హీట్ వేవ్ తో అల్లాడుతున్న కేరళ.. దీనికి తోడు పవర్ కట్ అంటూ..
దేవభూమి కేరళ ఎండవేడితో అల్లాడిపోతోంది. హీట్ వేవ్ కు తోడు, పవర్ కట్ లు కూడా ఉంటాయని విద్యుత్ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
By : Praveen Chepyala
Update: 2024-05-01 10:47 GMT
పెరిగిన ఎండలు, హీట్ వేవ్ తో కేరళ అల్లాడుతోంది. దీనికి తోడు ఇక నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు అమలు అవుతాయని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. పెరిగిన ఎండల కారణంగా విపరీతంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, ఇక నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, ప్రజలు మన్నించాలని కోరింది.“మమ్మల్ని విరోధులుగా చూడొద్దు; విద్యుత్తు అంతరాయాలకు మేము బాధ్యత వహించము; ఎందుకంటే ఇది పూర్తిగా సాంకేతికమైనది, ”అని KSEB పత్రికా ప్రకటన విడుదల చేసింది.
విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ కు తగ్గ సప్లై ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నామని పత్రికా ప్రకటనలో విద్యుత్ శాఖ హైలైట్ చేసింది. సోమవారం (ఏప్రిల్ 29) నాటికి విద్యుత్ వినియోగంలో రాష్ట్రంలో ఒక కొత్త రికార్డు నమోదైంది, రోజువారీ విద్యుత్ వినియోగం 113.15 మిలియన్ యూనిట్లకు చేరుకుంది, ఇది ఏప్రిల్ 19, 2023న నమోదైన 102.99 మిలియన్ యూనిట్లను అధిగమించింది. సోమవారం రాత్రి నాటికి అదనంగా మరో 5, 717 యూనిట్లకు చేరుకుంది. దీంతో విద్యుత్ శాఖ ఏం చేయాలో తెలియక తలపట్టుకుంది.
ఆటోమేటిక్ షట్ డౌన్..
11 కెవి, 33 కెవి ఫీడర్‌లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ డిమాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎడిఎంఎస్) కారణంగా, లోడ్ గరిష్ట సామర్థ్యాన్ని మించిపోయినప్పుడు ఈ వ్యవస్థలు వాటంతట అవే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తాయని కెఎస్‌ఇబి వివరించింది. పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించడానికి, బయట నుంచి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా పెరిగిన ఎండవేడికి విద్యుత్ వినియోగం తారాస్థాయికి చేరినట్లు, డిమాండ్ కు తగ్గ సప్లై లేనట్లు అర్థమవుతోంది.
నేషనల్ పవర్ ఎక్స్ఛేంజ్ నుంచి అధిక పవర్ డ్రా చేసుకుంటే గ్రిడ్ పతనం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని నివారించడానికి ADMSని అమలు చేసింది. కేటాయించిన పరిమితికి మించి విద్యుత్ వినియోగం మించిపోయినట్లయితే, సిస్టమ్ ఎంపిక చేయబడిన సబ్‌స్టేషన్‌లలో షట్‌డౌన్‌లను ప్రారంభిస్తుంది. అందువల్ల పీక్ అవర్స్‌లో విద్యుత్తు అంతరాయాలకు దారి తీస్తుంది.
వినియోగాన్ని నివారించనట్లైయితే..
గ్రిడ్ వైఫల్యాన్ని నివారించడానికి ఇన్‌స్టాల్ చేయబడిన ADMS ఒక క్లిష్టమైన రక్షణగా పనిచేస్తుంది. విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడంలో విఫలమైతే సమీప భవిష్యత్తులో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందని బోర్డు పేర్కొంది. విద్యుత్ వినియోగదారులు రాత్రి విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరింది. ఇంట్లో ఉన్న ఏసీలు పూర్తిగా నిషేధించడం సాధ్యం కాకపోయినా, వాటి సంఖ్యను వినియోగాన్ని తగ్గించాలని కోరింది. ఈ పద్ధతిలో విద్యుత్ వ్యవస్థలపై లోడ్ తక్కువగా పడే అవకాశం ఉందని సూచించింది.
హీట్ వేవ్ హెచ్చరికలు..
గోరు చుట్టూ రోకటి పోటులా వాతావరణ శాఖ కేరళలో హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజుల్లో ఎండలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పాలక్కాడ్ జిల్లాలో మరో 4-5 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. వీటికి తోడు కేరళ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది, తీర ప్రాంతాలలో తేమ స్థాయి 55-65% వరకు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఉక్కపోత, విపరీతమైన చెమట తో ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
పర్యాటకం దెబ్బతింది
ఫిబ్రవరి నుంచి విపరీతమైన వేడి, పర్యాటకంపై ప్రభావాన్ని చూపింది. దేశీయ పర్యాటకుల రాకపోకలు గణనీయంగా తగ్గాయని పరిశ్రమలోని ప్రముఖులు నివేదించారు, మున్నార్ టూరిస్ట్ లోకేషన్ లో పర్యాటకులు 30 నుంచి 40 శాతం తగ్గారు. మరో వైపు తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్ వంటి హిల్ స్టేషన్లలో పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. నీటి కొరత కారణంగా ప్రభుత్వం కూడా టూరిస్టుల సంఖ్యను పరిమితం చేసింది. ఇక్కడ ఎండవేడి కూడా 29 డిగ్రీలు నమోదు అయింది. ఇది సగటు కంటే 5.4 డిగ్రీలు ఎక్కువ.
వేసవి సెలవుల్లో సందర్శకులు, వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు, ఊటీ, కొడైకెనాల్ నివాసితులు కాని వారు ఈ హిల్ స్టేషన్‌లలోకి ప్రవేశించడానికి మద్రాస్ హైకోర్టు ఇ-పాస్‌లను తప్పనిసరి చేసింది.
"ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీని ఫలితంగా బుకింగ్ మొత్తం పడిపోయాయి. ఎన్నికలు, వేడి గాలుల కారణంగా ప్రయాణాలు కష్టంగా ఉంటున్నాయి. ఇవి రెండు కారణాలతో పర్యాటకం ప్రభావితం అవుతోంది" అని మున్నార్‌లోని హోటల్ వ్యాపారి శైలేష్ ఎస్ చెప్పారు.
ఆరోగ్య జాగ్రత్తలు..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్య స్థాయికి పెరగడంతో, 10 మంది వడదెబ్బకు గురైయ్యారని స్థానిక వార్తామాధ్యమాలు వెల్లడించాయి. పరిస్థితి విషమించడంతో అంగన్‌వాడీలను వారం రోజుల పాటు మూసివేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఈ సమయంలో, సాధారణంగా ఈ కేంద్రాలలో అందించే అనుబంధ పోషకాహారం పిల్లల ఇళ్లకు పంపిణీ చేయబడుతుంది.
ఇంకా, ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ITIలు) రెండూ మే 4 వరకు మూసివేసినట్లు ప్రకటించింది. ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ కోసం శిక్షణా తరగతులు పూర్తి కానందున, ITIలు ఈ విరామ సమయంలో ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తాయి. పగటి పూట బయటకు వెళ్తే తప్పనిసరిగా గొడుగులు తీసుకెళ్లాలని సూచించింది. ఎక్కువగా నీళ్లుతాగాలని , మధ్యాహ్నం వేళ అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించింది.