దళితబంధు పథకం అమలుపై భట్టి రివ్యూ

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దళితబంధు పథకంపై రివ్యూ జరిపారు.

By :  Vanaja
Update: 2024-08-03 10:53 GMT

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దళితబంధు పథకంపై రివ్యూ జరిపారు. శనివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండల కేంద్రంలో దళిత బంధు పథకం అమలు సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను దళితబంధు అమలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు దారి మళ్లీతే సహించను అని భట్టి హెచ్చరించారు. వారం లోపల దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలి అని సూచించారు. దళిత బంధు దుర్వినియోగంలో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన దళిత బంధు లబ్ధిదారులకు వారంలోగా రెండవ దశ నిధులు విడుదల చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.

అధికారులకు భట్టి సూచనలు...

దళిత బంధు పథకంలో చింతకాని మండలం శాచ్యురేషన్ పద్ధతిలో ఎంపికైంది. మండలంలో అన్ని గ్రామాలను స్పెషల్ ఆఫీసర్లు విజిట్ చేసి దళిత బంధు పథకం కింద లబ్ధి పొందిన వారిని గుర్తించి వివరాలు సేకరించండి. దళిత బంధు కింద మంజూరైనవి లబ్ధిదారుల వద్ద ఉన్నాయా? లేదా? అవి దారి మళ్లాయా గుర్తించాలి. ఇతరులకు అమ్మారా, బదిలీ చేశారా గుర్తించాలి. వాటన్నిటిని వారంలోగా గుర్తించి తిరిగి లబ్ధిదారులకు ప్రత్యేక అధికారులు అందించాలి. దళిత బందు పథకం కింద మంజూరైన యూనిట్లను అమ్మడం బదిలీ చేయడం నేరం. ఈ పథకం కింద మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన వారిని గుర్తించండి వారంలోగా రెండవ దశ నిధులను విడుదల చేస్తాం. లబ్ధిదారులు స్మాల్ స్కేల్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైతే ఇండస్ట్రియల్ పార్కును మంజూరు చేస్తాం. చింతకాని మండలం శాచ్యురేషన్ పద్ధతిలో ఎంపిక కాగా నియోజకవర్గంలో మరో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ లబ్ధిదారుల వివరాలను వారంలోగా సేకరించండి.

జేసీబీలు, ట్రాలీలను ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ పనులలో ఉప యోగించాలి. అవసరం అయితే అధికారులు జేసీబీ యజమానులకు, కాంట్రాక్టర్లకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించి వాటిని ప్రభుత్వ పనుల్లో ఉపయోగించేలా చేయాలి. దళితబంధు పథకం వందకువంద శాతం విజయవంతం కావాలి. స్పెషల్ అధికారుల వద్ద సరియైన సమాచారం లేదు. దళిత బంధు పథకం లో లబ్ధి పొందిన వారు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే సమాచారాన్ని నిరంతరం ప్రత్యేక అధికారులు జిల్లా కలెక్టర్ కి సమాచారం అందించాలి. లబ్ధిదారులు తమ పథకాన్ని మరొకరికి అమ్ముకోవడం గాని వేరొకరికి దారాదత్తం చేయడానికి వీల్లేదు. దళిత బంధు పథకం లబ్దిదారులు ఆ పథకం ఎలా నిర్వహిస్తున్నారు చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. నూటికి నూరు పాళ్ళు దళిత బంధు లబ్దిదారులు వ్యాపారం చేయాల్సిందే... వారి వద్దనే వ్యాపారానికి కేటాయించిన పథకాలు ఉండాలి అని భట్టి అధికారులకు స్పష్టం చేశారు.

Tags:    

Similar News