ఏపీ సీఎం సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు, సినీనటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు శనివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By : Shaik Saleem
Update: 2024-11-16 14:39 GMT
చంద్రగరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయడు గుండె సమస్యలతో శనివారం కన్నుమూశారు. ఈయన వయసు 72 సంవత్సరాలు. ఈయనకు భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీశ్ లున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో తన తమ్ముడు రామ్మూర్తినాయుడి పార్థివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.చంద్రబాబు శనివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ వచ్చారు.శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సీఎం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. తమ్ముడి కుమారులు రోహిత్, గిరీష్‌ను చంద్రబాబు ఓదార్చారు.
తన చిన్నాన్న ఆరోగ్యం గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ శనివారం మధ్యాహ్నమే హైదరాబాద్ వచ్చారు. ఆదివారం రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు చేపట్టనున్నట్లు నారా కుటుంబసభ్యులు చెప్పారు. ‘‘నా తమ్ముడు మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో చెబుతున్నాను. మా కుటుంబంలో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’అని చంద్రబాబు ఎక్స్ లో పోస్టు చేశారు. రామ్మూర్తినాయుడి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడు తదితరులు రామ్మూర్తినాయుడికి నివాళులు అర్పించారు. పలువురు ప్రముఖులు గచ్చిబౌలి ఆసుపత్రికి వచ్చి రామ్మూర్తినాయుడు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.