గొర్రెల స్కామ్ లో పెద్ద తలకాయలు

గొర్రెల స్కామ్ రూపంలో పెద్దఎత్తున మనీల్యాండరింగ్ జరిగిందన్న విషయాన్ని ఈడీ గుర్తించింది.

Update: 2024-06-13 10:52 GMT

కేసీయార్ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలున్న గొర్రెల పంపిణీ స్కామ్ లో పెద్ద తలకాయలున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఈ స్కామ్ విషయంలో ఈడీ దృష్టిపెట్టింది. గొర్రెల స్కామ్ రూపంలో పెద్దఎత్తున మనీల్యాండరింగ్ జరిగిందన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణంపై ఇప్పటికే ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తుచేసి సుమారు రు. 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ అనుమానిస్తోంది.

ఏసీబీ దర్యాప్తులో నిర్ధారణ అయినా స్కామ్ విషయంలో ఈడీ మనీల్యాండరింగ్ జరిగినట్లు నిర్ధారించటం గమనార్హం. అంటే ఒకవైపు ఏసీబీ మరోవైపు ఈడీ స్కామ్ లో సంబంధం ఉన్న వాళ్ళకి గుక్కతిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. మనీ ల్యాండరింగ్ చట్టం కింద కేసు నమోదుచేసుకుని గొర్రెల పంపిణీ కుంభకోణాన్ని దర్యాప్తు చేయబోతున్నట్లు ఈడీ జోనల్ కార్యాలయం నుండి పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. తమ దర్యాప్తుకు వీలుగా గొర్రెల కొనుగోళ్ళు, పంపిణీ, లబ్దిదారులు తదితరాలన్నింటిన్నింటినీ అందించాలని ఈడీ అడిగింది. గొర్రెల కొనుగోళ్ళు జరిగిన ఏజెన్సీలేవి, ఏ సంవత్సరంలో ఎన్ని గొర్రెలను కొన్నారు, పంపిణీ చేశారనే వివరాలను ఈడీ కోరింది.

గొర్రెల కుంభకోణంపై శాఖాపరంగా జరిగిన విచారణ నివేదికను కూడా తమకు అందించాలని ఈడీ ఉన్నతాధికారులను అడిగింది. ఇప్పటికే కుంభకోణానికి బాధ్యులుగా పదిమందిని అరెస్టుచేసి రిమాండులో ఉంచారు. ఈ పదిమందిని ఏసీబీ ఉన్నతాధికారులు విచారించినా పెద్దగా సహకరించలేదని సమాచారం. మూడురోజుల కస్టడీ గడువు ముగియటంతో గురువారం పశుసంవర్ధక శాఖ సీఈవో రామచంద్రనాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ తదితరులను చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు. తొందరలోనే ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయి. ఈడీ విచారణ మొదలుపెడితే కుంభకోణం లోతులు ఎంతన్నది బయటపడే అవకాశముంది.

Tags:    

Similar News