SLBC టన్నెల్‌ సహాయ పనుల్లో ఆర్మీ ఇంజినీర్లు

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల్ కూలిన ప్రాంతంలో శుక్రవారం సికింద్రాబాద్ కు చెందిన భారత సైనిక ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సహాయ పనులు చేస్తోంది.;

Update: 2025-02-28 15:18 GMT

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) టన్నెల్ కూలిన ప్రాంతంలో శుక్రవారం సికింద్రాబాద్ కు చెందిన భారత సైనిక ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సహాయ పనులను ముమ్మరం చేసింది. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు టన్నెల్ లోపలకు వెళ్లిన ఆర్మీ బృందం 12 గంటల పాటు శ్రమించి శిథిలాలను తొలగించారు. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు తమ ఆర్మీ సిబ్బంది టన్నెల్ బయటకు వచ్చారని సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఆర్మీ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. టన్నెల్ లోపల శుక్రవారం ఆర్మీ సిబ్బంది సహాయ పనుల ఫొటొలు, వీడియోలను ఆర్మీ అధికారులు ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి ఇచ్చారు.




 శిథిలాలను తొలగిస్తున్నాం...

టన్నెల్ లోపల శిథిలాలను తొలగిస్తున్నామని సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఆర్మీ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు తెలిపారు. టన్నెల్ లో సహాయ కార్యక్రమాల కోసం శుక్రవారం ఎక్స్ వేటర్ ను తెప్పించామని అధికారులు చెప్పారు. బురద తొలగింపు, నీళ్లను తొడటంతో తమ ఆర్మీ సిబ్బంది శ్రమిస్తున్నారని ఆయన వివరించారు.



 సహాయ పనులకు మరో రెండురోజుల సమయం పడుతుంది : బలరాం, సీఎండీ సింగరేణి కాలరీస్

ఎస్ ఎల్ బి సి టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందని సింగరేణి కాలరీస్ సీఎండీ బలరాం చెప్పారు.ఎన్జిఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించారని ఆయన తెలిపారు.కానీ కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరామని బలరాం తెలిపారు.అవి వచ్చాకే ఆచూకీ లభించని కార్మికులను గుర్తించే అవకాశం ఉందన్నారు.అప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.



 రెండు ముక్కలైన టీబీఎం

టన్నెల్ బోలింగ్ మిషన్ రెండు ముక్కలైంది.టన్నెల్ ప్రమాద ఘటనలో 13.6 కిలోమీటర్ల వద్ద ఒక ముక్క ఉందని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. 13.9 కిలోమీటర్ల తర్వాత మరో ముక్క పడ్డట్టు గుర్తించామని వారు పేర్కొన్నారు.



 టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం: కలెక్టర్ సంతోష్

ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ చెప్పారు. తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దు అని కోరారు.గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయన్నారు.ఏదైనా సమాచారం ఉంటే.. తాము అధికారికంగా వెల్లడిస్తామని కలెక్టర్ వివరించారు.


Tags:    

Similar News