‘ఈ కేసుకు వాళ్లే సరి’
శబరిమల ఆలయం బంగారం కేసును S.I.Tతో కాకుండా C.B.Iతో దర్యాప్తు చేయించాలని బీజేపీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎందుకు పట్టుబడుతున్నారు?
శబరిమల ఆలయం బంగారం కేసు(Sabarimala temple gold case)ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) డిమాండ్ చేశారు. ఆలయం నుంచి బంగారాన్ని వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లారని, కేరళ(Kerala) వెలుపల ఉన్న వ్యక్తులు, కొన్ని సంస్థలకు ఇందులో ప్రమేయం ఉన్నందున ఈ కేసులో సమగ్ర దర్యాప్తు అవసరమని ఆయన కేరళ హైకోర్టు(Kerala High court)ను ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) అప్పగించింది. అయితే ఈ కేసులో రాష్ట్రేతర వ్యక్తుల ప్రమేయం ఉండడం, దేవస్థానం బోర్డు సభ్యులను కాపాడే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీబీ మాజీ సభ్యుడి కుమారుడు, ఐపీఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలను రాజీవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీబీ(TDB) ఆస్తులను క్షుణ్ణంగా ఆడిట్ చేయాలని కూడా పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ రాజా విజయరాఘవన్, కేవీ జయకుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌లో కొన్ని లోపాలను ఎత్తి చూపుతూ.. వచ్చే వారం మళ్ళీ పరిశీలిస్తామని చెప్పింది.
‘అది నా ఒక్కడి నిర్ణయం కాదు..’
ఇదిలా ఉండగా..ఈ కేసుకు సంబంధించి S.I.T అరెస్టు చేసిన టీడీబీ మాజీ అధ్యక్షుడు ఎ పద్మకుమార్ తనకు బెయిల్ కోరుతూ కొల్లం విజిలెన్స్ కోర్టును ఆశ్రయించారు. 'ద్వారపాలక' విగ్రహాల బంగారు పూత పలకలు, శ్రీకోవిల్ (గర్భగుడి) డోర్ ఫ్రేమ్‌ల తయారీ పనిని ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌కు అప్పగించాలని బోర్డు సంయుక్తంగా నిర్ణయం తీసుకుందని, అయితే ఈ కేసులో తనను మాత్రమే అరెస్టు చేయడం సమంజసం కాదని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారించనుంది. కాగా ఈ కేసులో S.I.T ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసింది. కేసు దర్యాప్తు పురోగతిని బుధవారం హైకోర్టు సమీక్షించనుంది.