ఎవరీ రామసహాయం రఘురాం? రెడ్డా, కమ్మా!

డబ్బుకు కులం మతం ఉండదనేది అందరికీ తెలిసినా.. వాడు మనోడేనా అని అడగడం పరిపాటైంది. ఇప్పుడు ఖమ్మం పార్లమెంటరీ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలోనూ అదే శోధన జరుగుతోంది.

By :  Admin
Update: 2024-04-25 04:38 GMT

ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అనేక మలుపులు, సుదీర్ఘ మంతనాల తర్వాత ఆయన పేరు బయటికి వచ్చింది. ఇంతకీ ఆయన ఎవరు, ఆయనకి సీటు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఏమిటన్నది ప్రస్తుతం చర్చసాగుతోంది. ఆయనకు ఎంత పలుకుబడి లేకుంటే ఇంతటి సీటు ఇచ్చి ఉంటారు?

చేగొమ్మ నుంచి ప్రస్థానం...

రామసహాయం రఘురాం రెడ్డి 1961, డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ. హైదరాబాద్ నిజాం కళాశాలలో బీకామ్ చదివారు. ఆ తర్వాత పీజీ డిప్లొమా చేశారు. ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలోనే పుట్టి పెరిగారు. సురేందర్ రెడ్డి కూసుమంచి మండలంలోని జీళ్ళచెర్వు, చేగొమ్మ, ముత్యాలగూడెం గ్రామాలకు, ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్ గా పనిచేశారు.
రాజకీయ వారసత్వమే...
రామసహాయం రఘురాం రెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒక వైపు వ్యాపారాలు చేస్తూనే.. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది.
కాంగ్రెస్ పార్టీలో నిర్వర్తించిన బాధ్యతలు

రఘురాం రెడ్డి 1985లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా పనిచేశారు. 1989, 1991లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు, వరంగల్ లోక్ సభకు ఇన్ చార్జ్ గా ఉన్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో రాజ్యసభకు, 2014లో ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా చివరి నిమిషంలో అవి వేరే వారిని వరించాయి. 2014లో పాలకుర్తి, 2018లో పాలేరు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. రఘురాం రెడ్డి 2011-2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ ) ప్యాట్రన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్ గా , హైదరాబాద్ రేస్ క్లబ్ లో బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
సినీనటుడు వెంకటేశ్ కుటుంబంతో వియ్యం..
రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విధంగా ఆయన ఓ బలమైన సామాజిక వర్గానికి దగ్గరి చుట్టమయ్యారు. ఇక ఆయన చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు. అందువల్ల ఆయనకు తెలుగురాష్ట్రాలలోని రెండు పేరున్న సామాజిక వర్గాలకు ఆప్తుడు.
రఘురాం రెడ్డితో పాటు వారి తాతముత్తాతలు సేవాదృక్పథ కుటుంబానికి చెందిన వారు. మరిపెడ- బంగ్లా లో ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలుగా కొనసాగుతున్న మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్టీసీ బస్టాండ్, పీహెచ్ సీ లు , ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలు, టిటిడి కల్యాణ మండపాలకు దశాబ్దాల కాలం కిందటే ఉచితంగా స్థలాలను కేటాయించారు. వరంగల్ లో రెడ్డి ఉమెన్స్ హాస్టల్ ను నిర్మించారు. అనేక ప్రాంతాల్లో రామాలయాలను, శివాలయాలను, వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. వారి స్వగ్రామమైన కూసుమంచి మండలం చేగొమ్మలో వారి ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఉచితంగా ఇచ్చారు. పీహెచ్ సీ , చేగొమ్మ హరిజన కాలనీకి కూడా స్థలాలను ఉచితంగా అందజేసింది రఘురాం రెడ్డి కుటుంబీకులే.
Tags:    

Similar News