‘2050 నాటికి శబరిమలను తిరుమలగా మారుస్తాం’

‘శబరిమల కేవలం ఆలయం కాదు.. ఆధ్యాత్మికతకు చిహ్నం. కుల, మతాలకు అతీతంగా అందరినీ స్వాగతించే పుణ్యక్షేత్రం.’- కేరళ సీఎం పినరయి విజయన్

Update: 2025-09-20 12:04 GMT
Click the Play button to listen to article

అయ్యప్ప పవిత్ర క్షేత్రం శబరిమల.. తిరుమల లేదా మధురై లాగా చేస్తామని కేరళ(Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్(C.M. Pinarayi Vijayan) చెప్పారు. 2050 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. పంపానది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘‘అయ్యప్ప సంగమం’’ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అయ్యప్ప సంగమం(Ayyappa Sangamam) విమర్శకులపై చిందులేశారు. కొంతమంది ప్రపంచ సదస్సును రాజకీయ ప్రేరేపితంగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప సంగమం రాత్రికి రాత్రే తయారయిన ప్రణాళిక కాదని, మలేషియా, సింగపూర్‌లోని భక్తుల అభిప్రాయాలు, సలహాలు, సూచనల అనంతరం జరిగిందని చెప్పారు.


‘శబరిమల కేవలం ఆలయం కాదు..’

‘శబరిమల కేవలం ఆలయం కాదు.. ఆధ్యాత్మికతకు చిహ్నం. కుల, మతాలకు అతీతంగా అందరినీ స్వాగతించే పుణ్యక్షేత్రం. ఇస్లాంను సూచించే వావర్ నాడను సందర్శించిన భక్తులు, తిరుగు ప్రయాణంలో అర్థుంకల్ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ప్రతిరాత్రి గర్భగుడిలో పాడే హరివరాసనం పాట ఒక క్రైస్తవుడు పాడాడు. ప్రపంచంలో ఇంత సామరస్యం ఎక్కడ దొరుకుతుంది?" అని పేర్కొన్నారు.

అయ్యప్ప సంగమం ప్రధాన అజెండాను ప్రస్తావిస్తూ.. విజయన్ శబరిమల మాస్టర్ ప్లాన్‌ను వివరించారు. సన్నిధానం, పంబా, ట్రెక్కింగ్ మార్గాన్ని దశలవారీగా రూ. 1,033 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. సన్నిధానంలో మొదటి దశ (2022-27) మాత్రమే రూ. 600 కోట్లు, రెండో దశలో (2028-33) రూ. 100 కోట్లు, మూడో దశలో (2034-39) రూ. 77 కోట్లు ఖర్చు చేయనున్నామని పేర్కొన్నారు. రద్దీ నియంత్రణకు పంబాను సర్క్యులేషన్ వ్యవస్థతో ట్రాన్సిట్ క్యాంప్‌గా అభివృద్ధి చేయనున్నామని, దీనికి రూ. 207 కోట్లు, అలాగే ట్రెక్కింగ్ పాత్ అభివృద్ధికి మరో రూ. 48 కోట్ల బడ్జెట్‌ అవసరమని చెప్పారు.

గత కేటాయింపులను వివరిస్తూ.. 2011-12లో మాస్టర్ ప్లాన్ కింద ప్రభుత్వం అభివృద్ధి కోసం రూ. 148.5 కోట్లు ఖర్చు చేసిందని, 2016-17, 2025 మధ్య దేవస్వం సంస్థల ఆధునీకరణ కోసం రూ. 650 కోట్లు మంజూరు చేసిందని విజయన్ చెప్పారు. ఇందులో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు రూ.145 కోట్లు, కొచ్చిన్ బోర్డు రూ. 26 కోట్లు, మలబార్ బోర్డు రూ. 305 కోట్లు, పద్మనాభస్వామి ఆలయం, కూడల్మాణిక్యం, హిందూ మత సంస్థల విభాగానికి అదనపు మొత్తాలు మంజూరు చేశామని వివరించారు.

ఒక్కశబరిమలలో మాస్టర్ ప్లాన్ కింద రూ. 84 కోట్లు, పారిశుధ్యం కోసం రూ.22 కోట్లు, రవాణా సౌకర్యాల కోసం రూ.116 కోట్లు, గత నాలుగు సంవత్సరాలలో పండుగ నిర్వహణ కోసం రూ. 10 కోట్లకు పైగా నిధులు అందాయని చెప్పారు. "దేవాలయ ఆదాయాన్ని ప్రభుత్వం దోచుకుంటుందనే ప్రచారం అబద్ధం. దీనికి విరుద్ధంగా, తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలలో కూడా దూపదీపం కోసం ప్రభుత్వ డబ్బులు ఖర్చు చేస్తుంది." అని విజయన్ వివరించారు.

ప్రారంభ సమావేశంలో దేవస్వం మంత్రి వి.ఎన్. వాసవన్.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సందేశాలను చదివి వినిపించారు. తమిళనాడు హిందూ మత, ధార్మిక ధార్మిక శాఖ మంత్రి పి.కె. శేఖర్‌బాబు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News