కర్ణాటకవాసులకు సీఎం సిద్ధరామయ్య అభయమేంటి?

ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

Update: 2024-08-15 10:36 GMT

 ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరులో మానేక్షా పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం ప్రసంగించారు. సందర్భంగా సిద్ధరామయ్య కేంద్ర తీరును తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వం ఫెడరల్‌ వ్యవస్థను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపడం సరికాదన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న వాస్తవాన్ని కేంద్రం గ్రహించాలని సూచించారు. తమకు న్యాయబద్ధంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఎవరి చేతిలోనూ కీలుబొమ్మ కాకూడదన్నారు.

ప్రతి లబ్దిదారు కుటుంబానికి నెలకు రూ. 5వేలు

ఆర్థిక అసమానతలతో బాధపడుతున్న ప్రజలకు తమ ఐదు హామీలు ఉపశమనం కలిగించాయని చెప్పారు. గృహలక్ష్మి, శక్తి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి పథకాల గురించి ప్రస్తావిస్తూ.. ప్రతి లబ్ధిదారుని కుటుంబం నెలకు సగటున రూ. 4,000 నుంచి రూ. 5,000 వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందుతుందని చెప్పారు.

‘‘పేద కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం చేసే యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ కాన్సెప్ట్ ఇది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి పథకాలను పెద్దఎత్తున అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే. మా పథకాలన్నీ కొనసాగుతాయి. పథకాల అమలుతో రాష్ట్రం దివాళా తీస్తుందని జోస్యం చెప్పిన వారికి రాష్ట్ర ఆర్థికాభివృద్దే తగిన సమాధానం చెబుతుందన్నారు.

తమ ప్రభుత్వం నూతన ఆవిష్కరణలతో లబ్ధిదారులకు మరింత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. "లబ్ధిదారుల కుటుంబాల్లోని ప్రతి మహిళా పెద్దకు రూ. 2,000 అందిస్తున్నాం. స్త్రీ శక్తి మహిళా స్వయం సహాయక బృందాల ఏర్పాటుతో మహిళలను తమ కాళ్లమీద తామే నిలబడేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.

Tags:    

Similar News