అంత్యక్రియలు చేస్తుండగా... చనిపోయాడునుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు!!

ఎల్లప్ప అనే వ్యక్తి మరణించాడని తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తీవ్ర దుఃఖంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో ఓ ఫోన్ కాల్ వచ్చింది.

By :  Vanaja
Update: 2024-06-24 08:46 GMT

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాంద్గీ గ్రామంలో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎల్లప్ప అనే వ్యక్తి మరణించాడని తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తీవ్ర దుఃఖంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎల్లప్ప బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో అంతా షాక్ అయ్యారు. మరి ఎల్లప్ప అనుకుంటున్న ఆ మృతదేహం ఎవరిదీ? ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

వికారాబాద్ జిల్లా నవాంద్గీ గ్రామానికి చెందిన ఎల్లప్ప అనే వ్యక్తి రెండు రోజుల క్రితం తాండూరుకు వెళ్లి సిమెంటు బస్తాలు మోసే హమాలీగా చేరాడు. అక్కడ పనిచేసే ఓ గుర్తుతెలియని వ్యక్తి, ఎల్లప్ప కలిసి తాండూరులో మద్యం తాగారు. ఎల్లప్ప మత్తులోకి జారుకోగానే.. మరో వ్యక్తి అతడి వద్ద ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ తస్కరించి పారిపోతుండగా వికారాబాద్ రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతి చెందాడు.

అయితే అక్కడ లభించిన సెల్ ఫోన్ లోని కాల్ డేటా ఆధారంగా అతడిని ఎల్లప్పగా భావించి కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. మృతదేహం ముక్కలై ఉండటంతో.. ఎల్లప్పదేనని పొరపాటు పడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వారి గ్రామానికి తీసుకెళ్లారు. అయితే అక్కడే పనిచేస్తున్న బషీరాబాద్, నవాంద్గీకి చెందిన కొందరు హమాలీలు ఆదివారం ఉదయం ఎల్లప్పను గమనించారు. అతని వద్దకు వెళ్లి మాట్లాడగా.. అసలు విషయం బయటపడింది. దీంతో ఎల్లప్ప కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అంత్యక్రియల్ని ఆపేయాలని చెప్పాడు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు.

Tags:    

Similar News