రుణమాఫీ పూర్తి చేసేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి..

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-11-08 09:34 GMT

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏది ఏమైనా రుణమాఫీ పూర్తయి తీరుతుందని అన్నారు. కొందరు మాత్రం రైతులను మోసం చేశామంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. ఇప్పటికి కూడా ప్రతి రోజూ రైతుల రుణమాఫీపై ప్రభుత్వం చర్చిస్తోందని, ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా రైతుల రుణమాఫీని వేగంగా పూర్తి చేయొచ్చు అన్న అంశాలను పరిశీలిస్తున్నామని, ఏది ఏమైనా డిసెంబర్ నెలలో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని చెప్పారు మంత్రి. రుణమాఫీ విషయంలో తమ ప్రభుత్వం చాలా రిస్క్ తీసుకుందని, రూ.31వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతుందని, ఆ విషయం తెలిసి కూడా తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేసిందని ఆయన వివరించారు. ఇప్పటికే చాలా వరకు రైతు రుణమాఫీని పూర్తి చేశామని, మిగిలి ఉన్న వారికి కూడా డిసెంబర్‌లో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కాబట్టి రైతులు భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, తమ ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయదని వివరించారు.

రుణమాఫీ వందశాతం జరుగుతుంది

‘‘రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితుల్లో రూ.31వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని మాకు తెలుసు. అయినా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రూ.18వేల కోట్ల రుణమాఫీ చేసింది. మిగిలిన రూ.13వేల కోట్ల రుణమాఫీని డిసెంబర్ నెలలో పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఆరంభంలోనే రూ.7,800 కోట్ల నిధులను రైతుభరోసా కోసం విడుదల చేశాం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలాన్ని మోడల్‌గా ఎంచుకుని ఆరు వేల ఎకరాల్లో సర్వే చేయించాం’’ అని ఆయన తెలిపారు.

రైతు భరోసా అందుకే ఆలస్యం

‘‘సర్వే చేసిన భూములలో 2,100 ఎకరాల ప్రభుత్వ భూములపై బీఆర్ఎస్ బినామీలు రైతుబంధు అందుకున్నారని తెలిసింది. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే అనేక చర్యలు తీసుకున్నాం. దాని వల్లే రైతు భరోసా ఆలస్యమైంది. అంతేకాని రైతు భరోసాను బంద్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మరికొద్ది రోజుల్లో ప్రతి కుటుంబానికి మా ప్రభుత్వం స్మార్ట్ కార్డును జారీ చేయనుంది. అదే తెల్ల రేషన్ కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. రానున్న నాలుగేళ్లలో 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను పేదవారికి అందిస్తాం’’ అని స్పష్టం చేశారు పొంగులేటి. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీని డిసెంబర్‌లో పూర్తి చేస్తామని పొంగులేటి చెప్పడం వేనక వేరే కారణం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

రుణమాఫీ వెనక కారణం ఇదేనా..

రైతు రుణమాఫీ ప్రస్తుతం తెలంగాణ అంతటా హాట్‌టాపిక్‌గా ఉంది. ఈ విషయంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మరో డెడ్‌లైన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో డిసెంబర్ సెంటిమెంట్ అధికమవుతోంది. నేతల్లో అయినా ఈ ఎటాచ్‌మెంట్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది 2023 డిసెంబర్ 9వ తేదీ కావడమే ఈ సెంటిమెంట్‌కు కారణం. ఇప్పుడు మరోసారి తమ ప్రభుత్వం వచ్చి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా 9 డిసెంబర్ 2024ను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా, మరోసారి విక్టరీ టేస్ట్ చూడాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

ఇందుకోసమే రైతు రుణమాఫీని స్పెషల్ డిష్‌గా మార్చుకోనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే రుణమాఫీ అరకొరగా జరిగిందంటై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. వారి విమర్శలను గట్టిగా తిప్పికొట్టేలా డిసెంబర్ 9న రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రతిపక్షాలను విమర్శలను కూడా అదే రోజున గట్టిగా తిప్పికొట్టాలని కూడా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఒకవైపు ప్రతిపక్షాలకు ఘాటు సమాధానం ఇవ్వడంతో పాటు రైతుల ఓట్లు చేజారకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేలా డిసెంబర్ 9న భారీ ప్లాన్ చేస్తోందని సమాచారం. నేతలు చెప్తున్న మాటలకు కూడా దీనినే సూచిస్తున్నాయి. రుణమాఫీకి డిసెంబర్ 9ని సరికొత్త డెడ్‌లైన్‌గా రేవంత్ సర్కార్ ఫిక్స్ చేసుకుందని వారి మాటలను బట్టి అర్థమవుతోంది.

Similar News