‘కాంగ్రెస్ కుట్రలు వరదలో కొట్టుకుపోయాయి’.. కేటీఆర్ కౌంటర్

తెలంగాణ నీటి ప్రాజెక్ట్‌లపై గతంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈరోజు కౌంటర్ ఇచ్చారు. కుట్రలన్నీ వరదల్లో కొట్టుకుపోయాయన్నారు.

Update: 2024-07-20 13:47 GMT

‘తెలంగాణ నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో బీఆర్ఎస్ తీవ్ర అవినీతికి పాల్పడింది. బీఆర్ఎస్ చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కాళేశ్వరం అంటూ రాష్ట్ర ప్రజలను నిండా ముంచింది’ అంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. నీటిపారుదల ప్రాజెక్ట్‌లపై అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇంతలో బీఆర్ఎస్ నేతలు ఒకరి తర్వాత ఒకరుగా కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో ఈ రెండు పార్టీల మధ్య వైరం మరింత పెరిగింది. అయితే అప్పట్లో నీటి ప్రాజెక్ట్‌లపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పరిస్థితులు వరదలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో బీఆర్ఎస్ అవినీతి చేసిందంటూ తమ పార్టీపై బురదజల్లాడికి కాంగ్రెస్ పన్నిన్న కుట్రలన్నీ కూడా ఇప్పుడు వస్తున్న గోదావరి వరదలో కొట్టుకుపోయాయని కేటీఆర్.. ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వీడియోను కూడా షేర్ చేశారు. కాంగ్రెస్ కుట్రలన్నీ వరదల్లో కొట్టుకుపోగా తమ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం మాత్రం గర్వంగా తలెత్తుకుని ఉందన్నారు.

పటాపంచలైన పన్నాగాలు

వర్షాల వల్ల పోటెత్తిన వరదకు దుష్టశక్తులు పన్నిన పన్నాగాలే పటాపంచలయ్యాయన్నారు కేటీఆర్. ‘‘ఇంతటి వరదల్లో కూడా కేసీఆర్ సంకల్పం(కాళేశ్వరం) సలాం కొడుతోంది. జల హారతి పడుతోంది. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్షల కోట్ల రూపాయలు నాశనం చేశారన్న విమర్శలు కొట్టుకుపోయాయి. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరన్న నోర్లు ఈరోజు మూగబోయాయి. ఇంతటి వరదల్లో కూడా మేడిగడ్డ బ్యారేజీ మాత్రం మెక్కవోని దీక్షతో నిలబడింది. కొండంత బలాన్ని ఈ బ్యారేజ్ చాటిచెబుతోంది. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, మోసాలు చేసినా దశాబ్దాల పాటు దగాడ్డ తెలంగాణ నేలకు ఇప్పటికీ, ఎప్పటికీ మన రైతుల కష్టాలు తీర్చే ‘మేటి’గడ్డ’’ అని కేటీఆర్ అన్నారు. ‘‘కాళేశ్వరమే తెలంగాణ కరువును పారదోలే కల్పతరువు. బురదరాజకీయాలను ఈ వరదలు భూస్థాపితం చేశాయి. మానవ నిర్మిత అధ్బుతాన్ని సాధించిన కేసీఆర్‌కు తెలంగాణ సమాజం మరోసారి సెట్యూల్ చేస్తోంది’’ అని కేటీఆర్ రాసుకొచ్చారు.

ఇంతటి వర్షాలను, వరదలను తట్టుకుని కూడా మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లు నిండుకుండల్లా మారాయని బీఆర్ఎస్ పేర్కొంది. మేడిగడ్డ అంతా కుంగిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయిందంటూ కాంగ్రెస్, వందల కొద్దీ యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు చేసిన దుష్ప్రచారం అంతా కూడా ఈ వరదల్లో కొట్టుకుపోయిందని, కాంగ్రెస్ కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తుందని బీఆర్ఎస్ తెలిపింది. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక కాంగ్రెస్ ఎన్నో కుట్రలు పన్నిందని, వాళ్లు ఏం చేసినా కాళేశ్వరం ప్రాజెక్ట్ జీవధారగా నిలుస్తుందని, అలాంటి కాళేశ్వరంపై బురజల్లే ప్రయత్నం చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయమని కేటీఆర్ మండిపడ్డారు.

Tags:    

Similar News