రతన్ టాటా మీడియాకు రాసిన చివరి లేఖ
టాటా ట్రస్టు ఛైర్మన్ రతన్ టాటా తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ చివరి లేఖ రాశారు.ఈ మేర రతన్ టాటా చివరి సారిగా మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
By : Shaik Saleem
Update: 2024-10-10 01:57 GMT
తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని తనకు వృద్ధాప్యం కారణంగా ఎదురైన ఆరోగ్య సమస్యలపై పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లానని రతన్ టాటా చివరి సారిగా మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
తన ఆరోగ్యం బేషుగ్గా ఉందని, తాను కేవలం వృద్ధ్యాప్యం కారణంగా ఎదురైన ఆరోగ్య సమస్యలపై పరీక్షలు చేయించుకునేందుకు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వచ్చానని రతన్ టాటా ఎక్స్ పోస్టులో మీడియాకు రాసిన చివరి లేఖను పోస్టు చేశారు. అదే లేఖ రతన్ టాటాకు చివరిదైంది. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల కారణంగా రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు.బుధవారం ఉదయం నుంచి రతన్ టాటా కండీషన్ కొంచెం సీరియస్ ఉందని వైద్యులు చెప్పారు. రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
సీఎం సంతాపం
భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తల్లో ఒకరైనరతన్ టాటా మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ,విచారం వ్యక్తం చేశారు. భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలో దూరదృష్టి గల నాయకుడు, మానవతావాది అని సీఎం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
‘‘రతన్ టాటా అసాధారణ నాయకత్వంలో, టాటా బ్రాండ్ అసమానమైన ఎత్తులకు ఎగబాకి, కొత్తఎత్తులను జయించి, ప్రతి భారతీయుని గర్వంతో నింపింది. భారతదేశాన్ని ప్రపంచ పారిశ్రామిక శక్తిగా మార్చడంలో ఆయన చేసిన సాటిలేని కృషి చెరగని ముద్ర వేసింది.రతన్ టాటా వ్యాపార శ్రేష్ఠత, తిరుగులేని నీతి, సామాజిక పనుల పట్ల నిబద్ధత, అతని వారసత్వం భవిష్యత్ తరాలకు, ఔత్సాహిక భారతదేశంలోని యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అని సీఎం పేర్కొన్నారు.
టాటా కుటుంబానికి,జరిగిన నష్టానికి సంతాపం వ్యక్తం చేస్తున్న అసంఖ్యాక భారతీయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హృదయపూర్వక సానుభూతిని తెలిపారు. రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, ఆయన స్ఫూర్తి మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని రేవంత్ తెలిపారు.