర్ ఆసుపత్రి ప్రయోగం విజయవంతం కావడంతో ములుగు మన్యంలోని మారుమూలన ఉన్న మరో మూడు గిరిజన గ్రామాల్లో ఇదే తరహాలో కంటైనర్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని తాను ములుగు జిల్లా కలెక్టరుకు ప్రతిపాదించినట్లు ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అల్లెపు అప్పయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు పంపించారు. కన్నాయిగూడెం మండలం అయిలాపూర్, వాజేడు మండలం ఎడ్జర్లపల్లి, లక్ష్మీపురం గిరిజన గ్రామాల్లో కంటైనర్ అదనపు ఉప ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు.
గోదావరి తీర ప్రాంతాల గ్రామాల ప్రజలకు మందుల సరఫరా
గోదావరి నదీ వర్షాకాలంలో తరచూ ఉప్పొంగుతుండటం వల్ల తీర ప్రాంత గ్రామాలు తరచూ ముంపునకు గురవుతున్నాయి. వరదనీరు ముంచెత్తుతుండటంతో దోమలు వ్యాప్తి చెంది పలు రోగాలు వస్తున్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడు, తాడ్వాయి మండలాల్లోని 351 గ్రామాలుండగా, వారిలో 73 గ్రామాలు గోదావరి వరద పీడిత గ్రామాలుగా గుర్తించారు. తరచూ గోదావరి వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలకు మూడు నెలలకు కావాల్సిన మందులను తాము సరఫరా చేశామని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెపు అప్పయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గోదావరి తీర ప్రాంతాల ప్రజలకు మందులతో పాటు టార్స్ లైట్లు, రోప్స్ అందించామని ఆయన చెప్పారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో 32 పడవలను కూడా అందుబాటులో ఉంచామని డాక్టర్ అప్పయ్య వివరించారు.