రేవంత్ కు మొదటి దెబ్బ..ఎవరినుండో తెలుసా ?
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేదా ప్రతిపక్షం బీజేపీ నుండి ఇబ్బందులు వస్తాయని అందరు అనుకుంటున్నారు.
రేవంత్ కు మొదటిదెబ్బ తగిలిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. రేవంత్ పాలనకు, విధానాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేదా ప్రతిపక్షం బీజేపీ నుండి ఇబ్బందులు వస్తాయని అందరు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సొంతపార్టీ నేతల నుండే ఎదురుదెబ్బ తగలటం ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్ ఎంఎల్ఏ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు.
మొదటినుండి ఫిరాయింపులను, ఇతర పార్టీల్లో నుండి ఎంఎల్ఏలను చేర్చుకోవటాన్ని ఎంఎల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. బాన్సువాడ బీఆర్ఎస్ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నపుడే జీవన్ తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తంచేశారు. ఫిరాయింపులను బహిరంగంగానే వ్యతిరేకించారు. అలాంటిది తన నియోజకవర్గం జగిత్యాల బీఆర్ఎస్ ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరటాన్ని జీవన్ ఏమాత్రం ఊహించలేదు. చాలాకాలంగా జీవన్-సంజయ్ రాజకీయంగా ప్రత్యర్ధులుగా ఉన్నారు. గడచిన రెండు ఎన్నికల్లోను జీవన్ పై సంజయ్ గెలిచారు. ఇద్దరి మధ్యా సంబంధాలు ఉప్పునిప్పులాగున్నాయి. ఇలాంటి నేపధ్యంలో జీవన్ కు ఒక్కమాట కూడా చెప్పకుండానే, జీవన్ కు తెలీకుండానే రేవంత్ రెడ్డి చక్రంతిప్పి సంజయ్ ను పార్టీలో చేర్చుకోవటాన్ని ఎంఎల్సీ జీర్ణించుకోలేకపోయారు.
సంజయ్ పార్టీలో చేరిన తర్వాత రెండు రోజులుగా నియోజకవర్గంలోని తన మద్దతుదారులతో సమావేశమవుతునే ఉన్నారు. జీవన్ అసంతృప్తిని గమనించిన అధిష్టానం మాట్లాడేందుకు సీనియర్ నేతలను దూతలుగా పంపింది. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కొందరు సీనియర్లు జీవన్ ఇంటికి వెళ్ళి బుజ్జగింపులు మొదలుపెట్టారు. అయితే బుజ్జగింపులు, మంతనాలు ఏమయ్యాయో తెలీదు కాని మంగళవారం ఉదయం జీవన్ తన రాజీనామాను ప్రకటించారు. తొందరలోనే తాను ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసి మామూలు కార్యకర్తగా కంటిన్యు అవుతానని చెప్పారు. తన ప్రమేయంలేకుండానే జరగకూడనిది జరిగిపోయిందని, ఆ విషయంలో తాను చేయగలిగింది ఏమీలేదని ఎంఎల్సీ నిర్వేదంతో అన్నారు. కాబట్టి ఎంఎల్సీకి రాజీనామా చేసిన తర్వాత నేతలు, మద్దతుదారులతో మాట్లాడుకుని నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. పార్టీ మారే ఆలోచన మాత్రం తనకు లేదని స్పష్టంచేశారు.
ఇపుడు విషయం ఏమిటంటే ఆపరేషన్ ఆకర్ష్ ను రేవంత్ మొదలుపెట్టారు. ఎంతమందిని వీలుంటే అంతమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవటమే టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికి ఐదుగురు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ హస్తంపార్టీలో చేరిన విషయం తెలిసిందే. 25 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నట్లు మంత్రులు చేస్తున్న ప్రకటనలు అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ ను జీవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించటమే కాకుండా దాన్ని బాహాటంగా వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడే రేవంత్ కు సమస్యలు మొదలయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల సంగతి ఎలాగున్నా జగిత్యాలలో తన ప్రత్యర్ధి, బీఆర్ఎస్ ఎంఎల్ఏ సంజయ్ ను తనకు తెలియకుండా, తనతో మాట్లాడకుండానే రేవంత్ పార్టీలోకి చేర్చుకోవటాన్ని ఎంఎల్సీ తట్టుకోలేకపోతున్నారు.
జీవన్ దెబ్బకు సంజయ్ పార్టీలో నుండి బయటకు వెళిపోతారా ? లేకపోతే కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతారా అన్నది ఆసక్తిగా మారింది. పార్టీలో ఉంటారా వెళిపోతారా అన్న సందేహాలు ఎందుకంటే ఎంఎల్ఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోని జీవన్ మద్దతుదారులంతా ఏకమై నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా సంజయ్ పార్టీలో చేరిక రేవంత్ కు పెద్ద తలనొప్పిగా మారిందన్నది వాస్తవం. ఇపుడు సంజయ్ పార్టీలో ఉండటం లేకపోతే వెళిపోవటం అన్నది రేవంత్ కు ప్రిస్టేజిగా మారింది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.