జీబీఏ తొలి సమావేశంలో సీఎం సిద్ధరామయ్య ఏం మాట్లాడారు?
వ్యయపరిమితి పెంపు గురించి మాట్లాడిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..
ఐదు కార్పొరేషన్లు కలిసి కొత్తగా ఏర్పాటయిన గ్రేటర్ బెంగళూరు అథారిటీ(GBA) ప్రారంభ సమావేశానికి కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) శనివారం అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా మొత్తం 75 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు పౌరులకు మెరుగైన సేవలందించేందుకు బెంగళూరు అభివృద్ధి సంస్థ (BDA)తో బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB), బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ (BESCOM), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL), మిగతా సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఐదు మున్సిపల్ కార్పొరేషన్లకు పాలనా కార్యాలయాల నిర్మాణం కోసం తగిన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఏర్పాటు వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. GBA సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చని సూచించారు.
నగరవాసులకు చెత్త సమస్య లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్లు, మురుగునీటి నిర్మాణం, ఫుట్‌పాత్‌లను ఇంకాస్త విస్తరించాలని అధికారులను ఆదేశించారు.
బీజేపీ (BJP) సభ్యుల బహిష్కరణ..
‘‘బీజేపీనుఉద్దేశించి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. " బెంగళూరు అభివృద్ధిని వ్యతిరేకించే వారు, అధికార వికేంద్రీకరణను వ్యతిరేకించే వారు ఈ సమావేశాన్ని బహిష్కరించారు."
శుక్రవారం జరిగిన సమావేశాన్ని బీజేపీ సభ్యులు బహిష్కరించారు. కెంపెగౌడ స్థాపించిన నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం "విభజించిందని" ఆరోపించారు. పట్టణ స్థానిక సంస్థలకు మునిసిపల్ విషయాలపై చట్టాలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి అధికారం ఇచ్చే 74వ రాజ్యాంగ సవరణను ఉల్లంఘించిందని ధ్వజమెత్తారు. సమావేశ ఎజెండాను పంపడంలో కూడా ఆలస్యం చేశారని ఆరోపించారు.
‘‘ఆలస్యంగా సమాచారం.’’
నాద ప్రభు కెంపెగౌడ స్థాపించిన బెంగళూరును కాంగ్రెస్ ప్రభుత్వం "విభజించిందని" బీజేపీ నాయకుడు ఆర్ అశోక విలేకరులతో అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నగరాన్ని తిరిగి కలుపుతామని హామీ ఇచ్చారు. సమావేశం గురించి 7 రోజుల ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉండగా.. గురువారం మాత్రమే ఫోన్ కాల్స్ చేసారని, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎజెండా పంపారని, సాయంత్రం 4 గంటలకు సమావేశం జరిగిందని చెప్పారు.
‘వ్యయపరిమితి పెంపు..’
"నగర ప్రణాళికా అధికారం, అభివృద్ధి హక్కులను BDA నుంచి GBAకి మార్చాం. మునిసిపల్ కమిషనర్ల వ్యయ పరిమితిని రూ. కోటి నుంచి రూ. 3 కోట్లకు పెంచాం. ఆ లెక్కన 5 కార్పొరేషన్ల((Corporations) కమిషనర్లకు రూ. 15 కోట్లు మంజూరవుతాయి. స్టాండింగ్ కమిటీ వ్యయ పరిమితి రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచారు. ఐదు మునిసిపాలిటీ స్టాండింగ్ కమిటీలకు రూ. 25 కోట్లు కేటాయించారు. మేయర్ వ్యయ పరిమితిని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచారు. ఐదు కార్పొరేషన్లకు రూ. 50 కోట్లు మంజూరవుతుంది." అని డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పారు.