KTR | ‘ప్రజాశక్తి సత్తా చాటిన ఘనత నల్లగొండదే’

ప్రజాశక్తి అంటే ఎంత గొప్పదో చాటి చెప్పిన గడ్డ నల్లగొండ అని మాజీ మంత్రి, బీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.;

Update: 2025-01-28 11:29 GMT

ప్రజాశక్తి అంటే ఎంత గొప్పదో చాటి చెప్పిన గడ్డ నల్లగొండ అని మాజీ మంత్రి, బీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాశక్తిని మించిన శక్తి మరేదీ లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మహా రైతు ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నోళ్లు చక్రవర్తల్లా, రారాజుల్లా విర్రవీగుతున్నారని, తాను పోరాట వీరులని, యోధులని అంటున్నది వారిని కాదని స్పష్టం చేశారు. నియంత పాలకుడికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం చేసిన వారి గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని వివరించారు. ఆనాడు ‘బండెనక బండి గట్టి.. పదహారు బండ్లుగట్టి ఏ బండ్లే పోతవ్ కొడుకో నైజాము సర్కరోడా’ అని ఆనాటి నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ అని గుర్తు చేశారు. పోరాట స్ఫూర్తికి మారుపేరయిన నల్లగొండ గడ్డకు వందనం అని తెలిపారు.

రైతులను నిలువునా మోసం చేశారు

‘‘రేవంత్ రెడ్డి భరోసా ఇస్తాం అన్నారు.. మాట తప్పారు. రైతులను నిలువునా మోసం చేశారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆగిపోద్ది అన్నాము. అన్నట్లే జరిగింది. ఓట్లు అడిగేటప్పుడు మాత్రమే ఒక్కసారి రైతు బందు వేసారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. అందుకే మళ్ళీ డబ్బులు వేస్తాం అని మాట మార్చారు. రుణమాఫీ 100 శాతం చేయలేదు. 40 శాతం మందికి మాత్రమే చేశారు. కాంగ్రెస్ వాళ్లను గ్రామ సభల్లో నిలదీస్తున్నారు. ఎక్కడికెళ్లినా దుమ్ము దులుపుతున్నారు. రూ.15 వేలు భరోసా అని ఇప్పుడు రూ.12 వేలు ఇచ్చి మోసం చేస్తున్నారు. దరఖాస్తులు అడుగుతూ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. బోనస్ అన్నారు.. అదీ లేదు. తీరా సన్న ధాన్యం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అన్నీ డ్రామాలు చేస్తుండ్రు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నాడు రేవంత్. అందుకే ఇప్పుడు రైతు బంధు నిలిపివేయాలని కుట్ర చేస్తున్నారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.17500 బాకీ ఉన్నారు. అవి అన్నీ ఇయ్యాలి. కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలి. నల్లగొండ నుండే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడాలి. పోరాటం మొదలైంది... తెలంగాణ అంతా సర్వ నాశనం అయింది. మంత్రులను ఎక్కడికక్కడ నిలదీయాలి. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తుండు. చాలా వల్గార్‌గా మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డికి దమ్ముంటే మిటింగ్ పెట్టి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. రైతులకు ఏం చేశారో చెప్పాలి. హైకోర్టుకు ధన్యవాదాలు... మాకు ధర్నాకు అనుమతి ఇచ్చారు...న్యాయం బ్రతికే ఉంది... అధికారుల్లారా జాగ్రత్త...మళ్ళీ మేమే వస్తాం..అన్నీ చూసుకుంటాం’’ అని అన్నారు.

తెలంగాణనే నెంబర్ 1

‘‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నల్లగొండ జిల్లాకు ఏం చేసిండని కొందరు మూర్ఖులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఈ చెందిన ఓ మంత్రి కూడా అడుతున్నారు. ఇంత అజ్ఞానమా? వరిని పండించడంలో హర్యానా, పంజాబ్‌ల తలదన్నేలా తెలంగాణను తీర్చిదిద్దిందెవరు? దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా.. ఎస్సారెస్సీ స్టేజ్-2 కింద ఉన్న తుంగతుర్తి, సూర్యాపేట, కొదాడ పరాంతాలకు కేసీఆర్ కంటే ముందు ఎన్నడూ సరిగా సరిగా సాగునీరు ఇచ్చిన నేత లేరు. ఎన్‌ఎస్‌పీ కింద కూడా ఎన్నడూ టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్లు అందలేదు. కానీ కృష్ణలో, గోదావరిలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల పథకంగట్టినా, ఇటు ప్రపంచమే విస్తుబోయే స్థాయిలో కాళేశ్వరం నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

ఇది రైతు ధర్నా లెక్క లేదు..

ఈ సందర్భంగానే ధర్నాను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ.. అసలు ఇది రైతు ధర్నా లెక్క లేదని, విజయోత్సవ సభ మాదిరిగా ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రానికి కష్టకాలం వచ్చిందని, రాష్ట్రానికి పట్టుకొమ్మలైన రైతులు, విద్యార్థులు సైతం విలవిల్లాడుతున్నారని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని విద్యార్థులు గొడ్డుకారం వేసుకుని అన్నం తినాల్సిన గతి పట్టిందని ఆవేదన వ్యాఖ్యానించారు. తన రాక సందర్భంగా నల్లగొండ ప్రజల ఆదరణ చూస్తుంటే విజయోత్సవ ర్యాలీకి వచ్చిన అనుభూతి కలుగుతుందని అన్నారు.

Tags:    

Similar News