Allu Arjun | విచారణకు పోలీసుస్టేషనుకు రండి,పుష్పాకు పోలీసుల నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి ఘటనలో నిందితుడైన అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం రాత్రి నోటీసులు జారీ చేశారు.
By : Shaik Saleem
Update: 2024-12-23 16:00 GMT
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి ఘటనలో నిందితుడైన అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం రాత్రి నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం (డిసెంబరు 24వతేదీ) 11 గంటలకు చిక్కడపల్లి పోలీసుస్టేషనుకు రావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.
- గతంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.అయితే నాలుగు వారాలపాటు అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఒక్క రోజులోనే విడుదలయ్యారు.
- సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పోలీసులు ఆదివారం విడుదల చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులతో ఐకాన్ స్టార్ అయిన బన్నీ విచారణకు వస్తారా? లేదా ? అనేది మంగళవారం తేలనుంచి.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని సాక్షాత్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం పేర్కొన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు విచారణను వేగిరం చేశారు.
- థియేటర్ వద్ద ఓ మహిళ మరణించిందని, థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు అల్లు అర్జున్ ను కోరినా వెళ్లేందుకు మొదట ఆయన నిరాకరించారని, సినిమా చూసి వెళ్తానని సమాధానమిచ్చారంటూ సీఎంతోపాటు పోలీసులు పేర్కొన్నారు. మరో వైపు సీఎం వ్యాఖ్యల అనంతరం మధ్యంతర బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ విలేఖరుల సమావేశం నిర్వహించడాన్ని పోలీసులు తప్పు పట్టారు.
- ఈ నేపథ్యంలో బన్నీ బెయిలు రద్దుకు పోలీసులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని సమాచారం. మొత్తం మీద అల్లు అర్జున్ కేసు వ్యవహారం సంచలనం రేపుతోంది.