తెలంగాణలో పోడు,ప్రాజెక్టుల కోసం 12 లక్షల ఎకరాల అడవులను నరికారు

తెలంగాణలో పోడు పట్టాలు, ప్రజాఅవసరాలు, ప్రాజెక్టుల పేరిట అటవీ విస్తీర్ణం నానాటికి తగ్గిపోతోంది.5 దశాబ్దాల్లో 12 లక్షల ఎకరాలు అంటే 10 శాతం అడవి అంతర్ధానం అయింది.;

Update: 2025-04-08 06:03 GMT
పోడు సేద్యం : అంతరించిపోతున్న అడవి

తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ రెగ్యులేషన్ యాక్ట్ కు విరుద్ధంగా అటవీ భూములను పోడు పేరిట అనర్హులకు ధారాదత్తం చేశారు.ఓట్ల కోసం అప్పటి సీఎం కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జులై నెలలో తెలంగాణలో 4 లక్షల ఎకరాల అటవీ భూములకు పట్టాలు ఇచ్చారు.అటవీ భూములకు కూడా పట్టాలివ్వడంతో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అటవీ భూములను పంపిణీ చేస్తున్నారు. ఇలా మూడు సార్లు పోడు పేరిట భూములను పంపిణీ చేయడం వల్ల తెలంగాణలో 8 లక్షల ఎకరాల అడవులు అంతర్ధానం అయ్యాయి. మరో వైపు ప్రాజెక్టులు, ప్రజా అవసరాల పేరిట మరో 4లక్షల ఎకరాల అటవీ భూములు అదృశ్యమయ్యాయి. దీంతో మొత్తం మీద తెలంగాణలో 12 లక్షల ఎకరాల అటవీ భూములు పోడు, ప్రజా అవసరాల పేరిట దారి మళ్లాయి. దీంతో తెలంగాణలో పర్యావరణానికి తీవ్ర విఘాతం వాటిల్లింది.ఉపగ్రహ ఛాయాచిత్రాలు, డీఎఫ్ఓల నివేదికల ప్రకారం పోడు భూములకే పట్టాలివ్వాలని అటవీశాఖ అధికారులు కోరినా, దాన్ని కాదని గ్రామ సభ నిర్ణయం మేరకు అనర్హులకు కూడా పోడు పట్టాలిచ్చారు.


‘పోడు’పట్టాలతో తగ్గిన తెలంగాణ అటవీ విస్తీర్ణం
తెలంగాణలోని అడవుల్లో దశల వారీగా ఇచ్చిన పోడు పట్టాలతో తెలంగాణలో అడవుల విస్తీర్ణం తగ్గింది.2023వ సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ 1980కు విరుద్ధంగా 4 లక్షల ఎకరాల అటవీ భూమిలో పోడు పేరిట పట్టాలిచ్చింది. అటవీ భూముల్లో పోడు పేరిట దశలవారీగా పట్టాలు ఇస్తున్న కొద్దీ అటవీ గ్రామాల ప్రజలు అడవులను నరికివేస్తూ యథేచ్ఛగా పోడు సాగు చేశారు. దీంతో ఎన్నికల్లో ఓట్ల కోసం 2023వ సంవత్సరంలో పోడు పట్టాలిస్తామని అప్పటి బీఆర్ఎస్ సర్కారులో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మేరకు అటవీగ్రామాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించి 2023 నవంబరు 5వతేదీన ప్రభుత్వం ఉత్తర్వు ద్వారా పట్టాలిచ్చారు. తెలంగాణ వచ్చిన పదేళ్లలో 10 శాతానికి పైగా అటవీ భూమి పోడు సాగు పేరిట పట్టాలిచ్చారు. దీంతో అటవీ విస్తీర్ణం తెలంగాణలో గణనీయంగా తగ్గింది.

నిజాం హయాంలో...
1940వ సంవత్సరంలో అప్పటి నిజాం ప్రభుత్వం హెమన్ డార్ఫ్ సిఫార్సుల మేరకు 50వేల ఎకరాల పోడు అటవీ భూములను రెగ్యులరైజ్ చేస్తూ మొదటిసారి పట్టాలిచ్చారు.ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980వ సంవత్సరంలో అమలులోకి రాగా దానికి ముందే 1970వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.41 లక్షల ఎకరాల అటవీ భూములకు పోడు పేరిట పట్టాలిచ్చారు.

 3.31 లక్షల ఎకరాలకు ‘పోడు’ పట్టాలు
2006వ సంవత్సరంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలులోకి రావడంతో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ పార్లమెంటరీ కమిటీ ఉమ్మడి ఏపీలోని అటవీ పోడు భూములను సందర్శించి 2005 డిసెంబరు 13వతేదీ నాటికి పోడు సాగులో ఉన్న అటవీ భూములకు అర్హులైన వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 2005 కటాఫ్ తేదీగా నిర్ణయించి ఇక ముందు పోడు సేద్యాన్ని ప్రోత్సహించకుండ ఉండేలా చివరి సారి అంటూ 99,486 మందికి 3,31,070ఎకరాల అటవీ భూములకు 2006వ సంవత్సరంలో పట్టాలు జారీ చేశారు.

తెలంగాణలోని అటవీ విస్తీర్ణంలలో 10.71 శాతం భూములకు పోడు పట్టాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తగ్గినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తేలింది. దేశంలో అడవుల సంరక్షణ కోసం 1865వ సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ను రూపొందించారు.ఈ చట్టాన్ని 1878, 1929 సంవత్సరాల్లో సవరించారు. అడవులను కాపాడేందుకు 1988వ సంవత్సరంలో ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ఏర్పాటు చేశారు. 2023వ సంవత్సరంలో అటవీ సంరక్షణకు నేషనల్ ఫారెస్ట్ కమిషన్ ను నెలకొల్పారు.

ప్రాజెక్టుల కోసం అటవీ భూముల మళ్లింపు
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణం కోసం అటవీ భూములను మళ్లించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక అడవులను ప్రజా ప్రయోజనాలు, మౌలిక సదుపాయాల కల్పన పేరిట నరుకుతూ వచ్చారు. గడచిన పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో 4,28,,437 లక్షల ఎకరాల అటవీ భూమిని మళ్లించినట్లు అటవీశాఖ రికార్డులే చెబుతున్నాయి. 2014వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు అడవుల నరికివేతతో అడవుల విస్తీర్ణం మూడోస్థానానికి పడిపోయింది. అడవుల విస్తీర్ణంలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో గత పదేళ్లలో 114 .22 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని అభివృద్ధి ప్రాజెక్టులకు ఇచ్చామని మార్చి 25వతేదీన లోక్ సభలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 7,829 ఎకరాల అటవీభూమి మళ్లింపు
కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, కాల్వల నిర్మాణం కోసం 7,829 ఎకరాల్లో అడవులను నరికివేశారు. కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, భువనగిరి యాదాద్రి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అటవీ భూమిని మళ్లించారు.మిషన్ భగీరథ పైపు లైన్లు, ఆప్టికల్ ఫైబర్ లైన్లు,రోడ్ల నిర్మాణం కోసం అటవీ స్థలాలను ఉపయోగించారు. బీఎస్ఎన్ఎల్ 4 జీ టవర్ నిర్మాణం కోసం ములుగు అటవీ డివిజన్ లోని బండ్లపాడులో అటవీ భూమిని మార్పిడి చేశారు. ప్రజాఅవసరాల పేరిట అటవీ భూములను మళ్లించి నరికివేస్తూ, ఆ స్థానంలో మళ్లీ అడవులు పెంచడం లేదు. 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది. ఇందులో ఆదిలాబాద్,భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్,ములుగు, ఖమ్మం జిల్లాల్లో అటవీ భూమి విస్తీర్ణం తగ్గిందని అటవీ శాఖ రికార్డులే తేటతెల్లం చేస్తున్నాయి.

ఫోరం పర్ గుడ్ గవర్నెన్స్ లేఖలు
తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూముల భూ బాగోతాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా కేంద్ర పర్యావరణ కమిటీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి లేఖలు రాసింది. మూడు విడతలుగా నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల కోసం పోడు పట్టాల పంపిణీ ప్రహసనంగా మారిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇలా దశలవారీగా పోడు పేరిట అటవీ భూములకు పట్టాలు ఇస్తుండటం అడవుల నరికివేత, పోడు సేద్యానికి తెరపడటం లేదని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. అటవీ భూముల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

జీవవైవిధ్యం కోసం అడవులను రక్షించుకోవాలి : ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, పర్యావరణ నిపుణులు
జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను పరిరక్షించుకోవాలని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.చెట్లు నరకడం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అడవులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పోడు సేద్యం, అటవీ శాఖ అధికారుల అవినీతి, ప్రాజెక్టులు, అభివృద్ధి పేరిట అడవులు అంతరించి పోతున్నాయని చెప్పారు. అభివృద్ధి పేరిట చెట్లను కొట్టేసి అడవిని నాశనం చేయడం తగదని చెప్పారు.

అడవులే కాదు చెట్లను కాపాడు కోవాలి : యాక్టివిస్ట్ డాక్టర్ లుబ్నా సార్వత్
తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అటవీ భూములే కాదు చెట్లున్న అన్ని రకాల భూములను కాపాడాలని సోషల్ యాక్టివిస్టు డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అటవీ భూమలే కాకుండా చెట్లు ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ భూముల్లో కూడా చెట్లు నరకరాదని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పిందని, దీని ప్రకారం చెట్ల నరికివేత తగదన్నారు. ఇక ముందు పోడు పట్టాలు ఇవ్వకుండా అడవులను పరిరక్షించాలని డాక్టర్ లుబ్నా సూచించారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఉన్న చెట్లను నరకకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.



Tags:    

Similar News